శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Mar 23, 2020 , 22:36:43

క్షయ ఉండగా బిడ్డను కనొచ్చా?

క్షయ ఉండగా బిడ్డను కనొచ్చా?

నాకు 36 ఏళ్లు. పెళ్లయి 3 సంవత్సరాలైంది. నా కెరీర్‌ దృష్ట్యా ఆలోచించి ప్రెగ్నెన్సీ వాయిదా వేసుకున్నాం. కాని ఇప్పుడు నాకు జెనిటల్‌ ట్రాక్ట్‌లో క్షయవ్యాధి ఉన్నట్టు బయటపడింది. దాంతో ఇప్పుడు నేను గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడుతుందంటున్నారు డాక్టర్లు. ఇక తల్లిని అవనేమో అని భయంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఐవిఎఫ్‌ టెక్నిక్‌ లాంటివేమైనా నా బిడ్డపై ప్రభావం చూపకుండా నేను తల్లినయ్యేందుకు తోడ్పడుతాయా? నాకు సరైన సలహా ఇవ్వగలరు. 

- సుమతి, కరీంనగర్‌


మీకు క్షయవ్యాధి తొలిదశలోనే ఉన్నట్టయితే మందులతో పూర్తిగా నయం అవుతుంది. దాని ప్రభావం ఫర్టిలిటీ మీద పడదు. అయితే టిబి తీవ్రతను బట్టి దాని ప్రభావం ఫర్టిలిటీ మీద ప్రత్యక్షంగా ఉండొచ్చు. ఎండోమెట్రియమ్‌ పొర, ఫెలోపియన్‌ ట్యూబులపైన దీని ప్రభావం ఉండొచ్చు. దానివల్ల సహజంగా గర్భం దాల్చి, ప్రసవించడానికి సమస్య కావొచ్చు. టిబి వల్ల సాధారణంగా సంతాన సామర్థ్యంపై ప్రభావం ఉండదు గానీ జెనిటల్‌ టిబి మాత్రం 50 శాతం మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తున్నది. 

దీనికి మందులున్నప్పటికీ సహజంగా గర్భం రావడానికి అవకాశాలు తక్కువనే చెప్పాలి. 90 శాతం కేసుల్లో జెనిటల్‌ టిబి చికిత్స తరువాత అసిస్టెడ్‌ రిప్రోడక్టివ్‌ టెక్నిక్స్‌ పైనే ఆధారపడుతారు. ఐవిఎఫ్‌, ఐసిఎస్‌ఐ, ఐయుఐ లాంటివి ఇందుకు తోడ్పడుతాయి. 


సాధారణంగా జెనిటల్‌ టిబి మొదటి దశలో లక్షణాలేమీ కనిపించవు. అందువల్ల దీన్ని తొందరగా గుర్తించడం కష్టమవుతున్నది. జననేంద్రియాల దగ్గర క్షయ వచ్చినప్పుడు సాధారణంగా నెలసరి సమస్యలు, తీవ్రమైన కడుపు నొప్పి (ముఖ్యంగా పొత్తికడుపు నొప్పి), ఇన్‌ఫర్టిలిటీ, ఇన్‌ఫ్లమేషన్‌, లైంగిక కలయికలో నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలుంటాయి. తల్లి నుంచి పుట్టిన బిడ్డకు జెనిటల్‌ టిబి రావడం చాలా అరుదు. చికిత్స తీసుకోకపోతే మాత్రం పుట్టిన బిడ్డకు ట్రాన్స్‌మిట్‌ అయ్యేందుకు ఆస్కారం ఉంది.  మీరు వెంటనే జెనిటల్‌ టిబికి ట్రీట్‌మెంట్‌ రెగ్యులర్‌గా తీసుకోండి. సహజ గర్భం కోసం కాకుండా ఐవిఎఫ్‌ లాంటి అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నిక్‌ ద్వారా సంతానాన్ని పొందే ప్రయత్నం చేయడం మంచిది. 

డాక్టర్‌ నవీనా సింగ్‌

గైనకాలజిస్ట్‌, ఐవిఎఫ్‌ నిపుణురాలు

ఇందిరా ఐవిఎఫ్‌ హాస్పిటల్‌ , హైదరాబాద్‌


logo