గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 22, 2020 , 22:57:40

గర్భిణులూ జాగ్రత్త సుమా!

గర్భిణులూ జాగ్రత్త సుమా!

కరోనా ఎఫెక్ట్‌

రోజురోజుకూ కరోనా వైరస్‌ ప్రభావం పెరుగుతున్న పరిస్థితిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి. గర్భిణులు, బాలింతలు మామూలుగానే చాలా సున్నితంగా ఉంటారు. సాధారణంగా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఏ చిన్న ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా, మందులేవైనా వాడినా వాటి ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది. అందుకే గర్భిణులను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. 

ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నవాళ్లు ఈ కరోనా వైరస్‌ ప్రభావం తగ్గేవరకు కొన్నాళ్ల పాటు దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. వైరస్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవాలి. కరోనా వైరస్‌ లాలాజల తుంపరలు, మలం ద్వారా, ఇతర వస్తువుల ద్వారా అంటుకుంటుంది. గర్భంతో ఉన్నవాళ్ల చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఆమె వాడే వస్తువులు శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కున్న తరువాతే ఆమెకు పెట్టే ఫుడ్‌ గానీ, ఏవైనా వస్తువులు అందించడం గానీ చేయాలి. గర్భంతో ఉన్నవాళ్లను చూడటానికి వెళ్లేటప్పుడు బయట ప్రయాణం చేసి వాళ్ల దగ్గరికి వెళ్తాం. అందువల్ల వాళ్ల దగ్గరికి వెళ్లేటప్పుడు అప్పటి వరకు వేసుకున్న దుస్తులు మార్చుకుని, వేరేవి వేసుకుని వెళ్లాలి. మాస్క్‌ వాడాలి. చేతులు ఎప్పుడూ క్లీన్‌గా పెట్టుకోవాలి. గర్భిణికి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి, స్వాప్‌ టెస్ట్‌ చేయించాలి. 

ఇదే కాకుండా మరింత ఆధునికమైన పరీక్ష కూడా ఉంది. రివర్స్‌ ట్రాన్స్‌క్టిప్టేజ్‌ టెస్ట్‌ అన్నింటి కన్నా ఆధునికమైన పరీక్ష. రెగ్యులర్‌గా చేసే పరీక్ష థ్రోట్‌ స్వాపింగ్‌ టెస్ట్‌. ఈ టెస్టులో గొంతు నుంచి తీసుకున్న శాంపిల్‌ను వైరస్‌ కల్చర్‌కి పంపిస్తారు. కల్చర్‌ ఫలితాన్ని బట్టి ఏ వైరస్‌ ఇన్‌ఫెక్ట్‌ అయిందో కనుక్కుంటారు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తల్లి నుంచి బిడ్డకు వర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌ జరగొచ్చు. అంటే తల్లి ఇన్‌ఫెక్షన్‌ బిడ్డకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఇందుకు అవకాశం చాలా తక్కువ. ఇంతవరకు అయితే ఏ కేసులూ లేవు. ఇకపోతే పాలిచ్చే తల్లులకు జ్వరం ఉంటే మాస్క్‌ వేసుకుని బిడ్డకు పాలివ్వాలి. బిడ్డను ఒళ్లో పెట్టుకుని దగ్గడం, తుమ్మడం చేయొద్దు. ప్రసవం అయ్యేప్పుడు జననేంద్రియాల దగ్గరి నుంచి వచ్చే ద్రవాల ద్వారా బిడ్డకు ఏమైనా ఇన్‌ఫెక్షన్‌ వస్తుందేమో అనే అనుమానం ఉంటుంది. కాని ఆ భయం అక్కర్లేదు. ఇలా జెనిటల్‌ ఫ్లూయిడ్స్‌ నుంచి ట్రాన్స్‌మిట్‌ అవుతుందన్న దాఖలాలు ఏమీ లేవు. 

ఇలా చేయండి..

  • చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. 
  • మాస్క్‌ వేసుకోవాలి. 
  • కుటుంబంలో ఎవరికైనా జలుబు లాంటి లక్షణాలుంటే ప్రెగ్నెంట్‌గా ఉన్న స్త్రీ తనకు తానుగా స్వీయ నిర్బంధంలో ఉండటం మంచిది. ఇలాంటి వాళ్లు ఆమె దగ్గరికి వెళ్లకూడదు. 
  • ఇంట్లో, ముఖ్యంగా గర్భిణి, బాలింతకు సంబంధించిన గదిలో వెంటిలేషన్‌ బాగుండాలి. 
  • గర్భిణులు నీళ్లు బాగా తాగాలి. అప్పుడే శరీరంలో వైరస్‌ డైల్యూట్‌ అవుతుంది. 
  • గర్భిణిని చూడటానికి ఇంటికి విజిటర్లు రాకుండా చూసుకోవడం మంచిది. 
  • గర్భిణిగా ఉన్నప్పుడు వేరే దేశాలకే కాదు.. రాష్ట్రంలోనే వేరే చోట్లకు కూడా ప్రయాణం చేయవద్దు. సాధ్యమైనంతవరకు ఇంట్లోంచి బయటికి రాకపోవడం మంచిది. 
  • ఒకవేళ గర్భిణికి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తే ప్రీటర్మ్‌ డెలివరీ జరగొచ్చు. అయితే ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం వల్ల అలా జరుగుతుందని కాదు. తల్లికి కాంప్లికేషన్లు రాకుండా ఉండటం కోసం నెలలు నిండకుండానే బిడ్డను బయటకు తీయాల్సిన (ప్రీటర్మ్‌ డెలివరీ) అవసరం రావొచ్చు. 


డాక్టర్‌ కావ్య

కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌

కేర్‌ హాస్పిటల్స్‌

హైదరాబాద్‌


logo
>>>>>>