ఆదివారం 29 మార్చి 2020
Health - Mar 09, 2020 , 22:22:03

కీళ్లు.. ఎముకలు ఇలా క్షేమం!

కీళ్లు.. ఎముకలు ఇలా క్షేమం!

ఎముకలు, కీళ్ల సమస్యలు పెద్దవాళ్లలోనే కాదు.. చిన్న వయసులో కూడా కనిపిస్తున్నాయి. క్రీడల్లో ఉన్న చిన్న పిల్లల్లో కూడా ఇటువంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. స్పోర్ట్స్‌ ఇంజురీస్‌, ఆర్థరైటిస్‌ లాంటి సమస్యలకు మినిమల్లీ ఇన్వేసివ్‌ చికిత్సలే కాకుండా, జాయింట్‌ పాడైపోకుండా కాపాడే ముందస్తు ప్రిజర్వేషన్‌ చికిత్సలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. పెద్దవాళ్లయితే సర్జరీ ఎలాగూ తప్పదు. కాని పిల్లల శరీరం ఏ ఆటలకు సరిపోతుందో ముందే విశ్లేషించి, ఆ ఆటలో చేర్పిస్తే వాళ్లలో ఎముకలు, కీళ్ల సమస్యలు రాకుండా నివారించొచ్చంటున్నారు నిపుణులు.

స్పోర్ట్స్‌ ఇంజురీలుక్రీడలు అంటే ఒకప్పుడు ప్రొఫెషనల్‌గా ఆడేవాళ్లు మాత్రమే ఎక్కువగా ఉండేవాళ్లు. ఇప్పుడు చిన్నప్పుడే పిల్లల్ని రకరకాల స్పోర్ట్స్‌లో చేరుస్తున్నారు. అందుకే వయసుతో సంబంధం లేకుండా స్పోర్ట్స్‌ ఇంజురీలు ఎక్కువ అవుతున్నాయి. స్కూల్‌ చదువుతో పాటు షటిల్‌, బ్యాడ్మింటన్‌ వంటివి పిల్లల జీవితంలో భాగమైపోయాయి. పెద్దవాళ్లు కూడా కనీసం వారాంతాల్లో అయినా ఏదో ఒక ఆట ఆడుతున్నారు. అయితే స్పోర్ట్స్‌ వల్ల కలిగే గాయాలను ఎలా తప్పించుకోవాలో చాలామందికి అవగాహన ఉండడం లేదు. వృత్తిపరంగా క్రీడాకారులు కాకుండా రెగ్యులర్‌గా ఆటలాడేవాళ్లలో ముఖ్యంగా రెగ్యులర్‌గా రన్నింగ్‌, జాగింగ్‌ చేసేవాళ్లలో, అప్పుడప్పుడూ జిమ్‌కి వెళ్లడం, వారాంతాల్లో ఆడేవాళ్లలో స్పోర్ట్స్‌ ఇంజురీస్‌ కనిపిస్తుంటాయి. వార్మప్‌ లేకుండా ఆడడం, ఫిట్‌నెస్‌ లేకపోవడం, ఆడేటప్పుడు వాడే ఎక్విప్‌మెంట్‌ సరిగ్గా లేకపోవడం, రక్షణ కవచాలు సరిగ్గా లేకపోవడం ఇందుకు కారణమవుతున్నాయి. 


చికిత్స

తీవ్రమైన గాయాలైతే తప్ప హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రాక్చర్లు, డిస్‌లొకేషన్‌, కంకషన్‌ లాంటి సమస్యలకు మాత్రం హాస్పిటల్‌ అవసరం. అలా కాకుండా చిన్న చిన్న గాయాలైతే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న గాయాలకు రైస్‌ (ఆర్‌ఐసిఇ) అనే పేరుతో చికిత్స ఉంటుంది. 

అంటే, రెస్ట్‌ - 48 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. ఐస్‌ - 3-4 గంటలకోసారి 10 నిమిషాలు ఐస్‌తో కాపడం పెట్టాలి. కంప్రెస్‌ - గాయం తగిలిన చోట క్రేప్‌ లేదా ఎలాస్టిక్‌ బ్యాండేజ్‌ వేయాలి. ఎలివేషన్‌ - దెబ్బ తగిలిన భాగాన్ని ఎత్తులో పెట్టి ఉంచాలి. స్పోర్ట్స్‌ ఇంజురీస్‌ స్పెషలిస్టును కలవడం మాత్రం తప్పనిసరి. 


సర్జరీ ఎప్పుడు?

లిగమెంట్‌ ఇంజురీలు, మజిల్‌ టేర్‌, డిస్‌లొకేషన్‌, ఫ్రాక్చర్లు ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీ అంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కేవలం 0.5 సెంటీమీటర్‌ కోతతో మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ అందుబాటులో ఉంది. ఆర్థ్రోస్కోపీ, టార్గెటెడ్‌ ట్రీట్‌మెంట్స్‌ కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. 


కొత్త చికిత్సలు

ఆర్థ్రోస్కోపీని భుజం సమస్యలకు, తుంటి సమస్యలకు కూడా చేయవచ్చు. షోల్డర్‌ ఆర్థ్రోస్కోపీ ద్వారా భవిష్యత్తులో షోల్డర్‌ డిస్‌లొకేషన్‌ని నివారించొచ్చు. తుంటి సమస్యలకు హిప్‌ ఆర్థ్రోస్కోపీని మనదేశంలో చాలా తక్కువమంది చేస్తున్నారు. ఇంతకుముందు కేవలం ఫిజియోథెరపీ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ సర్జరీ ద్వారా తుంటి కండరాల్లోని టేర్స్‌ని సరిచేయొచ్చు. మోకాలి కీలులోని కార్టిలేజ్‌ను రీప్లేస్‌ చేయడం ఇప్పుడు సాధ్యం అవుతోంది. మెనిస్కల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ టెక్నిక్‌ ద్వారా మెనిస్కస్‌ మార్పిడి చేయొచ్చు. సర్జరీ అయిపోయిన తరువాత తొందరగా ఎప్పటిలా క్రీడల్లోకి వెళ్లాలంటే ఫిజియోథెరపీ, రీహబిలిటేషన్‌ అవసరం అవుతుంది. ఒకట్రెండు నెలలు ఫిజియోథెరపీ చేయించుకుంటే చాలు. మళ్లీ ఇంజురీ కాకుండా కూడా నివారించొచ్చు. సర్జరీ అయిన రెండోరోజు నుంచి ఆటలు ఆడడం తప్ప మిగతా పనులన్నీ నార్మల్‌గా చేసుకోవచ్చు. సిమెంట్‌ పట్టీ సమస్య చాలావరకు ఉండదు. 


ఎలా నివారించాలి?

ఎముకలు, కండరాలు బలహీనంగా ఉండి, లిగమెంట్లు వదులుగా ఉండడం లాంటి నిర్మాణాత్మక లోపాలున్నప్పుడు వాటిపై ఒత్తిడి కలిగించే క్రీడలు ఆడితే సమస్య మరింత పెద్దదై గాయాలు, కీళ్ల సమస్యలు వస్తాయి. అందుకే మొదటిసారిగా ఆటలు ఆడాలనుకున్నప్పుడు ఫిట్‌నెస్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. పిల్లల్ని ఏదైనా క్రీడలో చేర్పించాలనుకున్నప్పుడు ముందుగా ఫిజియోథెరపిస్టు లేదా కోచ్‌లు స్క్రీన్‌ చేయాలి. ఏమైనా తెలియని ఇంజురీస్‌ ఉన్నాయా అని. కండరాలు బలహీనంగా ఉన్నాయా అని చూడాలి. ఎముక వంకర ఏమైనా ఉందా.. ఏమైనా తేడాలున్నాయా చెక్‌ చేసుకోవాలి. ఎముకలు, కీళ్ల నిర్మాణాన్ని, వాటి స్ట్రాంగ్‌నెస్‌ని బట్టి ఎవరు ఏ రకమైన క్రీడలు ఆడడానికి సరిపోతారని అసెస్‌ చేసిన తర్వాతే ఆయా ఆటలు ఆడాలి. లిగమెంట్లు వదులుగా ఉంటే షటిల్‌, బ్యాడ్మింటన్‌ లాంటివి ఆడితే జాయింట్‌ డిస్‌లొకేట్‌ అకొన్నిసార్లు ఆడే పవర్‌ తగ్గొచ్చు. చిన్న చిన్న నొప్పులు ఉండొచ్చు. ఆడి వచ్చిన తరువాత చాలాసేపు నీరసంగా, బలహీనంగా అనిపించవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ఫిజియోథెరపిస్టులను లేదా డాక్టర్‌ని కలవాలి. చిన్న చిన్న గాయాలుగా ఉన్నప్పుడు 90 శాతం కేసుల్లో సర్జరీ అవసరం ఉండదు. 


ఇవీ సమస్యలు 

పిల్లల్లో కూడా తొడ ఎముక కండరం బలహీనం కావడం, స్ట్రెస్‌ ఫ్రాక్చర్లు, భుజం సమస్యలు, లిగమెంట్‌ ఇంజురీలు, మోకాలి చిప్ప జారిపోవడం లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. 

మజిల్‌ క్రాంప్స్‌. షోల్డర్‌ డిస్‌లొకేషన్‌, రొటేటరీ కఫ్‌ మజిల్‌ టేర్‌

మోచేతి సమస్యలు. లిగమెంట్‌ టేర్‌ కావొచ్చు. 

తుంటి కీలును బంతి గిన్నె కీలు అంటారు. దీనిలో బంతి భాగం చుట్టూ లేబ్రమ్‌ అనే ఒక కణజాలం ఉంటుంది. ఇది సాక్‌ అబ్‌సార్బంట్‌గా పనిచేస్తుంది. ఈ లేబ్రమ్‌ టేర్‌ అయినప్పుడు సమస్య వస్తుంది. 

తుంటి దగ్గరి కండరం టేర్‌ కావడం. చీలమండల దగ్గర స్ప్రెయిన్‌ కావడం. 

మోకాలి దగ్గర లిగమెంట్లకు దెబ్బ తగలవచ్చు. కార్టిలేజ్‌కు గాయాలవ్వొచ్చు. కార్టిలేజ్‌కి అయ్యే ఫ్రాక్చర్లను ఆస్టియో కాండ్రల్‌ ఫ్రాక్చర్లంటారు. 

హెడ్‌ కంకషన్‌. అకస్మాత్తుగా బంతి వచ్చి తలకు తగిలినప్పుడు, కింద పడినప్పుడు తలకు గాయమై మెదడు అటూ ఇటూ కదులుతుంది. దీన్ని హెడ్‌ కంకషన్‌ అంటారు. దీనివల్ల ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. 


భుజం సమస్యలు


సాధారణంగా కీళ్ల సమస్యలు వృద్ధాప్యంలోనే వస్తాయనుకుంటాం. కానీ భుజం కీలు, కండరాలు, దాని చుట్టుపక్కల భాగాలకు సంబంధించిన సమస్యలు ఏ వయసువారిలో అయినా రావొచ్చు. యువతలో అయితే ఆటలాడేటప్పుడు గాయాలవడం, భుజం కీలు జారిపోవడం (డిస్‌లొకేషన్‌) వల్ల భుజంలో సమస్యలు వస్తాయి. కొందరిలో ఫిట్స్‌ వల్ల కూడా భుజం కండరానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఫిట్స్‌ వల్ల భుజం దగ్గరి కండరం తీవ్రంగా సంకోచించి సమస్య కావొచ్చు. భుజం డిస్‌లొకేట్‌ కావొచ్చు. ఇక వృద్ధుల్లో డీజనరేటివ్‌ వ్యాధులే ఎక్కువ. డీజనరేషన్‌ వల్ల భుజానికి చిన్న దెబ్బ తగిలినా భుజం టేర్‌ అవుతుంది. రొటేటరీ కఫ్‌ టేర్‌ను సకాలంలో చికిత్స చేయకపోతే ఆర్థరైటిస్‌కి దారితీస్తుంది. 


లక్షణాలు

డిస్‌లొకేషన్‌ వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. 

భుజాన్ని కదిలించడం కూడా కష్టమవుతుంది. 

రొటేటరీ కఫ్‌ సమస్య ఉండడం వల్ల చేయి పైకి లేపలేని పరిస్థితి వస్తుంది. చేతులతో ఏ పని చేయకుండా విశ్రాంతిగా ఉంటే నొప్పి ఉండదు.

భుజాన్ని ఉపయోగించి చేసే పనులేవీ చేయలేని స్థితి వస్తుంది. తల దువ్వుకోవడం, చేత్తో ఆహారం తీసుకోవడం, షర్ట్‌ బటన్‌ పెట్టుకోవడం లాంటివి చేయలేరు. 

భుజం ఆర్థరైటిస్‌ ఉంటే ఏ పని చేయాలన్నా నొప్పి ఉంటుంది. రాత్రి సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. 


చికిత్స

ఇంతకుముందు వరకు ఓపెన్‌ సర్జరీ ఉండేది. కాని ఇప్పుడు ఆర్థ్రోస్కోపీతో మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ చేస్తున్నారు. పదేళ్ల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చింది. అయిదారేళ్లుగా ప్రాచుర్యం పొందింది. ఆర్థ్రోస్కోపీ కోసం 5 మి.మీ. సైజులో మూడు నాలుగు రంధ్రాలు పెడుతారు. వీటి ద్వారా స్కోప్‌, ఇతర పరికరాలు పంపిస్తారు. వీటి ద్వారా రొటేటరీ కఫ్‌ అయితే రిపేర్‌ చేస్తారు. నర్వ్‌ కంప్రెషన్‌ ఉంటే దాన్ని రిలీజ్‌ చేస్తారు. సాధారణంగా ఈ సర్జరీ టేర్స్‌కీ, డిస్‌లొకేషన్‌కీ చేస్తారు. టేర్‌ అయిన లేబ్రమ్‌ని సరిచేసి అమరుస్తారు. ఇలాంటి సమస్యల్లో ఎముక ఇన్వాల్వ్‌ అవదు. బోన్‌ ఆర్థరైటిస్‌కు కూడా ఈ సర్జరీ చేయవచ్చు. నార్మల్‌ వయసు వల్ల వచ్చే ఆర్థరైటిస్‌ కాకుండా, రొటేటరీ కఫ్‌ సమస్యను అశ్రద్ధ చేస్తే కూడా ఆర్థరైటిస్‌ వస్తుంది. ఈ రకమైన ఆర్థరైటిస్‌ను రొటేటరీ కఫ్‌ ఆర్థ్రోపతి అంటారు. వయసు వల్ల వచ్చే ప్రైమరీ ఆర్థరైటిస్‌కు టోటల్‌ షోల్డర్‌ ఆర్థ్రోప్లాస్టీ (టోటల్‌ షోల్డర్‌ రీప్లేస్మెంట్‌) చేస్తారు. రొటేటరీ కఫ్‌ ఆర్థ్రోపతికి రివర్స్‌ షోల్డర్‌ ఆర్థ్రోప్లాస్టీ (రివర్స్‌ షోల్డర్‌ రీప్లేస్మెంట్‌) చేస్తారు. రొటేటరీ కఫ్‌ కండరం లేకపోయినా కూడా రివర్స్‌ షోల్డర్‌ రీప్లేస్‌మెంట్‌ పనిచేస్తుంది. ఈ రకమైన భుజం కీలు మార్పిడిలో కీలులోని బంతి భాగాన్ని (మెటల్‌) గిన్నె (కప్‌) దగ్గర, గిన్నె భాగాన్ని (ప్లాస్టిక్‌) బంతి దగ్గర మార్చి అమరుస్తారు. కండరాలు బలహీనంగా ఉన్నా, వయసు ఎక్కువగా ఉన్నా ఈ సర్జరీ మంచి ఫలితాలను ఇస్తుంది. 

భుజం కీలును ఎలా కాపాడుకోవాలి?

రెగ్యులర్‌గా స్ట్రెచింగ్‌ వ్యాయామాలు, 

మజిల్‌ బ్యాలెన్సింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి.

వ్యాయామం ఒక్కసారిగా తీవ్రంగా చేయొద్దు. 

సడెన్‌గా యాక్టివిటీ పెంచడం వల్ల సమస్యే.

వ్యాయామం వల్ల ఏజ్‌ రిలేటెడ్‌ ఆర్థరైటిస్‌ని కూడా వాయిదా వేయొచ్చు. 

పురుషుల్లో షోల్డర్‌ డిస్‌లొకేషన్‌, స్త్రీలలో రొటేటరీ కఫ్‌ సమస్యలు ఎక్కువ కాబట్టి వాటికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. 


నీ ప్రిజర్వేషన్‌ సర్జరీలు


ఆర్థరైటిస్‌ వల్ల మోకాళ్ల నొప్పులకు కీలు మార్పిడి సాధారణం. 55 ఏళ్లు దాటినవాళ్లకు పరవాలేదు గానీ నాలుగు పదుల్లోనే మోకాళ్ల సమస్యలున్నవాళ్లకు కీలుమార్పిడి సరికాదు. ఎందుకంటే కొత్త కీలు 15 ఏళ్లు ఉంటుంది. ఆ తరువాత మరోసారి కీలుమార్పిడి అవసరం అవుతుంది. అందుకే జాయింట్‌ పాడవడాన్ని ఆపడానికి, డీజనరేషన్‌ ప్రక్రియను వాయిదా వేయడానికి నీ ప్రిజర్వేషన్‌ సర్జరీలు ఉపయోగపడుతాయి. 


ఏం చేస్తారు?

ఇంజెక్షన్లు - ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పిఆర్‌పి), బోన్‌ మ్యారో (స్టెమ్‌సెల్‌) ఇంజెక్షన్లు ఇస్తారు. ప్లాస్మాలో ఉండే గ్రోత్‌ ఫ్యాక్టర్లు హీలింగ్‌ సామర్థ్యాన్ని పెంచుతాయి. 

ఆస్టియోటమీస్‌ - జాయింట్‌కి ఒకవైపు భాగం (మీడియల్‌) చిన్న వయసు వాళ్లలో అరుగుతుంటుంది. ఇలాంటప్పుడు అరిగిన వైపు రెండు ఎముకల మధ్య ఉండే గ్యాప్‌ తగ్గుతుంది. అలా కాకుండా రెండువైపుల సమానమైన గ్యాప్‌ ఉండేట్టుగా అమరుస్తారు. దీనివల్ల కార్టిలేజ్‌ గాయం తగ్గే అవకాశం ఉంటుంది. 

కార్టిలేజ్‌ రీజనరేషన్‌ సర్జరీ (స్టెమ్‌సెల్‌ ట్రీట్‌మెంట్‌) - దీనిలో ఆటోలోగస్‌ కాండ్రోసైట్‌ ఇంప్లాంటేషన్‌ (ఎసిఐ) లేదా బోన్‌మ్యారో యాస్పిరేట్‌ కాన్‌సన్‌ట్రేషన్‌(బిఎంఎసి) అనే రెండు పద్ధతులున్నాయి. సాధారణంగా ఆస్టియోటమీ తరువాత ఇది చేస్తారు. పేషెంటు నుంచే కొంత కార్టిలేజ్‌ను సేకరించి కల్చర్‌ చేసి పెంచుతారు. ఈ కార్టిలేజ్‌ కణజాలాన్ని లోపం ఉన్న చోట అతికిస్తారు. ఇకపోతే బిఎంఎసి ద్వారా 60 మి.లీ బోన్‌మ్యారో సేకరిస్తారు. దాన్ని ప్రాసెస్‌ చేస్తే 5 మి.లీ. మూల కణాలు వస్తాయి. వీటికి జిగటగా ఉండే ఎంజైమ్‌ను కలుపుతారు. దీన్ని లోపం ఉన్న కార్టిలేజ దగ్గర అతికిస్తారు. ఈ మూలకణాల నుంచి కొత్త కార్టిలేజ్‌ వస్తుంది. 

పదేళ్లుగా ఈ చికిత్సలున్నప్పటికీ 4-5 ఏళ్ల నుంచి మన దగ్గరికి వచ్చాయి. 


కీలు మార్పిడి


ఆర్థరైటిస్‌ నాలుగు దశల్లో ఉంటుంది

స్టేజ్‌ 1కార్టిలేజ్‌ కొంచెం మెత్తబడి ఉంటుంది. 

ఈ దశలో లక్షణాలేమీ ఉండవు. 

స్టేజ్‌ 2కార్టిలేజ్‌ పైన చిన్న గీతలా పడుతుంది. 

ఇప్పుడు కూడా లక్షణాలేవీ ఉండవు. 

స్టేజ్‌ 3కీలులో గ్యాప్‌ కొంచెం తగ్గుతుంది. 

నొప్పి మొదలవుతుంది. అయితే కీలుకు 

పని చెప్తేనే నొప్పి ఉంటుంది. 

స్టేజ్‌ 4కీలు ఎప్పటికీ నొప్పిగానే ఉంటుంది. 100 మీటర్ల కన్నా ఎక్కువ నడవలేరు కూడా. రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ పెయిన్‌ కిల్లర్‌ వాడాల్సి వస్తుంది. జాయింట్‌లో గ్యాప్‌ మొత్తం తగ్గిపోతుంది. కొందరిలో అదనంగా ఎముక (ఆస్టియోఫైట్‌) పెరుగుతుంది.

మార్పిడి ఎప్పుడు?

ఆర్థరైటిస్‌ నాలుగోదశకు చేరిన తరువాత మాత్రమే కీలుమార్పిడి అవసరం అవుతుంది. అప్పటివరకు అంటే మూడో దశలో ఉన్నప్పుడు జాయింట్‌ ప్రిజర్వేషన్‌ చికిత్సలు ఉపయోగపడుతాయి. గ్లూకజమైన్స్‌ లాంటి మందులు డీజనరేషన్‌ వేగాన్ని తగ్గిస్తాయి. పిఆర్‌పి, స్టెమ్‌సెల్‌ ఇంజెక్షన్లు వ్యాధి పెరగడాన్ని నెమ్మది చేస్తాయి. హైలురోనిక్‌ యాసిడ్‌ ఇంజెక్షన్లు లూబ్రికెంట్‌గా పనిచేస్తాయి. క్వాడ్రిసెప్స్‌ స్రెంతనింగ్‌ వ్యాయామాలు తొడ ఎముకను బలంగా చేసి కీలును కాపాడుతాయి. హామ్‌స్ట్రింగ్‌ స్రెంతనింగ్‌ ఎక్సర్‌సైజుల ద్వారా తొడ వెనుక కండరాలను బలంగా చేయవచ్చు. 


మార్పిడి ఎలా?

సంప్రదాయిక కీలుమార్పిడి కన్నా ఆధునికమైన పద్ధతులెన్నో వచ్చాయి. కంప్యూటర్‌ నావిగేటెడ్‌, రోబోటిక్‌ సర్జరీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. యుని కంపార్ట్‌మెంటల్‌ నీ ఆర్థ్రోప్లాస్టీ (యుకెఎ) ద్వారా పార్షియల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ కూడా చేస్తున్నారు. చిన్న వయసువాళ్లకు, కీలు కొద్దిగా మాత్రమే డ్యామేజ్‌ అయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. 


మోకాళ్లు.. ఇలా భద్రం!

కృత్రిమ ఉపరితలాల మీద ఎక్కువసేపు పరిగెత్తొద్దు. అంటే ట్రెడ్‌మిల్‌ను ఎక్కువ సేపు ఉపయోగిస్తే కీలు దెబ్బతినవచ్చు. 

సాధ్యమైనంతవరకు కింద మోకాళ్లు ముడుచుకుని కూర్చోకపోవడం మంచిది. 

మెట్లు ఎక్కి దిగడం ఎక్కువగా చేయొద్దు.

ప్రతిరోజూ 40 నిమిషాల నడక మంచిది.

జాయింట్‌ స్ట్రెంతనింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి. 


డాక్టర్‌ సుఖేశ్‌ రావు

సీనియర్‌ ఆర్థోపెడిక్‌, జాయింట్‌ 

రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌, యశోద హాస్పిటల్స్‌

సికింద్రాబాద్‌

8121022333డాక్టర్‌ పూర్ణచంద్ర తేజస్వి

సీనియర్‌ ఆర్థోపెడిక్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌, యశోద హాస్పిటల్స్‌

సికింద్రాబాద్‌

8121022333


డాక్టర్‌ బ్రిజేష్‌ కిడియూర్‌

సీనియర్‌ ఆర్థోపెడిక్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌, యశోద హాస్పిటల్స్‌

సికింద్రాబాద్‌

8121022333


logo