మంగళవారం 31 మార్చి 2020
Health - Feb 03, 2020 , 22:51:01

ముందే కనిపెడదాం క్యాన్సర్‌ను గెలుద్దాం!

ముందే కనిపెడదాం క్యాన్సర్‌ను గెలుద్దాం!

రెండు మూడు దశాబ్దాల క్రితం.. క్యాన్సర్‌ వస్తే ఇక కాటికి పోయినట్టే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు క్యాన్సర్‌ని ఎదుర్కోవడం మన వైద్యులకు ఎడమ చేతి పని. అయితే క్యాన్సర్‌ను త్వరగా గుర్తించలేకపోవడం వల్ల మాత్రమే క్యాన్సర్‌ మరణాలు పెరగడానికి ప్రధాన కారణం. క్యాన్సర్‌ వచ్చినప్పటికీ ఆధునిక చికిత్సలెన్నో ఉన్నాయి. వీటికి తోడు క్యాన్సర్‌ను ఎదుర్కోగలిగే గుండెధైర్యం, కుటుంబసభ్యుల తోడ్పాటుతో క్యాన్సర్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే క్యాన్సర్‌ రోగులకు కుటుంబం అంతా అండగా నిలుస్తూ, కలిసి అవగాహన పెంచుకుంటే తప్పనిసరిగా క్యాన్సర్‌ను జయించవచ్చంటున్నారు క్యాన్సర్‌ నిపుణులు.

వ్యాధి, దాని లక్షణాలు, ఆ వ్యాధికి అందే చికిత్స.. ఈ విషయాల్లో పేషెంటు మనస్తత్వం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎంత ధైర్యంగా ఉంటే చికిత్స అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే క్యాన్సర్‌ చికిత్సలో శారీరకంగానే కాదు, కౌన్సెలింగ్‌కి కూడా ప్రాధాన్యం ఉంటుంది. అయితే క్యాన్సర్‌ను ఏ దశలో కనుక్కున్నామనే దానిపైనే చికిత్సా విధానాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఏవి క్యాన్సర్‌ లక్షణాలు అయివుండొచ్చనే అవగాహన కుటుంబంలో అందరూ కలిగి ఉండడం అవసరం. 


వీటిపై అశ్రద్ధ వద్దు

తలనొప్పి : ఉదయం లేవగానే తల భారంగా ఉండడం, తీవ్రమైన నొప్పి, వేగంగా వచ్చే వాంతులు, వికారం వంటి లక్షణాలు మెదడులోని కణితులకు సంకేతాలు కావొచ్చు. 

గొంతునొప్పి : నీరు, వాతావరణం మారడం వల్లనో, మరే కారణం వల్లనో గొంతు బొంగురుపోవడం, నొప్పిగా ఉండడం సహజమే. అయితే మందులు కోర్సుగా వాడినా తగ్గకపోతే మాత్రం చెకప్స్‌ చేయించుకోవాలి. థైరాయిడ్‌, గొంతు సంబంధిత క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉండే అవకాశం ఉంది. 

దగ్గు, ఆయాసం : సిగరెట్లు తాగే వాళ్లకు క్యాన్సర్‌ రావడం కూడా సహజమే. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లెలో రక్తం, ఆయాసం బాధిస్తుంటే టిబి, లేదా లంగ్‌ క్యాన్సర్‌ లక్షణాలు కావొచ్చు. 

కడుపుబ్బరం, మంట : ఫాస్ట్‌ఫుడ్స్‌ కల్చర్‌, గతి తప్పిన ఆహారం, నిద్ర వేళలు, ఒత్తిడి వంటివి పరోక్షంగా పొట్టపై ప్రభావం చూపి అసిడిటీ, గ్యాస్‌ సమస్యలు వస్తున్నాయి. కాని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, మంచి జీవనశైలి ఉన్నప్పటికీ జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు తరచుగా వేధిస్తూ ఉంటే ఎండోస్కోపీ, స్కానింగ్‌ లాంటి పరీక్షలు చేయించుకోవాలి. కాలేయం, క్లోమం, గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్లను తొలిదశలోనే కనుక్కోవచ్చు. 

మూత్రంలో తేడా : మూత్రంలో రక్తం పడడం, ఆగి ఆగి రావడం, మంటగా ఉండడం వంటి సమస్యలను వేడి చేసిందని అశ్రద్ధ చేస్తుంటారు. వీటికి ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీస్టోన్స్‌ కారణం కావొచ్చు. అయితే మందు లు వాడినా ఇవి తగ్గకుంటే యూరినరీ బ్లాడర్‌ సంబంధిత క్యాన్సర్‌ కావొచ్చు. ప్రొస్టేట్‌ సమస్య కూడా కావొచ్చు. 

నెలసరి తేడాలు : నెలసరి మధ్య రక్తస్రావం, పొట్ట భారంగా ఉండడం, ఆకలి మందగించడం కొన్ని సందర్భాల్లో అండాశయ, గర్భసంచి క్యాన్సర్లు కావొచ్చు. 

మలవిసర్జనలో తేడా : అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం పడడానికి పైల్స్‌, ఫిషర్స్‌, ఫిస్టులా లాంటి కారణాలున్నప్పటికీ వీటి వెనుక పెద్దపేగు క్యాన్సర్‌ కూడా ఉండొచ్చు. 

రొమ్ములో గడ్డ : పాలగడ్డలుగానో, నెలసరి ముందు కలిగే మార్పుగానో భావించి రొమ్ములో గడ్డను నిర్లక్ష్యం చేయొద్దు. అది రొమ్ము క్యాన్సర్‌ కావొచ్చు. 

చర్మంపై మచ్చలు : విపరీతమైన అలసట, చర్మంపై ఊదారంగు మచ్చలు, చర్మం కమిలిపోవడం, రక్తహీనత వెనుక బ్లడ్‌ క్యాన్సర్‌ కారణం కావొచ్చు. 

గోళ్లలో తేడా : గోళ్లలో ఎటువంటి మార్పులు కలిగినా, ముందుకు వంగినట్లు కనిపించినా అవి కాలేయం, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు సూచనలు కావొచ్చు. 


కాపాడే పరీక్షలు

పొగాకు వాడేవాళ్లు, అతిగా ఆల్కహాల్‌ తీసుకునేవాళ్లు, కాలేయ వ్యాధులున్నవాళ్లకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలెక్కువ. శారరీక శ్రమ తక్కువగా ఉండడం, స్థూలకాయం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం అతిగా తీసుకునేవాళ్లు, రసాయన పరిశ్రమల్లో పనిచేసేవాళ్లు, కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉన్నవాళ్లు, వయసు పైబడినవాళ్లు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను చేయించుకోవాలి. 

20 ఏళ్లు దాటినవాళ్లు తమకు తాము స్నానం చేసేటప్పుడు రొమ్ము పరీక్ష చేసుకోవాలి. ఎడమ అరచేతితో కుడి రొమ్మును, కుడి అరచేతితో ఎడమ రొమ్మును పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైనా గట్టిగా, గడ్డలాగా తగిలితే వెంటనే డాక్టర్‌ను కలవాలి. నిపుల్స్‌ ఒకే పరిమాణంలో, ఒకే వరుసలో ఉన్నాయో లేదో, వాటి నుంచి ఏమైనా స్రావాలు వస్తున్నాయా చూసుకోవాలి. నెలసరి ఆగిపోయిన స్త్రీలు కూడా పరీక్షించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ప్రతి 5 ఏళ్లకోసారి మామోగ్రఫీ టెస్టు చేయించుకోవాలి. 40 తరువాత 50 ఏళ్ల వరకు రెండు నెలలకోసారి చేయించుకోవాలి. 50 ఏళ్లు దాటాక ప్రతి ఏటా పరీక్ష చేయించుకోవాలి. రిస్క్‌ కారకాలున్నవాళ్లు 40 ఏళ్ల వయసునుంచే ప్రతి ఏటా చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్‌కు జన్యుమూలాలను గుర్తించే పరీక్షలు కూడా ఉన్నాయి. 

20 ఏళ్లు వచ్చి, వివాహితులైన స్త్రీలందరూ ప్రతి ఏటా పాప్స్‌ స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. దీనిద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తెలుసుకోవచ్చు. దీనికి వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ టీకాలను 10 నుంచి 12 ఏళ్ల లోపు వయసులో తీసుకోవడం ఉత్తమం. అయితే 46 ఏళ్ల వయసుదాకా కూడా ఈ టీకాలు తీసుకోవచ్చు. 

50 ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కనుక్కోవడానికి ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయించుకోవాలి. డిజటల్‌ రెక్టల్‌ పరీక్ష కూడా అందుబాటులో ఉంది. కుటుంబ చరిత్ర ఉంటే 45 ఏళ్ల నుంచే చేయించుకోవాలి. 

పొట్టకు సంబంధించిన సమస్యలుండి అనుమానంగా ఉంటే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలు క్యాన్సర్‌ను కనుక్కోవడంలో ఉపయోగపడుతాయి. బ్రెయిన్‌ క్యాన్సర్‌ను సిటి, ఎంఆర్‌ఐ స్కాన్‌లో కూడా తెలుసుకోవచ్చు. 


కుటుంబమే కీలకం

కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా క్యాన్సర్‌ అని నిర్ధారణ అయిందంటే కుటుంబ స్థితిగతులన్నీ అల్లకల్లోలం అవుతాయి. ముఖ్యంగా స్త్రీలకు ఈ వ్యాధి వచ్చినప్పుడు మరింత కుంగిపోతారు. తాము లేకపోతే భర్త, పిల్లలు ఏమైపోతారోననే వ్యధతో పాటుగా, వైద్యానికి ఖర్చు ఎక్కువ అవుతుందని ఆందోళన పడుతుంటారు. ఇలాంటప్పుడు డాక్టర్ల చికిత్సలతో పాటుగా కుటుంబసభ్యుల సహానుభూతి, సహకారం ముఖ్యపాత్ర వహిస్తాయి. అయితే కొన్ని కుటుంబాల్లో క్యాన్సర్‌ వ్యాధి విడాకులు దారితీయడం కూడా చూస్తుంటాం. కాని ఇలాంటి సమయంలోనే క్యాన్సర్‌ సోకిన వాళ్లపై ప్రేమ చూపించడం అవసరం. క్యాన్సర్‌ అంటువ్యాధేమీ కాదు. వంశపారంపర్యంగా పుట్టబోయే బిడ్డలకు వచ్చేదీ కాదు. కాస్త ప్రేమ, కాసింత సహనం, మరికొంత ఆదరణ అందిస్తే క్యాన్సర్‌ రోగులు తొందరగా జబ్బును జయించి బయటపడగలుగుతారు. 

డాక్టర్‌ సి.హెచ్‌.మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

ఒమేగా హాస్పిటల్స్‌

హైదరాబాద్‌

మహిళలూ.. అశ్రద్ధ వద్దు!


రొమ్ము, సర్వికల్‌, నోటి క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని క్యాన్సర్లలో ఇవి 41 శాతం ఉంటున్నాయి. మనదేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటున్నాయి. మారిన జీవనశైలి, ఊబకాయం, కాలుష్యం మహిళల హార్మోన్లపై దుష్ప్రభావం చూపిస్తున్నాయి. దాంతో అవి సమతుల్యం కోల్పోయి నెలసరి సమస్యలు, ఇతర హార్మోన్‌ సమస్యలు ఎక్కువవుతున్నాయి. వీటికి తోడు చదువు, కెరీర్‌ల వల్ల ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనకపోవడం, పాలివ్వకపోవడం, ఒక్కరిని మాత్రమే కనడం లాంటి మార్పులు స్త్రీ హార్మోన్లపై ప్రభావం చూపి మహిళల క్యాన్సర్ల అవకాశం పెంచుతున్నాయి. మన ఆడవాళ్లకు తమ ఆరోగ్యం మీద కన్నా కుటుంబ స్థితిగతులు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైనే శ్రద్ధ ఎక్కువ. తమ గురించి తాము పట్టించుకోని మహిళలే ఎక్కువ. అందువల్ల 70 శాతం మహిళలకు చాలా ఆలస్యంగా క్యాన్సర్‌ బయటపడుతోంది. అందువల్ల పాశ్చాత్యుల్లో 5 ఏళ్ల సర్వియలెన్స్‌ 90 శాతం ఉంటే మనవాళ్లు 50 నుంచి 60 శాతం మంది మాత్రమే క్యాన్సర్‌ వచ్చాక 5 ఏళ్లు బతుకుతున్నారు. స్క్రీనింగ్‌ పరీక్షలు సరిగ్గా లేకపోడం, ఆరోగ్యంపై అవగాహన తక్కువ, అశ్రద్ధ ఎక్కువ కావడం, ఆలస్యంగా వ్యాధి బయటపడడం వల్ల మూడు పదుల్లోనే యాభై ఏళ్లు కూడా రాకముందే క్యాన్సర్‌ బారిన పడి చనిపోతున్నారు.


 మన మహిళలు. అందుకే ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి. రొమ్ములో గడ్డలు, స్రావాలు, ఇతరత్రా ఏమైనా తేడాలున్నాయేమో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అజీర్తి, కడుపుబ్బరం, మల,మూత్ర సమస్యలుంటే కొన్నిసార్లు అండాశయ క్యాన్సర్‌ ఉండొచ్చు. మెనోపాజ్‌ తరువాత రక్తస్రావం కనిపిస్తే సర్వికల్‌ క్యాన్సర్‌ కావొచ్చు. వీటిపై అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికన్నా ప్రధానమైంది కుటుంబ సహకారం. కుటుంబానికి మూలస్తంభం మహిళ. ఆమెను కోల్పోతే కుటుంబం అనాథ అయిపోతుంది. కుటుంబ సభ్యులందరి సహకారం ఆమెకు ఉండాలి. కుటుంబమంతా ఒక్కటై ఆమెకు ధైర్యం చెప్పాలి. సపోర్టివ్‌ గ్రూప్స్‌ సహకారం కూడా తీసుకోవాలి. పాశ్చాత్యులతో పోలిస్తే మనదేశంలో పదేళ్లు ముందే మనవాళ్లకు క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి 40 ఏళ్ల వయసునుంచే స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. పళ్లైన దగ్గర్నుంచి పాప్‌ స్మియర్‌ మొదలుపెట్టి, ప్రతి మూడేళ్లకోసారి చేయించుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్‌ చికిత్సల్లో కూడా కొత్త పద్ధతులు వచ్చాయి. సైడ్‌ ఎఫెక్టులు తక్కువగా ఉండే కీమోథెరపీ మందులొచ్చాయి. పక్కన ఉండే కణజాలాలకు హాని చేయని రేడియేషన్లు వచ్చాయి. మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీలున్నాయి. రొమ్ము మొత్తం తొలగించకుండా ఉంచగలిగే చికిత్సలున్నాయి. కాబట్టి క్యాన్సర్‌ వచ్చినా డీలా పడిపోకుండా అందరి సహకారంతో ధైర్యంగా ఎదుర్కోవాలి. 

డాక్టర్‌ గీతా నాగశ్రీ

సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

కేర్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌

గచ్చిబౌలి, హైదరాబాద్‌


logo
>>>>>>