ఆదివారం 29 మార్చి 2020
Health - Jan 27, 2020 , 23:26:02

స్థూలకాయంతో ఆస్తమా..!

స్థూలకాయంతో ఆస్తమా..!

అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవాళ్లకు ఆస్తమా వచ్చే రిస్కు ఎక్కువగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. శరీర బరువు ఎక్కువగా ఉండడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, గుండెజబ్బుల వంటివి వచ్చే అవకాశముందని మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ జబ్బుల వరుసలో ఆస్తమా కూడా చేరింది.

అధిక బరువు, స్థూలకాయం ఉన్నవాళ్లలో కొవ్వు చర్మం కింద అడిపోస్‌ కణజాలంలో మాత్రమే పేరుకుపోతుందని అనుకుంటున్నాం. రక్తనాళాల్లో కూడా చేరి రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తాయని కూడా మనకు తెలుసు. అయితే ఈ కొవ్వు డిపాజిట్లు ఊపిరితిత్తుల శ్వాస మార్గాల గోడల్లో కూడా చేరుతాయని కొత్త పరిశోధనలో తేలింది. ఈ కొవ్వు శ్వాసమార్గాల నిర్మాణంలో కూడా మార్పు తీసుకువస్తుందంటున్నారు పరిశోధకులు. ఇలా కొవ్వు చేరడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమై పిల్లికూతలు, ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ అధ్యయనం యూరోపియన్‌ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురితమైంది. చనిపోయిన వాళ్లలో 52 మంది ఊపిరితిత్తులను ఈ అధ్యయనంలో పరిశీలించారు. వీరిలో 16 మంది ఆస్తమాతో చనిపోగా 21 మందికి ఆస్తమా ఉన్నప్పటికీ ఇతర కారణాల వల్ల మరణించారు. ఇకపోతే 15 మందికి ఆస్తమా లేదు. అంటే ఆస్తమా రిస్కు ఎక్కువగా ఉన్నట్టే. 

సైంటిస్టులు 1372 శ్వాస మార్గాల నిర్మాణాలను, ఊపిరితిత్తుల కణజాలాన్ని పరిశీలించి, వాటిలోని కొవ్వు కణజాలాన్ని బాడీ మాస్‌ ఇండెక్స్‌తో పోల్చి చూశారు. ఇందులో బిఎంఐతో పాటుగా కొవ్వు కణజాలం కూడా పెరుగుతున్నట్టు గమనించారు. అంతేకాకుండా ఈ కొవ్వు శ్వాసమార్గాల నిర్మాణాన్ని కూడా మార్పు చెందించి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతున్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది. 

శ్వాసమార్గాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గాలి వెళ్లడానికి తగినంత చోటు ఉండదు. దాంతో గాలి ఊపిరితిత్తులకు వెళ్లడానికి గానీ, అక్కడి నుంచి రావడానికి గానీ ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల ఆస్తమా లక్షణాలు వచ్చే అవకాశం ఉంటున్నట్టు చెప్తున్నారు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పీటర్‌ నోబెల్‌. అధిక బరువు, స్థూలకాయంతో పాటు అప్పటికే ఆస్తమా ఉన్నవాళ్లలో సమస్య మరింత తీవ్రంగా మారేందుకు ఆస్కారం ఉంటుందంటున్నారాయన. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలని చెప్తున్నారు. తగినంత శారీరక వ్యాయామం చేస్తూ, ఫాస్ట్‌ఫుడ్‌ జోలికి పోకుండా మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. 


logo