గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Feb 24, 2020 , 22:37:40

ఊపిరితిత్తులకు ఇక నో సర్జరీ

ఊపిరితిత్తులకు ఇక నో సర్జరీ

వైద్యరంగంలో ఓపెన్‌ సర్జరీ అనేది క్రమంగా కనుమరుగైపోతున్నది. మినిమల్లీ ఇన్వేసివ్‌ చికిత్సలు విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నాయి. ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ శ్వాసకోశ వ్యాధులకు కూడా ఓపెన్‌ సర్జరీ అవసరం లేకుండా చిన్న గాటుతోనే చికిత్సలు అందించ గలుగుతున్నది. దీనిలో ఇప్పుడు మరో ముందడుగు పడింది. మనదేశంలోనే ప్రప్రథమంగా ఎంఫసీమాకు మరో అత్యాధునిక చికిత్స ఇటీవలే హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. దీర్ఘకాలం పొగతాగడం వల్ల పాడైపోయిన ఊపిరితిత్తులకు కొత్త ఊపిరిలూదే ఈ కొత్త చికిత్సే ఇంటర్వెన్షనల్‌ బ్రాంకోస్కోపిక్‌ వేపర్‌ అబ్లేషన్‌ (బీటీవీఏ). ఇన్నేళ్ల నుంచి సిగరెట్లు తాగుతున్నాను.. నాకేమైనా అయిందా? మీ అందరి కంటే ఆరోగ్యంగా ఉన్నాను.. అంటుంటారు కొందరు పొగ ప్రియులు. ఇప్పుడు ఆరోగ్యంగా కనిపించవచ్చు. ఒకవేళ చిన్నా చితకా ఏదైనా సమస్య వచ్చినా అది సిగరెట్‌ వల్ల అనుకోకపోవచ్చు. కానీ కొన్నేళ్లు గడిచేసరికి మాత్రం ఆ సిగరెట్లే మరణం వైపు అడుగులు వేయిస్తాయి. ఇందుకు మంచి ఉదాహరణ ఎంఫసీమా. ఊపిరితిత్తుల్ని ఛిన్నాభిన్నం చేసి, ఊపిరి పీల్చుకోవడాన్ని కూడా కష్టమైన పనిగా మార్చి, చివరికి ఊపిరి తీసే వ్యాధి. మొన్నటివరకు ఈ వ్యాధికి శస్త్రచికిత్స చేయడమో, చివరి దశలో ఊపిరితిత్తుల మార్పిడి చేయడమో పరిష్కారంగా ఉండేది. ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండా కొత్త పద్ధతి వచ్చింది. ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీలో వచ్చిన ఆ విప్లవాత్మకమైన చికిత్సే బీటీవీఏ.

పొగతాగే అలవాటున్నవాళ్లకు అప్పుడప్పుడూ దగ్గు రావడం సహజం. కాని దీన్ని అశ్రద్ధ చేస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సిగరెట్లు కాల్చడం మాత్రం మానేయరు. దీర్ఘకాలం పొగతాగడం వల్ల భయంకరమైన క్యాన్సర్లు మాత్రమే కాదు.., చిన్నవిగా కనిపిస్తూ, విలయం సృష్టించే ఊపిరితిత్తుల జబ్బులు కూడా వస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌. సాధారణంగా ఎన్నో ఏళ్ల నుంచి పొగతాగుతూ ఉన్నవాళ్లకు ఈ వ్యాధి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. దీన్నే సీవోపీడీగా కూడా చెప్తారు. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ రెండు రకాలు వ్యక్తమవుతుంది. ఒకటి క్రానిక్‌ బ్రాంకైటిస్‌. రెండోది ఎంఫసీమా. క్రానిక్‌ బ్రాంకైటిస్‌ వల్ల దీర్ఘకాలికంగా దగ్గు వేధిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తుల గాలి గోడలు పాడైపోయి, లోపల గాలి నిండిపోవడమే ఎంఫసీమా. 


ఎంఫసీమాలో ఏమవుతుంది?

ఊపిరితిత్తుల్లో వాయుగోణులనే చిన్న చిన్న గదుల వంటి నిర్మాణాలుంటాయి. స్మోకింగ్‌ వల్ల ఊపిరితిత్తుల్లోని గదుల మధ్య వాల్వులు దెబ్బతింటాయి. అంటే ఈ వాయుగోణుల గోడలు దెబ్బతింటాయన్నమాట. ఫలితంగా నాలుగైదు వాయుగోణులు కలిపి ఒకే వాయుగోణిగా మారుతాయి. దాంతో వాటి మధ్య ఎక్కువ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. చిన్న చిన్న గదులుగా ఉంటే తక్కువ ఖాళీ ఉంటుంది. కాని నాలుగైదు కలిసి ఒకటిగా మారడంతో పెద్ద స్పేస్‌ ఏర్పడుతుంది. ఎక్కువ ఖాళీ ప్రదేశం నుంచి గాలిని బయటికి పంపించాలంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి ఊపిరి తీసుకునేటప్పుడు కష్టమై ఆయాసం వస్తుంది. ఈ సమస్య వల్ల వాయుగోణుల్లోంచి గాలి బయటకు వెళ్లదు గానీ లోపలికి వచ్చే గాలి వస్తూనే ఉంటుంది. దాంతో ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల్లో ఎక్కువ గాలి గుమిగూడుతుంది. దీన్ని హైపర్‌ ఇన్‌ఫ్లేషన్‌ అంటారు. ఈ పరిస్థితికి చేరిన ఊపిరితిత్తులను హైపర్‌ ఇన్‌ఫ్లేటెడ్‌ లంగ్‌ అంటారు. 


ఇలా ఊపిరితిత్తుల్లో ఎక్కువ గాలి జమ కావడం వల్ల ఊపిరితిత్తుల్లో పైభాగంలో ఉండే లోబ్స్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. కాబట్టి వాటిలోనే ఎక్కువగా సమస్య ఏర్పడుతుంది. గాలితో నిండి సైజు పెరిగిన పై భాగంలోని లోబ్స్‌ కింది లోబ్స్‌పై ఒత్తిడి కలిగించి నొక్కుకుపోయేలా చేస్తాయి. ఈ ఒత్తిడి వల్ల ఊపిరితిత్తుల కింది భాగంలో ఉండే డయాఫ్రమ్‌ కూడా పలుచబడిపోతుంది. దాంతో గాలి తీసుకోవడం కష్టమై ఆయాసం వస్తుంది. 


చికిత్స ఏంటి?

ఎంఫసీమా ఉన్నప్పుడు ఒకటే మార్గం. కాని వృద్ధాప్యంలో ఉన్నవాళ్లకు సర్జరీ చేయడం కూడా కరెక్ట్‌ కాదు. సర్జరీ సమయంలో ఇచ్చే మత్తుమందు వల్ల దాని సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇకపోతే తీవ్రమైన ఎంఫసీమా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌) చేస్తారు. కాని 60 ఏళ్లు పైబడినవాళ్లకు లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడం సరికాదు. శారీరకంగా, అవయవాల పనితీరు విషయంలో వాళ్లు బలహీనంగా ఉంటారు కాబట్టి వాళ్లకు చేయరు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి వచ్చిందే ఇంటర్వెన్షనల్‌ బ్రాంకోస్కోపీక్‌ వేపర్‌ అబ్లేషన్‌ (బీటీవీఏ).


ఎలా చేస్తారు?

ఎంఫసీమాను గుర్తించడానికి హై రిసొల్యూషన్‌ సిటీ స్కాన్‌ చేస్తారు. దీనిలోని డేటా ఆధారంగా చికిత్స చేస్తారు. బీటీవీఏ చికిత్సకు ముందు ఎంఫసీమాకు క్వాంటిటేటివ్‌ సిటి అనాలిసిస్‌ చేస్తారు. దీనిలో హెటిరోజెనిసిటీ, హోమోజెనిసిటీ ఇండెక్స్‌ను కాలిక్యులేట్‌ చేస్తారు. దాని ప్రకారం ఎన్ని లోబ్స్‌కి, ఎంత ఉష్ణోగ్రతతో చికిత్స అందించాలో నిర్ణయిస్తారు. 

ఎంఫసీమాలో ఊపిరితిత్తుల పైభాగంలోని లోబ్స్‌ పరిమాణం పెరుగుతుంది కాబట్టి బీటీవీఏ ద్వారా వీటి సైజును తగ్గిస్తారు. ఇంతకుముందైతే సర్జరీ ద్వారా వాటిని తీసేసేవాళ్లు. ఇప్పుడు బీటీవీఏ ద్వారా కంప్రెస్‌ చేస్తారు. దాంతో కింది లోబ్స్‌, డయాఫ్రమ్‌ అన్నీ నార్మల్‌ అవుతాయి. కాబట్టి గాలి మార్పిడి సజావుగా జరుగుతుంది. 

ఎంఫసీమాకి బీటీవీఏ చికిత్సను ఎఫ్‌డిఎ అప్రూవ్‌ చేసింది. కాని తొలి దశలో ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్లకు కూడా సర్జరీ సరిపోకుంటే బీటీవీఏ చికిత్సను వాడొచ్చని అధ్యయనాలు బలపరుస్తున్నాయి. కాని ఇది ఇంకా అప్రూవ్‌ కాలేదు. ఇది గత 5 ఏళ్లుగా బీటీవీఏ చికిత్స అందుబాటులో ఉంది. మనదేశంలో మాత్రం ప్రథమంగా ఇప్పుడే మొదలైంది. 


ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే..


సిగరెట్ల జోలికి వెళ్లొద్దు. పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయాలి. 

ప్యాసివ్‌ స్మోకింగ్‌ అంటే సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌కి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలి. సిగరెట్‌ తాగేవాళ్లకు దూరంగా ఉండాలి. 

బయోగ్యాస్‌కు ప్రభావితం కాకుండా జాగ్రత్తపడాలి.  

వంటింట్లో కట్టెల పొయ్యి వాడడం వల్ల కూడా ఎంఫసీమా రావొచ్చు. అందుకే నీళ్లు కాచుకోవడం కోసం కూడా దీన్ని వాడొద్దు.

వాతావరణ కాలుష్యం కూడా ఎంఫసీమాకు కారణమవుతుంది. కాబట్టి బయటికి వెళ్లినప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవడమో, మాస్క్‌ ధరించడమో చేయాలి. 

ఆక్యుపేషనల్‌గా అంటే కొన్ని రకాల వృత్తుల వాళ్లలో ఎంఫసీమా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్లు ఉదాహరణకు గనుల్లో పనిచేసేవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. 


డాక్టర్‌ జి. హరికిషన్‌

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ 

పల్మనాలజిస్ట్‌

యశోద హాస్పిటల్స్‌

సికింద్రాబాద్‌


logo