గురువారం 09 ఏప్రిల్ 2020
Health - Mar 26, 2020 , 22:28:09

ఆల్కహాల్‌ శానిటైజర్‌గా పనిచేస్తుందా?

ఆల్కహాల్‌ శానిటైజర్‌గా పనిచేస్తుందా?

కరోనా నుంచి తప్పించుకోవడానికి వాడే శానిటైజర్‌లో ఆల్కహాల్‌ ఉంటుందంటున్నారు కదా? మరి మనం తాగే ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌తో చేతులు కడుక్కుంటే కరోనా ఇన్‌ఫెక్షన్‌ను తప్పించుకోవచ్చా? చికెన్‌ తినొద్దా?


కొవిడ్‌ 19 ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి.., శానిటైజర్‌ ఐప్లె చేసుకోవాలి. మనకు బయట దొరికే శానిటైజర్‌లో 70 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. కాబట్టి  ఇన్‌ఫెక్షన్‌ను నివారించ గలుగుతుంది. అయితే ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌లో ఆల్కహాల్‌ శాతం ఇంత ఎక్కువగా ఉండదు. స్ట్రాంగ్‌ ఆల్కహాల్‌లో కూడా 45 శాతానికి మించి ఉండదు. అందువల్ల ఆల్కహాల్‌తో చేతులు కడుక్కోవడం వల్లనో, ఆల్కహాల్‌ తాగడం వల్లనో కొవిడ్‌ 19 ఇన్‌ఫెక్షన్‌ని నివారించలేము. కొందరు క్లోరిన్‌ లేదా ఆల్కహాల్‌ ఒంటి మీద స్ప్రే చేసుకుంటే కూడా రక్షణ లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు. కాని వీటితో కరోనాను నివారించలేము. వీటిని వాడొద్దు. స్నానానికి వాడే సబ్బుతో గాని, హ్యాండ్‌ వాష్‌తో గాని చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్‌ వాడడం ఒకటే మార్గం. అయితే శానిటైజర్‌ రాసుకున్న తరువాత, కనీసం ఒక నిమిషం ఆగాకే కిచెన్‌లోకి వెళ్లాలి. పొయ్యి దగ్గరా, నిప్పుకు దగ్గరగా ఉన్నప్పుడు శానిటైజర్‌ ఐప్లె చేయకూడదు. చారు, వెల్లుల్లి తీసుకుంటే కరోనా నుంచి తప్పించుకోవచ్చు అనుకోవడం కూడా అపోహే. దీనికి ఎటువంటి మందూ లేదు. ఇకపోతే గుడ్డు, చికెన్‌ లాంటివి తీసుకుంటే కరోనా బారిన పడతామని చాలామంది భయపడుతున్నారు. కానీ చికెన్‌కీ, కరోనాకీ సంబంధం లేదు. వాటిని భేషుగ్గా తీసుకోవచ్చు. నిజానికి ప్రస్తుత పరిస్థితిలో మన ఇమ్యూనిటీని పెంచడానికి పనికొచ్చే ప్రొటీన్లన్నీ వీటిలో ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవడం అవసరం కూడా. 


డాక్టర్‌ ఎం.వి. రావు

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo