సోమవారం 06 ఏప్రిల్ 2020
Health - Feb 07, 2020 , 22:31:44

నాలుకను చూసి వ్యాధి నిర్ధారణ

నాలుకను చూసి వ్యాధి నిర్ధారణ

జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైంది నాలుక. మాట్లాడాలన్నా, రుచిచూడాలన్నా, ఆహారాన్ని నమిలి మింగాలన్నా నాలుక సాయం ఎంతో అవసరం. అయితే డాక్టర్లు నాలుకను చూసి కూడా జబ్బు తీవ్రతను, రాబోయే జబ్బులను చెప్పగలరు. మనమూ నాలుకను చూసి అనారోగ్యాన్ని చెప్పొచ్చు. ఎలాగంటే?

  • విపరీతమైన వాంతులు, విరేచనాల వల్ల శరీరంలోని నీరు బయటికి పోయి ‘డీహైడ్రేషన్‌' బారిన పడుతుంటాం. ఈ సందర్భంలో ఎన్ని నీళ్లు తాగినా నాలుక పొడిబారినట్లు అనిపిస్తుంది. పిల్లల్లో, వృద్ధుల్లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. భయం, ఆందోళన, సైనసైటిస్‌, కొన్ని మానసిక సమస్యల వల్ల కూడా నాలుక పొడిబారవచ్చు.
  • కొందరి నాలుక నోట్లో పట్టనంత పెద్దదిగా మారుతుంది. దీన్ని వైద్య పరిభాషలో మాక్రో గ్లాసియా అంటారు. ఎదుగుదల హార్మోన్ల ఉత్పత్తి అధికంగా ఉండటం, ముదిరిన థైరాయిడ్‌ సమస్య ఈ లక్షణానికి ప్రధాన కారణాలు. కొన్నిసార్లు క్యాన్సర్‌ కణతులు, ఎలర్జీ కూడా ఈ లక్షణాలకు మూలం కావచ్చు.
  • ఒంట్లో ఇనుము, నాయిసిన్‌ వంటి బీ కాంప్లెక్స్‌ విటమిన్లు తగ్గినప్పుడు నాలుక నున్నగా అయిపోతుంది. యాంటీ బయాటిక్స్‌, ఎసిడిటీ మందుల వాడకం వల్ల నాలుక నల్లబడే అవకాశం ఉంది. నాలుక నున్నగా అయిపోయినప్పుడు పోషకాలు, ఇనుము ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.
  • కొందరికి విటమిన్‌ బి 12 లోపం వల్ల నాలుక మీద నల్లమచ్చలు రావచ్చు. మరికొందరికి కాఫీ, నలుపురంగులో నల్లమచ్చలు వస్తుంటాయి. అయితే మానసికి ఒత్తిడిని ఎదుర్కొంటున్న పిల్లలు, నిద్రలేమి బాధితులు, వ్యక్తిగత సమస్యల బాధితుల్లో నాలుకమీద నంజు పొక్కులు కనిపిస్తాయి. కానీ ఇలా మచ్చలు కనిపిస్తే తప్పకుండా వైద్యున్ని సంప్రదించాలి. ఈ మచ్చలు క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది.
  • మూడింట రెండొంతుల మంది మహిళల్లో ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత వల్ల ముదురు గులాబీ రంగులో ఉండాల్సిన నాలుక పాలిపోయి కనిపిస్తుంది. నాలుకపాలిపోతే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించి తగిన మందులు వాడాలి. తగిన ఆహారం తీసుకోవాలి.


logo