బుధవారం 08 ఏప్రిల్ 2020
Health - Feb 24, 2020 , 22:29:42

ఒత్తిడితో తెల్లజుట్టు..!?

ఒత్తిడితో తెల్లజుట్టు..!?

మానసిక ఒత్తిడి ఎక్కువైతే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే అవకాశం ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ హెయిర్‌ ఫోలికిల్స్‌లో మెలనోసైట్‌ కణాల సంఖ్య తగ్గడం వల్ల జుట్టు తెల్లబడుతుంది. మెలనోసైట్స్‌ మెలనిన్‌ అనే వర్ణక పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వల్ల నలుపు రంగు వస్తుంది. దీనికి కారణం చాలావరకు జన్యుపరమైనదే ఉంటుంది. ఇలా తెల్లబడిన జుట్టును మామూలుగా చేయడానికి ఎటువంటి చికిత్సా లేదు. హెయిర్‌ కలర్‌ వేసుకోవడమో, హెన్నా పెట్టుకోవడమో చేస్తుంటారు. అయితే కొందరిలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంటుంది. దీనికి ప్రధాన కారణం పోషకాల లోపమే. ప్రొటీన్లు, విటమిన్‌ బి 12, రాగి, ఇనుము వంటి పోషకాలు లోపించడం వల్ల వెంట్రుకల కుదుళ్లు, కణాలు తొందరగా ఏజింగ్‌ అయిపోతాయి. దాంతో జుట్టు తెల్లబడుతుంది. ఇలాంటప్పుడు ఈ పోషకాలను తీసుకుంటే కొంతవరకు ఫలితం ఉండవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను ఎక్కువగా తీసుకోవడం కోసం వాల్‌నట్స్‌, చేపలు తినడం, చర్మం, జుట్టును డ్యామేజ్‌ చేసే అతినీల లోహిత కాంతికి దూరంగా ఉండడం, విటమిన్‌ బి12, బి6 సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా చిన్నవయసులోనే జుట్టు తెల్లబడకుండా నివారించవచ్చు. 


ఇకపోతే పొగతాగే అలవాటు ఉన్నవాళ్లలో జుట్టు తెల్లబడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలున్నాయి. ఇటీవలి పరిశోధనలు మరో విషయాన్ని నిర్ధారించాయి. అధిక ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లలో తెల్లజుట్టు వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు హార్వర్డ్‌లోని రీజనరేటివ్‌ బయాలజీకి చెందిన సైంటిస్టులు. స్ట్రెస్‌ వల్ల శరీరంలో విడుదలయ్యే స్ట్రెస్‌ హార్మోన్‌ ఫైట్‌ అండ్‌ ఫ్లైట్‌ రెస్పాన్స్‌ వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. స్ట్రెస్‌ హార్మోన్‌ అయిన కార్టిసాల్‌ దీర్ఘకాలం ఉంటే శరీరం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా సింపథెటిక్‌ నర్వస్‌ సిస్టమ్‌ కూడా ప్రభావితం అవుతుంది. జుట్టు కుదుళ్ల దగ్గర ఉండే నరాలపై దీని ప్రభావం ఉండడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడిపోతుందని ఈ కొత్త అధ్యయనం తెలుపుతున్నది. ఈ పరిశోధన ఫలితాలు నేచర్‌ పత్రికలో కూడా ప్రచురితం అయ్యాయి. 


logo