శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Health - Jan 27, 2020 , 23:38:56

ఈ సీజన్‌లో..జబ్బులుంటే జర భద్రం!

ఈ సీజన్‌లో..జబ్బులుంటే జర భద్రం!

పొద్దున, రాత్రి సమయాల్లో చలి..., మధ్యాహ్నం ఎండ.. పేరుకు చలికాలమే అయినా ప్రస్తుతం ఇది ఏ కాలమో తెలియకుండా ఉంది. చల్లదనం మాత్రమే కాదు... ఇలా ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా శరీర ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. చలికాలంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలే కనిపిస్తాయనుకుంటాం. ఆస్తమానో, సీవోపీడీనో లాంటి ఊపిరితిత్తుల జబ్బులున్నవాళ్లు జాగ్రత్తపడాలనుకుంటాం. కానీ గుండె జబ్బులున్నవాళ్లు, కీళ్లనొప్పులున్నవాళ్లు కూడా ఈ సీజన్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలం చల్లదనం వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణంగా చూస్తుంటాం. తేమతో కూడిన ఈ వాతావరణంలో వైరస్‌లు ఎక్కువగా వ్యాపిస్తాయి. అందుకే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్‌, దగ్గు లాంటివైతే రానివ్యక్తే ఉండరు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లనే చలి భయపెడుతుంటుంది. అందుకే జబ్బులున్నవాళ్లు చలికాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆస్తమా సమస్య ఉన్న పిల్లలకు అసలు చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. చలిలో ఆరుబయట ఆడుకోవడానికి పంపించొద్దు. తేమ వాతావరణం సమస్యను మరింత జటిలం చేస్తుంది. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ) ఉన్నవాళ్లు కూడా అంతే. సిగరెట్లు తాగడం మానేయాలి. పొగాకు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. సీజన్‌ ఏదైనా ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు వ్యాపించకుండా ఉండడానికి బయటికి వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్క్‌ వేసుకోవాలి. శరీరానికి పడని వాటికి ఎక్స్‌పోజ్‌ కావొద్దు. జలుబు, దగ్గు వారమైనా తగ్గకపోతే వెంటనే పల్మనాలజిస్టును కలవాలి. 


కీళ్లు జాగ్రత్త!


చలికాలంలో ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లకు మరింత నరకంగా ఉంటుంది. కీళ్లనొప్పులు మరింత ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చలికాలంలో మెదడు థ్రెష్‌హోల్డ్‌ తక్కువగా ఉంటుంది. అందుకే ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నవాళ్లు చలికి ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. అలాగని వాకింగ్‌ చేయడం మానొద్దు. వ్యాయామం అసలే మానొద్దు. చలికాలంలో వ్యాయామం మరింత ముఖ్యం. ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల కండరాలు బలంగా అవుతాయి. రక్తప్రసరణ సజావుగా జరిగి నొప్పులు కుదుటపడుతాయి. వ్యాయామం చేయకుండా, కదలకుండా కూర్చుంటే నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అందువల్ల కనీసం వాకింగ్‌ అయినా చేయాలి. అయితే ఉదయాన్నే తెల్లవారుజామున చలిలో వాకింగ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. వాకింగ్‌ వెళ్లేటప్పుడు గానీ, చలిగా ఉన్నప్పుడు బయటికి వెళ్లాల్సి వచ్చినా గానీ నాణ్యమైన సాక్స్‌, బూట్లు వేసుకోవాలి. నీ క్యాప్స్‌ ధరించడం మంచిది. స్వెటర్‌, తలకు మఫ్లర్‌ తప్పనిసరి అంటున్నారు ఆర్థోపెడిక్‌ వైద్యులు. 


చలి (గుండె) పోటు!


చలికాలంలో గుండెపోట్లతో చనిపోయేవాళ్లను సాధారణంగా ఎక్కువగా చూస్తుంటాం. అవును. చలికాలం గుండెను కూడా చిక్కుల్లో పడేస్తుంది. చలికాలం గుండె పైన రెండు రకాలుగా ప్రభావం చూపిస్తుంది. చలి ప్రభావం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చల్లదనం వల్ల స్పాజ్మ్‌ ఏర్పడుతుంది. దాంతో రక్తప్రసారం సరిగా జరుగక గుండెపోటు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక రెండో రకం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు. చలికాలంలో ఆస్తమా సమస్య పెరుగుతుంది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవి గుండెపోటుకు దారితీసేందుకు అవకాశాలుంటాయి. రక్తనాళాల్లో ఏర్పడిన చిన్న చిన్న ప్లేక్స్‌ వల్ల అప్పటివరకూ ఇంకా ప్రమాదం రాకపోయినప్పటికీ చలి, ఇన్‌ఫెక్షన్ల వల్ల రక్తనాళాల్లోని ఈ ప్లేక్స్‌ చిట్లిపోవచ్చు. దాంతో రక్తప్రసారానికి అంతరాయం కలిగి గుండెపోటు వస్తుంది. 


తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్న చోట అతి చల్లదనంతో ఉండే మంచు ప్రాంతాలు, ఎక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాల్లోకి చలికాలంలో వెళ్లడం వల్ల గుండెజబ్బుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి వాతావరణాల ప్రభావం వల్ల వచ్చే గుండె సమస్యను టకాసుబో కార్డియోమయోపతీ అంటారు. అసాధారణమైన వాతావరణం కలుగజేసే ఒత్తిడి వల్ల పంపింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. తీవ్రమైన చల్లదనం వల్ల గుండె మీద స్ట్రెస్‌ పడుతుంది. దీనివల్ల రక్తనాళాల్లో సమస్యలు మాత్రమే కాదు హార్ట్‌ ఫెయిల్యూర్‌ కూడా కావొచ్చు. 


గుండెజబ్బు ఉంటే..?

ఒకసారి గుండెపోటుకు గురైనవాళ్లు, గుండె బలహీనంగా ఉన్నవాళ్లు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. గుండె పంపింగ్‌ సామర్థ్యం 40-50 శాతం ఉంటే మామూలు ఉష్ణోగ్రతల్లో సమస్య ఉండకపోవచ్చు. కానీ చలికాలంలో ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. బార్డర్‌లైన్‌లో ఉన్న వ్యాధి కూడా ఇలాంటి అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా రక్తనాళాల్లో ఏర్పడిన ప్లేక్స్‌ వల్ల 70 శాతం బ్లాక్‌ ఉంటేనే వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. కాని చలికాలంల చిన్న ప్లేక్‌ ఉన్నా గుండెపై లోడ్‌ ఎక్కువ అవుతుంది. దాంతో చిన్న ప్లేక్‌ కూడా పెద్ద అడ్డంకైపోతుంది. ఇస్కీమియా వల్ల గుండెవేగం పెరుగుతుంది. జ్వరం, ఇన్‌ఫెక్షన్‌ వల్ల గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. బార్డర్‌లైన్‌ డిసీజ్‌ ఎక్కువ అవుతుంది. హార్ట్‌ ఫెయిల్యూర్‌, అక్యూట్‌ ఎల్‌విఎఫ్‌, ఇస్కీమిక్‌ ఎల్‌విఎఫ్‌ సమస్యలు వచ్చే అవకాశం ఈ సీజన్‌లో ఎక్కువ.


జాగ్రత్తలు

సాధారణంగా చలి వల్ల తొందరగా లేవరు. దాంతో మందులు వేసుకోవడం మిస్‌ కావొచ్చు. కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండాలి. మందులు మిస్‌ చేయొద్దు. మిస్‌ కావడం వల్ల ప్రభావం ఎక్కువ అవుతుంది. 

చలికి ఎక్కువగా ప్రభావితం కాకుండా చూసుకోవాలి. తీవ్రమైన చలిలో వాకింగ్‌కి కూడా వెళ్లొద్దు. కొంచెం ఎండ వచ్చాక వెళ్లాలి. 

ఏ వయసువాళ్లయినా, ఆయాసం, దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా దాని ప్రభావం గుండెకు కూడా వెళ్లిందా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. 

బోర్డర్‌లైన్‌ డిసీజ్‌ ఉన్నవాళ్లు మంచి ఆహారపు అలవాట్లను వదలొద్దు. శరీరానికి పడనివి తీసుకోవద్దు. 

బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు, యోగా, ఇండోర్‌ సైక్లింగ్‌ చేయాలి. 

ఏదైనా గుండెకు సంబంధించిన ప్రొసిజర్‌ చేయించుకుని ఉంటే రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లాలి.

ఎక్కువ ఆయాసం రావడం, నడిస్తే పెరుగుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ముఖ్యంగా ఆడవాళ్లు, డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో నొప్పి లేకుండా కేవలం ఆయాసం మాత్రమే రావొచ్చు. దీన్ని ఏంజైనల్‌ ఈక్వివలెంట్‌ అంటారు. 


ఆయాసం, నొప్పిని అశ్రద్ధ చేయకుండా ఊపిరితిత్తులకి సంబంధించిందో, ఆస్తమా అనో అనుకోకుండా హృద్రోగ నిపుణుని సంప్రదించి గుండె పరీక్షలు కూడా చేయించుకుంటే మంచిది. 

గుండెలో సమస్యలను తెలుసుకోవడానికి సాధారణంగా ఇసిజి, ఎకో, ట్రోపోనిన్‌ బ్లడ్‌ టెస్ట్‌లతో పాటు బ్రెయిన్‌ నాట్రియురెటిక్‌ పప్టైడ్‌ (బిఎన్‌పి) టెస్ట్‌ చేస్తారు. ఈ టెస్టులో పప్టైడ్‌ పెరిగితే గుండె సమస్య ఉన్నదని నిర్ధారణ అవుతుంది. పప్టైడ్‌ పెరగకపోతే ఊపిరితిత్తుల సమస్య ఉందని అర్థం. ఈ టెస్టు చేయించుకుంటే ఫలితాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. 


డాక్టర్‌ 

ఎ. శ్రీనివాస్‌ కుమార్‌

సీనియర్‌ కన్సల్టెంట్‌ 

కార్డియాలజిస్ట్‌

డైరెక్టర్‌, కార్డియాలజీ 

అండ్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ 

అపోలో హాస్పిటల్స్‌

హైదరాబాద్‌


చర్మం.. ఇలా రక్షించుకోండి