శుక్రవారం 30 అక్టోబర్ 2020
Health - Feb 10, 2020 , 23:08:10

మోకాళ్లనొప్పికి ఇక డిజైనర్‌ కీళ్లు!

మోకాళ్లనొప్పికి ఇక డిజైనర్‌ కీళ్లు!

ప్రతి ఒక సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు మరింత మెరుగైన పరిష్కారం కోసం ఆలోచిస్తాం. వైద్యరంగం కూడా సరిగ్గా ఇలాగేపరిష్కారాలను వెతుకుతుంది. ఒక జబ్బుకు అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతి కన్నా మరింత మెరుగైన చికిత్సలను తీసుకురావడం కోసం ిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటుంది. సాంకేతికాభివృద్ధి చెందిన కొద్దీ మరింత సౌకర్యవంతమైన, పేషెంట్‌ సేఫ్టీ ట్రీట్‌మెంట్స్‌ ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తూనే ఉంటాయి.

 శస్త్రచికిత్సల్లోకి అలా వచ్చిందే రోబోటిక్స్‌. చికిత్సలకు రారాజై వైద్యరంగాన్ని  ఏలుతోంది. ఈ రోబో పరిజ్ఞానంలో కూడా కొత్త వెర్షన్‌లు వస్తున్నాయి. కీలుమార్పిడి చికిత్సల్లోకి కూడా వచ్చిన రోబో  పరికరం ఈ సర్జరీని మరింత సులువు చేయడమే కాకుండా, చిన్న చిన్న లోపాలు కూడా రాకుండా వందశాతం  కచ్చితమైన ఫలితాలను ఇస్తున్నది. 50 ఏళ్ల క్రితం మొదలైన కీలుమార్పిడి చికిత్స కొత్త పుంతలు తొక్కుతూ ఇప్పుడు 4జి స్మార్ట్‌ రోబోగా దేశంలోనే ప్రప్రథమంగా మన రాష్ట్రంలోకి అడుగిడింది. సన్‌షైన్‌ హాస్పిటల్‌ ఇందుకు శ్రీకారం చుట్టింది. ఈ రోబో సహాయంతో పేషెంటుకు సరిపోయే డిజైనర్‌ కీళ్లను అమర్చొచ్చు. 


దాదాపు 50 ఏళ్ల క్రితం మోకాలి కీలు మార్పిడికి బీజం పడింది. అరిగిపోయిన మోకాళ్ల స్థానంలో వివిధ రకాల పదార్థాలతో నింపి మోకాళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదట కీలులో రెండు ఎముకల మధ్యలో ఉండే కార్టిలేజ్‌ (గుజ్జు) అరిగిపోతే దాని స్థానంలో దంతం లాంటి పదార్థంతో నింపేవాళ్లు. ఆవు బ్లాడర్‌ని, చర్మాన్ని కూడా గుజ్జుగా వాడేవాళ్లు. ఎముకల మధ్యలో ఈ పదార్థాలు ఉండడం వల్ల రెండు ఎముకలు ఒకదానికొకటి రాసుకునే అవకాశం ఉండదు. దాంతో నొప్పి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగేది. అయితే ఇలా ఎముకల మధ్య కీలు భాగంలో నింపిన ఈ పదార్థానికీ, ఎముకలకీ ఎటువంటి అతుకూ లేకపోవడం వల్ల అది కీలు లోంచి జారిపోయేందుకు ఆస్కారం ఉండేది. అందువల్ల ఈ రకమైన కీలుమార్పిడి ఫెయిలైంది. 


అసలైన కృత్రిమ కీలు మార్పిడి..

ఆ తర్వాత.. 1974లో ఆధునిక కీలుమార్పిడి చికిత్స ఆరంభమైంది. న్యూయార్క్‌లో ఈ ఆధునిక నీ రీప్లేస్‌మెంట్‌ ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టారు. డాక్టర్‌ ఇన్సాల్‌, డాక్టర్‌ రాణావత్‌లు ఇప్పటి ఆ ఆపరేషన్‌ను తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌ కోసం కార్టిలేజ్‌ను భర్తీ చేయడానికి వేరే పదార్థాలతో నింపడం లాంటిది చేయలేదు. మెటల్‌, ప్లాస్టిక్‌లను ఉపయోగించి కొత్త కీలునే తయారుచేశారు. మెటల్‌ను కోబాల్ట్‌-క్రోమియం లోహ మిశ్రమంతో తయారుచేస్తారు. హైడెన్సిటీ పాలి ఎథిలీన్‌తో చేసిన ప్లాస్టిక్‌ కృత్రిమకీలు రెండో భాగం. 


ఎలా చేస్తారు?

తొడ ఎముక, పిక్క ఎముక మధ్యలో ఉండేదే మోకాలి కీలు. రెండు ఎముకలు ఒకదానికొకటి రాసుకుని పోకుండా ఉండేందుకు రెండింటి మధ్యలో కార్టిలేజ్‌ (మృదులాస్థి) అనే గుజ్జు లాంటి పదా ర్థం ఉంటుంది. వయసురీత్యా ఈ కార్టిలేజ్‌ అరిగిపోయినప్పుడు రెండు ఎముకలు రాసుకుని నొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు తొడ ఎముక కింది భాగంలో, పిక్క ఎముక పైభాగంలో కొంత ఎముక చెక్కేసి వాటి స్థానంలో ఈ మెటల్‌, ప్లాస్టిక్‌తో కూడిన కొత్తకీలును అమరుస్తారు. ఈ కొత కృత్రిమ కీలును ఇంప్లాంట్‌ అంటారు. దీనిలో లోహం, ప్లాస్టిక్‌ రెండు భాగాలుంటాయి. తొడ ఎముక దగ్గర కోబాల్ట్‌-క్రోమియం మెటల్‌ను, పిక్క ఎముక పై భాగంలో ప్లాస్టిక్‌ వచ్చేవిధంగా దీన్ని అమరుస్తారు. ఒకటి మెటల్‌, మరొకటి ప్లాస్టిక్‌ కావడం వల్ల ఈ రెండు భాగాలు ఎముకల లాగా ఒరుసుకుపోవు. వాటి మధ్య ఫ్రిక్షన్‌ తక్కువగా ఉండి, నొప్పి రాదు. ఈ కృత్రిమ కీలును రెండు ఎముకల మధ్యలో ఉంచి తరువాత బోన్‌ సిమెంట్‌తో కదలకుండా అమరుస్తారు. 

ఇంప్లాంట్‌లో మార్పులు..

30 ఏళ్ల క్రితం నుంచి కృత్రిమ కీలులో అనేక మార్పులు చేయడం మొదలుపెట్టారు. లోహపు భాగంలో మార్పులు చేశారు. కోబాల్ట్‌-క్రోమియం స్థానంలో టైటానియం పదార్థాన్ని వాడడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో ఇది అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా కొన్ని లోహాలకు కొందరికి అలర్జీ ఉంటుంది. దాన్నే మెటల్‌ సెన్సిటివిటీ అంటారు. టైటానియం వల్ల ఇటువంటి అలర్జీలు రావు. అంతేగాక టైటానియం కీలుకు గీతలు పడవు. కాబట్టి ఎక్కువ రోజులు మన్నుతుంది. ఇంతకుముందు ఇంప్లాంట్‌ 5 ఏళ్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 20 ఏళ్లు ఉంటోంది. దీని తర్వాత బంగారు రంగులో ఉండే నైట్రోబియం ఆక్సైడ్‌తో చేసిన కీలు వచ్చింది. దీం తో కూడా అలర్జీ ఉండదు. ఎక్కువ కాలం ఉంటుంది. ఈ మూడు రకాల కీళ్లనూ ఇప్పుడు వాడుతున్నారు. 


కింద కూర్చోనిచ్చే కొత్త కీలు

మొబైల్‌ బేరింగ్‌ నీ - ఇటీవలి కాలంలో మరింత సౌకర్యవంతమైన ఇంప్లాంట్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని మొబైల్‌ బేరింగ్‌ నీ అంటారు. కృత్రిమ కీలు లోని ప్లాస్టిక్‌ భాగం అటూ ఇటూ కదలగలిగేలా ఉంటుంది. దాంతో ఫ్రీగా, నాచురల్‌గా మూవ్‌మెంట్‌ ఉంటుంది. కాబట్టి కాలును ఎటువైపైనా ఫ్రీగా కదల్చగలుగుతారు. 

హై ఫ్లెక్స్‌ నీ - ఈ ఇంప్లాంట్‌ అమరిస్తే మోకాళ్లు ఎక్కువ మడత పెట్టి కింద కూర్చోవచ్చు. ఇంతకుముందు కృత్రిమ కీలు అమరిస్తే కింద కూర్చోవడానికి వీలయ్యేది కాదు. వీటితో మాత్రం కింద కూర్చోవడం సాధ్యమవుతుంది. మనవాళ్లు కింద ఎక్కువగా కూర్చుంటారు కాబట్టి ఆసియా దేశాల వాళ్ల కోసం వీటిని ప్రత్యేకంగా తయారుచేశారు. 

జెండర్‌ స్పెసిఫిక్‌ నీ - స్త్రీ, పురుషులకు విడివిడిగా ఉండే కృత్రిమ కీళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆడవాళ్ల ఎముకలు మగవాళ్ల ఎముకల కన్నా మందం తక్కువగా ఉంటాయి. వాటికి తగినట్టుగా మరింత సున్నితమైన ఇంప్లాంట్స్‌ వచ్చాయి. 

అదే కీలుమార్పిడి.. ఆధునిక పద్ధతులు

కీలుమార్పిడి ఆపరేషన్‌ పద్ధతి ఏదైనా కృత్రిమంగా తయారుచేసిన ఇంప్లాంట్‌ను అమర్చడమే అసలు ప్రక్రియ. అయితే ఈ ఆపరేషన్‌ పద్ధతి ఎంత సౌకర్యవంతంగా, పేషెంట్‌ సేఫ్టీగా ఉన్నదనేది ముఖ్యం. అందుకే ఆపరేషన్‌ చేసే విధానంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది ఆధునిక ఆర్థోపెడిక్‌ వైద్యరంగం. మొదట్లో ఓపెన్‌ సర్జరీ చేసేవాళ్లు. దాంతో ఇన్‌ఫెక్షన్లు వచ్చేవి. పైగా ఎముకలను ఆనుకుని ఉండే లిగమెంట్లు దెబ్బతినేందుకు ఆస్కారం ఎక్కువగా ఉండేది. బలమైన కొత్త కొత్త యాంటిబయాటిక్స్‌ వచ్చాక ఇప్పుడు ఇన్‌ఫెక్షన్లు తగ్గాయి. కాని లిగమెంట్‌ ఇంజురీ అనేది కొన్నిసార్లు సమస్యగానే ఉండేది. 


నావిగేషన్‌ నుంచి రోబో దాకా..

ఆపరేషన్‌ చేసేటప్పుడు లిగమెంట్‌ బ్యాలెన్సింగ్‌ సరిగ్గా చూసుకోగలిగితే అవి దెబ్బతినేందుకు అవకాశం ఉండదు. ఇంతకుముందు ఈ బ్యాలెన్స్‌ సాధ్యమయ్యేది కాదు. కట్స్‌లో అంటే ఇంప్లాంట్‌ను అమర్చడానికి ఎముకలను కట్‌ చేసేటప్పుడు వాటి కొలతల్లో తేడా వచ్చేది. కచ్చితంగా కొలతలు తీసుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఈ సమస్యలను అధిగమించడానికి ఒక్కొక్కటిగా ఆధునిక చికిత్సా ప్రక్రియలు వచ్చాయి. 

నావిగేషన్‌ : ఈ ప్రక్రియ 15 ఏళ్ల క్రితం అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్‌ ఆధారంగా మోకాలి కీలును రీప్లేస్‌ చేస్తారు. ఆపరేషన్‌ ప్లానింగ్‌ అంతా కంప్యూటర్‌లోనే చేస్తారు. ఆపరేషన్‌ ప్రక్రియ మాత్రం డాక్టర్‌ చేస్తారు. కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద ఎముకలను, కీలును చూస్తూ, వాటిని గమనిస్తూ జాగ్రత్తగా ఆపరేషన్‌ను నిర్వహిస్తారు. అయితే డాక్టర్‌ ఆపరేషన్‌ను తన చేతులతోనే చేస్తాడు కాబట్టి పూర్తి కచ్చితత్వంతో, పర్‌ఫెక్ట్‌గా రాకపోవచ్చు. బ్లేడ్‌ వంగిపోవచ్చు. పక్కనున్న కణజాలాలకు తగలొచ్చు. వందశాతం అక్యూరసీ ఉండదు. 

రోబోటిక్స్‌ : 10 ఏళ్ల క్రితం వైద్యచికిత్సల్లోకి రోబో ప్రవేశించింది. రోబోటిక్‌ సర్జరీ అంటే ఆపరేషన్‌ అంతా రోబోనే చేసేయదు. రోబో సహాయంతో డాక్టర్‌ చేస్తారు. రోబో వల్ల ఎముక కటింగ్‌లో కచ్చితత్వం ఉంటుంది. ఎక్కువ తక్కువలు రావు. అయితే మొదట వచ్చిన రోబోను పూర్తి స్థాయిలో డాక్టరే కంట్రోల్‌ చేయాలి. రోబోకు హాప్టిక్‌ కంట్రోల్‌ ఉండేది కాదు. దీనివల్ల పక్కనున్న లిగమెంట్‌ కణజాలం డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉందనుకుంటే డాక్టర్‌ రోబోను ఆపాల్సి ఉండేది. అందుకే ఈ సమస్యను అధిగమించే కొత్త రోబో ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. 


4జి స్మార్ట్‌ రోబో

కీలుమార్పిడి సర్జరీలో మొన్నటికి మొన్న అందుబాటులోకి వచ్చిన రోబోటిక్‌ సర్జరీని మాకో రోబో సహాయంతో చేస్తారు. ఇది 4జి రోబో. స్మార్ట్‌ రోబో అంటారు. ఎముకలను కచ్చితంగా కట్‌ చేయడమే కాకుండా పక్కన కణజాలం, లిగమెంట్‌ డ్యామేజి కాకుండా ఆపుతుంది. డ్యామేజ్‌ అవబోతుందనేది ముందే గ్రహించి దానికదే కటింగ్‌ను ఆపుతుంది. మళ్లీ డాక్టర్‌ సరైన స్థానంలోకి బ్లేడ్‌ను తీసుకెళ్తేనే ఎముకను కట్‌ చేస్తుంది. దీన్నే హాప్టిక్‌ కంట్రోల్‌ అంటారు. డాక్టర్‌ పొరపాటున కూడా డ్యామేజ్‌ చేసేందుకు అవకాశం ఉండదు. కట్‌ చేయాల్సిన ఎముక భాగం నుంచి బ్లేడ్‌ పక్కకు జరుగుతుందంటే చాలు.. దానికదే అక్కడే ఆగిపోతుంది. అందువల్ల డ్యామేజ్‌ కాదు. దీన్ని సెమీ ఆటానమస్‌ రోబో అంటారు. అంటే రోబో, డాక్టర్‌ ఇద్దరూ కలిసి సర్జరీ చేస్తారు. సాధారణంగా వెయ్యి మందిలో ఒకరికి డాక్టర్‌ వల్ల తప్పులు జరుగుతుంటాయి. వాటికి కూడా రోబో వల్ల అవకాశం ఉండదు. 

తుంటి జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌కు ఈ రోబో మాత్రమే అందుబాటులో ఉంది. తుంటి భాగంలో బంతిగిన్నె కీలు ఉంటుంది. ఈ రకమైన కీలుకి ఈ రోబో మాత్రమే చేయగలదు. భవిష్యత్తులో భుజం కీలుకి కూడా ఈ రోబోతో  చేయగల సర్జరీ అందుబాటులోకి రానుంది. 

పార్షియల్‌ నీ రీప్లేస్‌మెంట్‌లో కీలులో అరిగిన భాగాన్ని మాత్రమే తీసేసి, ఆ భాగాన్ని మాత్రమే కొత్తది అమరుస్తారు. చిన్నవయసులో మోకాలు అరిగితే ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ పార్షియల్‌ నీ రీప్లేస్‌మెంట్‌కి కూడా ఈ 4జి రోబో ఉపయోగపడుతుంది. 


సర్జరీ రోబో చేస్తుందా?!

రోబోతో సర్జరీ అనగానే రోబో సినిమాలో లాగా సర్జరీ అంతా అదే చేసేస్తుందనుకోవడం పొరపాటు. రోబో సహాయంతో డాక్టర్‌ సర్జరీని పూర్తి చేస్తారు. అయితే ఈ మాకో 4జి రోబోటిక్‌ సర్జరీలో ముందుగా కంప్యూటర్‌లో మోకాలు ఎట్లా ఉందో కనిపిస్తుంది. లిగమెంట్‌ బ్యాలెన్సింగ్‌ను కంప్యూటర్‌లో చూస్తూ అడ్జెస్ట్‌ చేసుకోవచ్చు. సైజులు మార్చుకోవచ్చు. ఆయా సైజులను వారి మోకాలి ఎముకలకు అనుగుణంగా సెట్‌ చేసుకోవాలి. కంప్యూటర్‌లో ఒకవైపు హాప్టిక్‌ బౌండరీలు కనిపిస్తాయి. అంటే ఎముక ఉన్న భాగానికి అటూ ఇటూ బౌండరీ లైన్స్‌ ఉంటాయి. వాటి మధ్యలో మాత్రమే బ్లేడ్‌తో కట్‌ చేయాలి. ఆ బౌండరీలను దాటితే లిగమెంట్స్‌ డ్యామేజీ అవుతాయి. ఈ బౌండరీలను దాటకుండా రోబో నియంత్రిస్తుంది. 


కీళ్లు కాపాడుకోవాలంటే...


మోకాళ్ల నొప్పులు.. కీళ్లనొప్పులు అంటూ బాధపడేవాళ్లను ప్రతి ఇంటా చూస్తూనే ఉంటాం. పనుల ఒత్తిడిలో కొంత.. బద్దకంతో మరికొంత... వ్యాయామానికి సమయం కేటాయించలేకపోవడం, అధిక బరువు, స్థూలకాయం... ఆధునిక జీవనశైలి.. వెరసి చిన్న వయసులోనే మోకాళ్లనొప్పులతో బాధపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి మోకాళ్ల కీళ్లను కాపాడుకోవాలంటే ప్రధానంగా వాటిపై బరువు ఎక్కువగా పడకుండా చూసుకోవాలి. అందుకోసం అధిక బరువు, స్థూలకాయ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మరవొద్దు. ముఖ్యంగా వాకింగ్‌ వల్ల మోకాలి కీళ్లకు మంచి పోషణ అందుతుంది. కాబట్టి అవి ఎక్కువకాలం పాడైపోకుండా ఉంటాయి. సాధ్యమైనంతవరకు ఎక్కువసేపు కింద మోకాళ్లు మడిచి కూర్చోకపోవడం మంచిది. మెట్లు ఎక్కువగా ఎక్కొద్దు. 

ప్రత్యేకత - డిజైనర్‌ కీలు

దుస్తుల షాప్‌కి వెళ్లి రెడీమేడ్‌ డ్రెస్‌ కొనుక్కుంటే మన కొలతలకు సరిగ్గా ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. మళ్లీ దాన్ని మన కొలతలకు తగ్గట్టుగా సైజ్‌ చేయించుకోవాల్సి వస్తుంది. అదే ఏ ఫ్యాషన్‌ డిజైనర్‌ దగ్గరికో వెళ్లి మన కొలతలు ఇచ్చి, వాటికి తగినట్టుగా డ్రెస్‌ను డిజైన్‌ చేయించుకుంటే మనకు అతికినట్టుగా సరిపోతుంది. 

ఇప్పుడు కృత్రిమ కీలు విషయంలో కూడా ఇదే పంథా అందుబాటులో ఉంది. అంటే పేషెంటు కీలు, ఎముకల కొలతలు తీసుకుని వాటికి తగినట్టుగా కొత్త కృత్రిమ కీలు రూపొందించి అమరుస్తారన్నమాట. 4జి మాక్‌రోబోతో ఇది ఇప్పుడు సాధ్యం అవుతున్నది. ఏ పేషెంటుకు ఆ పేషెంటు కీలు ప్రత్యేకంగా తయారుచేయడమే దీని ప్రత్యేకత. 

ముందుగా రోగి ఎముకలను సిటి స్కాన్‌ చేస్తారు. ఆ కీలు ఎలా ఉందో చూసి దాన్ని రీకన్‌స్ట్రక్ట్‌ చేస్తారు. అలా ప్రతి రోగికి అతనికి సరిపోయే కీలును ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఇంతకుముందయితే ఇంప్లాంట్‌ రెడీమేడ్‌ డ్రెస్‌ అయితే, ఇప్పుడు డిజైనర్‌ డ్రెస్‌ అన్నమాట. 

మాకో 4జి రోబో.. ప్రయోజనాలు


- నొప్పి తక్కువ. కాబట్టి రక్తస్రావం ఎక్కువగా ఉండదు. 

- డిశ్చార్జి టైం తక్కువ. సర్జరీ అయిన తెల్లవారి నడుస్తారు. రెండోరోజే ఇంటికి వెళ్లిపోతారు. 

- ప్రతి పేషెంటుకూ వారికి సరిపోయే జాయింట్‌నే రూపొందించి, అమర్చవచ్చు.  

- ఈ సర్జరీని టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌కే గాక పాక్షిక మోకాలి కీలు మార్పిడికి కూడా చేయవచ్చు.

- తుంటికీలు మార్పిడి దీంతో మాత్రమే చేయగలం. 

- లిగమెంట్‌ ప్రొటెక్షన్‌ ఉంటుంది. 

- ఇన్‌ఫెక్షన్‌ అవకాశం చాలా తక్కువ.

- వంద శాతం కచ్చితత్వంతో ఆపరేషన్‌ చేయొచ్చు.