బుధవారం 08 ఏప్రిల్ 2020
Health - Feb 03, 2020 , 22:47:34

కరోనా.. కథ ఇదీ!

కరోనా.. కథ ఇదీ!

శత్రువులు దండెత్తి వస్తున్నారంటే.. వాళ్లు రాకముందే మన సైనిక దళాలను అప్రమత్తం చేస్తాం. సైనిక శక్తిని, ఆయుధ సంపత్తినీ పెంచుకుంటాం. ఇప్పుడు మన ముందున్న ముప్పు ఇటువంటిదే. మన శత్రువు కరోనా వైరస్‌ రూపంలో రాబోతున్నది. మన తెలుగు రాష్ర్టాల్లోకి ఇంకా ప్రవేశించకపోయినప్పటికీ చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా కరోనా వైరస్‌ ఇక్కడికి రాకముందే దాన్ని ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధం కావాలి. ఒకవైపు వ్యాక్సిన్ల ఆయుధాలను తయారుచేసే ప్రయత్నంలో ఉంది వైద్యపరి శోధనా రంగం. మరోవైపు దీని బారిన పడకుండా, దాన్ని ఎదుర్కొనేందుకు మన శరీరంలోని రక్షక భట శక్తిని.. అదే రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఇది.

  • యుద్ధానికి బీ రెడీ!

ఒకప్పుడు ప్లేగు, మలేరియా లాంటి వ్యాధులు మనల్ని పిశాచాల్లా పీడించుకుతిన్నాయి. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధి ప్రపంచ దేశాలన్నింటినీ వణికించింది. కానీ ఎంతటి భయంకరమైన వ్యాధులనైనా మన వైద్య పరిజ్ఞానంతో వాటిని ఎదుర్కొన్నాం. వ్యాక్సిన్లు, ఆధునిక చికిత్సలతో వాటిపై గెలుపొందాం. మొన్నటికి మొన్న వచ్చిన సార్స్‌ వైరస్‌ను కూడా తిప్పికొట్టగలిగాం. ఇప్పుడు జన్యుమార్పులు చేసుకుని సరికొత్త రూపంలో దాడిచేస్తోంది కరోనా వైరస్‌. దీన్ని కూడా తప్పనిసరిగా ఎదుర్కొంటాం. కానీ ఈలోపే అది తన విశ్వరూపం చూపించి, విలయతాండవం చేయవచ్చు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి. 


అసలేమిటీ కరోనా..?

కరోనా.. ఈ మూడక్షరాల పదం ఇప్పుడు ప్రపంచాన్నే భయకంపితం చేస్తున్నది. ఇదొక ఆర్‌ఎన్‌ఎ వైరస్‌. ఇది జూనోటిక్‌ రకానికి చెందిన వైరస్‌. అంటే జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశిస్తుందన్నమాట. కరోనా జాతి వైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు అది కిరీటం ఆకారంలో కనిపిస్తుంది. ఇది కొత్తదేమీ కాదు. ఆమధ్య కాలంలో సౌదీ, దుబాయ్‌ లాంటి దేశాల్లో కలకలం సృష్టించిన మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌), చైనాలో మొదలైన సార్స్‌ (సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వ్యాధులు కలిగించే వైరస్‌లు కరోనా జాతివే. అయితే తనలోని జన్యుపదార్థంలో మార్పులు చేసుకుంటూ పుట్టుకొచ్చిన ఈ కొత్త కరోనా వైరస్‌ (నావల్‌ కరోనా వైరస్‌ 2019) ఇప్పుడు కలవరపరుస్తోంది. 


ఎలా వ్యాపిస్తుంది?

కరోనా వైరస్‌లు సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంటాయి. ఇప్పుడు మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తాయని నిర్ధారణ అయింది. పాములు, కుందేళ్ల లాంటి జంతువుల నుంచి చైనీయులకు వచ్చిందని నిర్ధారించారు. ఒకసారి మనుషుల్లోకి ప్రవేశించాక ఇక దాని వ్యాప్తి మరింత సులువైంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బయటకు వచ్చే లాలాజల తుంపరల ద్వారా మరో మనిషికి వ్యాపిస్తుందని చెప్తున్నారు. ఈ తుంపర్లు పడిన వస్తువులను, తలుపులు, గొళ్లాల వంటి వాటిని ముట్టుకుని, ఆ చేతులతో కళ్లు, నోరు, ముక్కును రుద్దుకుంటే కూడా ఈ వైరస్‌ ఇన్‌ఫెక్ట్‌ చేస్తుంది. ఎక్కువ మంది గుమిగూడిన చోట ఈ కరోనా వైరస్‌ వ్యాప్తి సులువుగా జరుగుతుంది. అందుకే చేతుల శుభ్రత కూడా చాలా అవసరమని చెప్తున్నారు యశోద హాస్పిటల్‌కి చెందిన పల్మనాలజిస్టు డాక్టర్‌ హరికిషన్‌. 


లక్షణాలు ఎలా ఉంటాయి?

కరోనా వైరస్‌ల ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా శ్వాసకోశ సమస్యలనే తీసుకొస్తాయి. కాబట్టి వీటి లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యల లాగానే ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన మొదటి రెండు వారాల పాటు ఎటువంటి లక్షణాలు కనబడవు. ఎందుకంటే శరీరంలోకి వైరస్‌ ప్రవేశించిన తరువాత అది పెరగడానికి కొంత సమయం పడుతుంది. దీన్ని ఇంకుబేషన్‌ పీరియడ్‌ అంటారు. జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, తలనొప్పి, ఛాతిలో అసౌకర్యం, ఆయాసం, ఆస్తమా లాంటి లక్షణాలు, ముక్కు కారడం, గొంతునొప్పి, డయేరియా కూడా ఉండొచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన లక్షణం జ్వరం. 5 నుంచి 10 రోజుల పాటు తీవ్రమైన జ్వరం ఉంటుంది. కరోనా వైరస్‌ లక్షణాలు తీవ్రమైతే న్యుమోనియాగా మారి రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌ కావొచ్చు. చివరికి మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌కి దారితీయవచ్చు. దాంతో ప్రాణాపాయం ఉంటుందంటున్నారు డాక్టర్‌ హరికిషన్‌. 


మరి చికిత్స ఎలా?

కరోనా వైరస్‌ను డిఎన్‌ఎ వైరస్‌ టెస్టింగ్‌ - రెస్పిరేటరీ పిసిఆర్‌ టెస్టు ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఇది కొత్త వైరస్‌ కాబట్టి దీనికి యాంటి వైరల్‌ మందులేమీ లేవు. ఇది రాకుండా వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు వచ్చిన కరోనా వైరస్‌లన్నిటికీ లక్షణాలకు మాత్రమే చికిత్స చేయగలిగాం. దీనికీ అంతే. అయితే ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ మీద బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కూడా వస్తే మాత్రం యాంటి బయాటిక్స్‌ ఇస్తారు. వీటితో పాటు ఫ్లూయిడ్స్‌, ఆక్సిజన్‌, సపోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌తో ఎదుర్కోగలుగుతున్నారు. ఏది ఏమైనా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం, స్ట్రెస్‌ నుంచి బయటపడడం లాంటి ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు సీనియర్‌ పల్మనాలజిస్టు డాక్టర్‌ హరికిషన్‌. 


ఆయుర్వేదంలో అద్భుత చికిత్స


సహజంగా వ్యాధినిరోధక శక్తిని పెంచే ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ సారంగపాణి. ఉదాహరణకు గుడూచి (తిప్పతీగ) నుంచి తయారుచేసిన మందులు, కషాయం ఇందుకు బాగా పనిచేస్తాయంటున్నారు. చెంచాడు గుడూచి చూర్ణాన్ని నీటిలో మరిగించి, వడగట్టి, ఆ కషాయాన్ని ఉదయం, సాయంత్రం 50 మి.లీ. చొప్పున తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఇంట్లో సాంబ్రాణి, గుగ్గిలం లాంటి ఔషధ ద్రవ్యాలతో ధూపం వేసుకుంటే జలుబు, దగ్గు, బాక్టీరియ, వైరస్‌లేవీ దరిదాపుల్లోకి రావని చెప్తున్నారు. 


మనం ఏం చేయాలి?

కరోనా ముప్పు మనదేశంలోకి కూడా ప్రవేశించింది. మనం వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాయే కాదు.. ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు రాకుండా కూడా నివారించుకోవచ్చంటున్నారు నిపుణులు. 

కరోనా వైరస్‌ బారిన పడే అవకాశం తరచుగా ప్రయాణాలు చేసేవాళ్లలో ఎక్కువ. కరోనా ఉన్న ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లకు జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి. 

దగ్గినా, తుమ్మినా టిష్యూ లేదా కర్చీఫ్‌ అడ్డం పెట్టుకోవాలి. లేదా చేతిని క్రాస్‌గా పెట్టి మోచేతిని అడ్డం పెట్టుకోవాలి. 

షేక్‌ హ్యాండ్‌ బదులు రెండుచేతులు జోడించి నమస్కరించడం మేలు.  

బయటికి వెళ్లి వచ్చినప్పుడల్లా, తినేముందు, వంట చేసేముందు.. హ్యాండ్‌వాష్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలి.  కళ్లు, ముక్కు, నోటిలో చేయి పెట్టొద్దు.  

ఎక్కువమంది గుమిగూడి ఉన్నచోటికి వెళ్లకపోవడం మంచిది. తప్పనిసరైతే మాస్కు ధరించాలి. చంటిపిల్లలు, వృద్ధులను గుంపులోకి తీసుకెళ్లొద్దు. 

వూహాన్‌లో ఇది పాము మాంసం నుండి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఏ జంతువుల నుంచైనా వచ్చే అవకాశం ఉందనీ చెప్తున్నారు. అందుకే మాంసం, కోడిగుడ్లు బాగా ఉడికించి తినాలి. 

హెల్త్‌ డెస్క్‌


logo