గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 16, 2020 , 22:40:29

తలనొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు!

తలనొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు!

 బ్రెయిన్‌ ట్యూమర్‌

తలనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ప్రమాదం ఉండొచ్చు. మందులు వాడినా తలనొప్పి తగ్గదు. కాని పెరుగుతూ ఉంటుంది. రెండు వారాల వరకు అలాగే ఉందంటే మెదడులో ఏ కణితో ఉందేమో అని అనుమానించాలంటున్నారు వైద్యులు. మెదడులో ఏర్పడిన కణితివల్ల ఇంట్రా క్రేనియల్‌ ప్రెషర్‌ పెరిగి, ఆయా నరాలపై ప్రభావం పడుతుంది. అందుకే తలనొప్పితో పాటు వాంతులు, చూపు మసకబారడం, ఫిట్స్‌ లాంటివి వస్తాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.

మెదడులో ఏర్పడే కణితులు క్యాన్సర్‌ వల్లనే కాదు.., క్యాన్సర్‌ కాని కణుతులు కూడా ఏర్పడవచ్చు. వీటిని బినైన్‌ ట్యూమర్లు అంటారు. మెనింజోమాస్‌, ష్వానోమాస్‌, పిట్యుటరీ ట్యూమర్లు సాధారణంగా బినైన్‌ కణితులే ఉంటాయి. గ్లయోమాస్‌, మెడ్యులో బ్లాస్టోమాస్‌, లింఫోమాస్‌ లాంటివి క్యాన్సర్‌ కణుతులు. ట్యూమర్‌ ఏర్పడిన భాగాన్ని బట్టి క్యాన్సర్ల పేర్లు ఉంటాయి. న్యూరోఎపిథీలియల్‌ కణజాలాల నుంచి పుట్టేవి సాధారణంగా గ్లయల్‌ ట్యూమర్లు అయి ఉంటాయి. వీటిలో ఆస్టియోసైటోమాస్‌, ఆలిగోడెంట్రో గ్లయోమాస్‌, ఎపెన్‌డైమోమాస్‌ ప్రధానమైనవి. ష్వానోమాస్‌, న్యూరోఫైబ్రోమాస్‌ కణుతులు క్రేనియల్‌ లేదా స్పైనల్‌ నరాల నుంచి పుడుతాయి. మెదడు పొరలనుంచి పుట్టేవి మెనింజోమాస్‌. పిట్యుటరీ గ్రంథిలో రెండు రకాల కణుతులు ఏర్పడుతాయి. కొన్ని గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి. కొన్ని నాన్‌ ఫంక్షనల్‌ భాగాల్లో ఏర్పడుతాయి. ఫంక్షనల్‌ ట్యూమర్లు - ప్రొలాక్టినోమాస్‌, గ్రోత్‌ హార్మోన్‌ సెక్రిటింగ్‌ ట్యూమర్లు. కాగా నాన్‌ ఫంక్షనల్‌ ట్యూమర్లను అడినోమాస్‌ అంటారు. ఇవి గాకుండా లింఫోమాస్‌, జెర్మ్‌ సెల్‌ ట్యూమర్లు, మెటాస్టాటిక్‌ ట్యూమర్లు కూడా మెదడులో ఏర్పడుతుంటాయి.  


లక్షణాలు

మెదడు పై భాగం (సుప్రా టెంటోరియల్‌ విభాగం - సెరిబ్రమ్‌)లో అంటే ఫ్రంటల్‌ లోబ్‌లో కణితి ఏర్పడినప్పుడు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ప్రవర్తనలో మార్పులు, మూత్ర విసర్జనలో సమస్యలు, కాళ్లూచేతులు బలహీనం అవుతాయి. మాటపై కూడా ప్రభావం పడుతుంది. 

పెరిటల్‌ లోబ్‌లో కణితి ఉంటే స్పర్శ దెబ్బతింటుంది. చేతితో ఏదైనా పట్టుకున్నా స్పర్శ తెలియదు. 

టెంపోరల్‌ లోబ్‌లో కణితి ఉంటే వినికిడి, వాసనలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఏ శబ్దమూ లేకపోయినా ఏదో వినిపిస్తుంది. ఏమీ లేకపోయినా వాసన వస్తుంది. 

ఆక్సిపీటల్‌ లోబ్‌లో కణితి ఉంటే దృష్టి క్షేత్రంలో లోపాలు వస్తాయి. ఎదురుగా ఉన్నది మొత్తం కనిపించదు. 

మెదడు కింది భాగంలో (ఇంట్రా టెంటోరియల్‌ విభాగం - బ్రెయిన్‌ స్టెమ్‌, సెరిబెల్లమ్‌, క్రేనియల్‌ నరాలు) కణితి ఏర్పడినప్పుడు నడకలో సమస్య అంటే సరిగ్గా నడవలేరు. తూలుతూ ఉంటారు. మింగడం, మాటలో సమస్య ఉంటుంది. కంట్రోల్‌ లేకుండా కళ్లు పైకీ కిందకీ, పక్కలకీ కదిలిస్తుంటారు. (నిస్టేగ్మస్‌).


చికిత్స

ముందుగా మెదడుకు సిటి స్కాన్‌ చేస్తారు. ఆ తరువాత కణితి ఏ గ్రేడ్‌లో ఉందో తెలుసుకోవడానికి కాంట్రాస్ట్‌తో ఎంఆర్‌ఐ చేస్తారు. ఒకవేళ అది మెటాస్టాసిస్‌ అని బయటపడితే ఏ అవయవం దగ్గర కణితి మొదలైందో తెలుసుకోవడానికి పెట్‌-సిటి చేస్తారు. సాధారణంగా 3 సెంటీమీటర్ల సైజు కన్నా చిన్నగా ఉండే ట్యూమర్లకు, ష్వానోమాస్‌కి సర్జరీ అవసరం ఉండదు. రేడియోథెరపీతో చికిత్స చేస్తారు. సర్జరీని జనరల్‌ అనెస్తీషియాలో చేయొచ్చు. లేదా అవేక్‌ సర్జరీ కూడా చేయొచ్చు. దీన్ని అవేక్‌ క్రేనియాటమీ అంటారు. కదలికలను కంట్రోల్‌ చేసే మోటార్‌ భాగంలో అంటే ఫ్రంటల్‌ లోబ్‌లో కణితులు ఏర్పడినప్పుడు జనరల్‌ అనెస్తీషియా ఇవ్వడం కన్నా అవేక్‌ క్రేనియాటమీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కణితిలో కొంచెం భాగం తీసేసి పేషెంట్‌ మెలకువతో ఉంటాడు కాబట్టి కాళ్లూ చేతుల కదలిక ఎలా ఉందో చెక్‌ చేయడం దీనివల్ల సాధ్యమవుతుంది. కొన్నిసార్లు కణితిని తీయడానికి ముట్టుకోగానే కదలిక ప్రభావితం కావొచ్చు. ఇలాంటప్పుడు దాన్ని శస్త్రచికిత్సతో తీయకుండా, కీమో లేదా రేడియేషన్‌ ఇస్తారు. కదలికలు దెబ్బతినకుండా సర్జరీ చేయడం ఈ విధానంలో సాధ్యపడుతుంది. 


స్టీరియోటాక్టిక్‌ బయాప్సీ

పుర్రె తెరువకుండా దాదాపు 2 మి.మీ. రంధ్రం చేసి, దాని గుండా చిన్న సూదిని పంపి చేసే బయాప్సీ ఇది. ఈ విధానంలో మొదట తలకు ఒక ఫ్రేమ్‌ ఫిక్స్‌ చేస్తారు. లోకల్‌ అనెస్తీషియా ఇస్తారు. తరువాత సిటి/ఎంఆర్‌ఐ చేస్తారు. అప్పుడు కొన్ని కొలతల ఆధారంగా సూదిని ఎక్కడి నుంచి, ఎంత పొడవు వరకు లోపలికి పంపాలనేది నిర్ణయిస్తారు. ఆ సూదితో బయాప్సీ తీస్తారు.

స్టీరియాటాక్టిక్‌ బయాప్సీ సాధారణంగా వృద్ధులు, జనరల్‌ అనెస్తీషియా ఇవ్వలేని వాళ్లకు, ఎక్కువ చోట్ల కణితులున్నవాళ్లకు, కణితి మెదడులో లోతుగా, లోపలి కణజాలాల్లో ఏర్పడినప్పుడు, మోటార్‌ కార్టెక్స్‌, థాలమస్‌, బ్రెయిన్‌ స్టెమ్‌ లాంటి కీలకమైన భాగాల్లో కణితులు ఏర్పడినప్పుడు ఈ రకమైన బయాప్సీ చేస్తారు. సాధారణంగా మెదడులో లోతుగా ఉన్న కణజాలాల్లో ఏర్పడే కణితులు క్యాన్సర్‌వే అయివుంటాయి. వీటికి కీమో లేదా రేడియేషన్‌ ఇస్తారు. ఎక్కువ చోట్ల కణితులుండడానికి కారణం టిబి అవ్వొచ్చు. 


కారణాలు

డిఎన్‌ఎలో ఉత్పరివర్తనాలు (మార్పులు) సంభవించడం ట్యూమర్‌ సప్రెసార్‌ జీన్స్‌ (పి53) ఇన్‌హిబిషన్‌ వల్ల అసాధారణ పెరుగుదల కనిపిస్తుంది. 

వంశపారంపర్య కారణాలు - న్యూరోఫైబ్రోమాస్‌, వాన్‌ హిప్పెల్‌ లిండో (విహెచ్‌ఎల్‌) సిండ్రోమ్‌ లాంటివి తీవ్రమైన గాయాలు (ట్రామా)


ఆధునిక సర్జరీలు

మైక్రోస్కోపిక్‌ సర్జరీ - మెదడు లోపలి భాగాలను మాగ్నిఫై చేసి చూపిస్తుంది కాబట్టి నార్మల్‌గా ఉన్న మెదడు కణజాలానికి, ట్యూమర్‌ కణజాలానికి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. 

ఎండోస్కోపిక్‌ సర్జరీలు - పిట్యుటరీ కణితులకు ముక్కులో నుంచి వెళ్లి కణితి తీస్తారు. 


అల్ట్రాసోనిక్‌ యాస్పిరేటర్‌

ఇంట్రా ఆపరేటివ్‌ ఎంఆర్‌ఐ - సర్జరీ తరువాత ఆపరేషన్‌ బెడ్‌ మీదనే ఎంఆర్‌ఐ చేసి ఇంకా ఎంత ట్యూమర్‌ తీయాలి అనేది చూసుకోవచ్చు. రికరెన్సీ తగ్గించొచ్చు. 

న్యూరో నావిగేషన్‌ - తలపై ప్రోబ్‌ పెట్టగానే ట్యూమర్‌ ఏ భాగంలో ఉందో చూపిస్తుంది. కాబట్టి ట్యూమర్‌ ఉన్న భాగంలోనే కట్‌ చేసి ఆపరేషన్‌ చేయొచ్చు. మొత్తం ఓపెన్‌ చేయాల్సిన అవసరం ఉండదు. సర్జరీ తరువాత

బయాప్సీలో కణితి బినైన్‌ దా, క్యాన్సర్‌దా అనేది తెలిసిపోతుంది. బినైన్‌ ట్యూమర్‌ అయితే 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్‌కు రమ్మంటారు. క్యాన్సర్‌ కణితి అయితే రేడియేషన్‌, కీమోథెరపీ కోసం క్యాన్సర్‌ స్పెషలిస్టు దగ్గరికి పంపిస్తారు. 


డాక్టర్‌ భవాని ప్రసాద్‌ గంజి

సీనియర్‌ స్పైన్‌ & న్యూరోసర్జన్‌

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌

8121022333


logo
>>>>>>