మంగళవారం 31 మార్చి 2020
Health - Jan 21, 2020 , 01:11:56

అసిడిటీ కాదు.. డిప్రెషన్‌!

అసిడిటీ కాదు.. డిప్రెషన్‌!

డిప్రెషన్, యాంగ్జయిటీ వల్ల శారీరక సమస్యలను ఎదుర్కొనేవాళ్లు మహిళలే ఎక్కువగా ఉంటారు. సైకోసొమాటిక్ సమస్యలు మహిళల్లో మూడు వంతులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మహిళల్లోని లైంగిక హార్మోన్లు డిప్రెషన్, యాంగ్జయిటీలను పెంచేవిగా ఉంటాయి. అందుకే నెలసరికి ముందు కొన్ని రోజుల పాటు ఈ హార్మోన్లలో తేడా వల్లనే 90 శాతం మహిళ లుప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటారు. దీని వల్ల మనసు చికాగ్గా ఉండడం, చిన్న విషయానికే కోపం రావడం, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కడుపులో మంట, గ్యాస్‌.. నొప్పి లేదా వాంతులు, విరేచనాలు.. లేకుంటే తలనొప్పి, ఒళ్లునొప్పులు.., లేదా ఛాతిలో నొప్పి.. కొన్నిసార్లు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో ఎన్ని పరీక్షలు చేసిన నార్మల్‌గానే ఉంటుంది. ఏ అల్సరో అనుకుని మందులిచ్చినా తగ్గదు. కొన్నిసార్లు తాత్కాలికంగా లక్షణాలు తగ్గినా మళ్లీ మళ్లీ అవే సమస్యలు. శారీరకంగా జబ్బు చేయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయనుకుంటే కొన్నిసార్లు పొరపాటవుతుంది. ఎందుకంటే వాళ్లకు శారీరకంగా ఎటువంటి జబ్బూ కనిపించదు మరి. ఇలాంటి జబ్బులకు మూలం మెదడులో.. దానిలోని ఆలోచనల ఒత్తిడిలో ఉంటుంది. మానసికమైన ఒత్తిడి, డిప్రెషన్‌, యాంగ్జయిటీ లాంటివి చాలా సందర్భాల్లో శారీరక జబ్బులుగా వ్యక్తమవుతుంటాయి. వీటినే సైకోసొమాటిక్‌ వ్యాధులుగా పరిగణిస్తారు. 


శరీరంలో రోగం.. మెదడులో మూలం

మనసులో తీవ్రమైన బాధ ఉన్నప్పుడు శరీరం అంతా కుంగిపోయినట్టు, బలహీనమైనట్టుగా అనిపిస్తుంది. ఒళ్లంతా నొప్పిగా ఉంటుంది. తలనొప్పి, కడుపుబ్బరం, ఏమీ తినాలనిపించకపోవడం.. లాంటి ఇబ్బందులను సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. దీనికి కారణం శరీరంలో ఏదో అనారోగ్యం ఉండడం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన శరీరం చేసే ఏ పనైనా మెదడు కంట్రోల్‌లో ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. నిజమే. మెదడు శరీర స్థితిగతులను కంట్రోల్‌ చేయడమే కాకుండా శరీర ప్రక్రియలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మెదడులో ఏ అలజడి కలిగినా అది శారీరక సమస్యలకు దారితీస్తుంది. మనసులో కలిగే బాధ, ఆవేదన, ఒంటరితనం లాంటి భావోద్వేగాలకు కేంద్రాలు మెదడులోనే ఉంటాయి. అందుకే మానసికంగా కుంగిపోయినప్పుడు ఆ మానసిక సమస్యే శారీరక రుగ్మతగా వ్యక్తమవుతుంది. వైద్యపరిభాషలో ఈ సమస్యలనే సైకోసొమాటిక్‌ డిజార్డర్లుగా పరిగణిస్తారు. ఇలా ముందుగా ప్రభావితం అయ్యేది జీర్ణవ్యవస్థే. అందుకే మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థకు సంబంధించిన పలు ఇబ్బందులు తలెత్తుతాయి. గుండెకు సంబంధించని ఛాతినొప్పి, తలనొప్పులు, ఒళ్లునొప్పులు కూడా ఈ కోవలోకే వస్తాయి. వీటిలో 60 నుంచి 70 శాతం కన్నా ఎక్కువ వాటికి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లే కారణంగా ఉంటాయి. ఐబిఎస్‌ లేదా ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్

దీన్నే ఇరిటబుల్‌ బొవెల్‌ డిసీజ్‌ అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు డయేరియా ఉంటుంది. కనీసం నాలుగైదుసార్లు అయినా విరేచనాలవుతాయి. టాయిలెట్లు అందుబాటులో ఉంటాయో లేదోనని బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. కొందరిలో విరేచనాలకు బదులు మలబద్దకం కూడా ఉండొచ్చు. సాధారణంగా రోజుకు ఒకసారి విరేచనానికి వెళ్తారు. కాని వీళ్లకు మూడు నాలుగు రోజులకు ఒకసారి విరేచనం అవుతుంది. ఎన్ని పరీక్షలు చేయించినా అన్నీ నార్మల్‌ అనే వస్తాయి. జీర్ణవ్యవస్థలో ఎక్కడా కూడా ఏ సమస్యా కనిపించదు. అన్నీ ఆరోగ్యంగానే ఉంటాయి. ఇలా కారణం తెలియకపోతే దానివెనుక మానసిక ఒత్తిడి కారణంగా ఉండొచ్చని భావించాలి. మానసిక ఒత్తిడి వలన చదువుకునే పిల్లల్లో, గృహిణుల్లో, పనిఒత్తిడి ఎదుర్కొనేవాళ్లలో ఇలాంటి సమస్య కనిపిస్తుందని అధ్యయనాలున్నాయి. ఈ సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి.  


యాసిడ్‌ పెప్టిక్‌ డిసీజ్‌

ఈ సమస్య ఉన్నప్పుడు ఛాతి నొప్పి, కడుపుబ్బరం, గ్యాస్‌, అజీర్తి, డయేరియా లాంటి సమస్యలు కనిపిస్తాయి. ఎండోస్కోపీ చేస్తే ఏ సమస్యా ఉండదు. అంతా నార్మల్‌గా ఉంటుంది. సాధారణంగా జీర్ణవ్యవస్థలో సమస్యలకు ఇన్‌ఫెక్షన్లు, లేదా కణితులు కారణమవుతాయి. హెలికోబాక్టర్‌ పైలోరి బాక్టీరియా ఇన్ఫెక్షన్‌ సాధారణంగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలేవీ లేకుండా ఈ లక్షణాలుంటే మానసిక సమస్య అని భావించాలి. హెచ్‌.పైలోరి ఇన్‌ఫెక్షన్‌ అయితే మూడు వారాల చికిత్సతో సమస్య పోతుంది. అయినా తగ్గకపోతే అది కచ్చితంగా మానసిక సమస్యే అని గుర్తించాలి. యాంగ్జయిటీ డిజార్డర్‌ దీర్ఘకాలంగా ఉందని దీని అర్థం. మానసికమైన చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. 

అల్సరేటివ్‌ కోలైటిస్‌

మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో ఒక్కో భాగం ప్రభావితం అవుతుంది. దీని ప్రభావం ఏ వ్యవస్థ మీద ఉంటే దానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. డిప్రెషన్‌ ఒక ఇన్‌ఫ్లమేటరీ సమస్య అని అధ్యయనాల్లో గుర్తించారు. ఏ భాగం ఇన్‌ఫ్లమేషన్‌కి గురైతే అక్కడ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి కారణంగా పెద్దపేగు, చిన్నపేగు, జీర్ణాశయం, డుయోడినమ్‌.. ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్‌కు గురవ్వొచ్చు. స్ట్రెస్‌ వల్ల యాసిడ్‌ ఎక్కువగా విడుదలయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికమైతే చిన్నపేగులో సెరొటినిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. సాధారణంగా సెరొటినిన్‌లు చిన్నపేగు కదలికలకు  అవసరం. అవసరానికి మించి ఇది ఉత్పత్తి అయితే సమస్య అవుతుంది. అల్సర్‌ ఏర్పడొచ్చు. స్ట్రెస్‌ వల్ల కోలన్‌లో ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చి కోలైటిస్‌కి దారితీస్తుంది. అల్సరేటివ్‌ కోలైటిస్‌ ఉన్నప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, విరేచాల్లో రక్తం పడడం, మలంలో రక్తం నలుపు లేదా ఎరుపు రంగులో వస్తుంది.  ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల అల్సర్లు ఏర్పడుతాయి. బరువు తగ్గుతారు. ఆకలి ఉండదు. స్ట్రెస్‌తో పాటు నిద్రలేమి, ఆందోళన ఉంటాయి. ఈ సమస్యకు 70 శాతం కేసుల్లో డిప్రెషన్‌, యాంగ్జయిటీయే కారణం. ఇలాంటప్పుడు టెస్టుల్లో కారణం ఏదీ కనిపించదు. ఇది సాధారణ అల్సరేటివ్‌ కోలైటిస్‌ అనుకుని సాధారణంగా లక్షణాలకు మాత్రమే చికిత్స ఇస్తుంటారు. మానసిక సమస్య వల్ల వచ్చిన జబ్బు కాబట్టి ఆ మందులు వేసుకుంటే తగ్గుతూ మళ్లీ వస్తుంటాయి. ఇలాంటప్పుడు మానసికమైన చికిత్స ఇస్తే తగ్గుతాయి. 6 నెలలు మందులు వాడినా తగ్గకపోతే మానిసిక వైద్యనిపుణులను కలవాలి. 


సైకోజెనిక్‌ వామిటింగ్‌

వాంతులకు కూడా చాలా సందర్భాల్లో ఒత్తిడి కారణం కావొచ్చు. సాధారణంగా ప్రెగ్నెన్సీలో కనిపించే వాంతులు మానసికమైన సమస్య వల్ల వచ్చేవే. 10 శాతం మందికి ఇలా వస్తాయి. సాధారణంగా ప్రెగ్నెన్సీలో హార్మోన్ల వల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌, యాంగ్జయిటీ లాంటివి ఉంటాయి. కాబట్టి వాంతులు కనిపిస్తాయి. అయితే గర్భవతులకే కాదు.. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, చనిపోయినా, పరీక్షల భయం ఉన్నా ఇలాంటి సమస్య రావొచ్చు. ఎండోస్కోపీలో అంతా నార్మల్‌ ఉంటుంది. వాంతులకు ఎలాంటి కారణమూ కనిపించదు. ఇలాంటప్పుడు ఈ వాంతులకు కారణం మానసిక ఒత్తిడి అయి ఉంటుంది. కుటుంబ ఒత్తిడి, ఎమోషనల్‌ బాండింగ్‌ విచ్ఛిన్నం కావడం,  డిప్రెషన్‌, యాంగ్జయిటీ ఇందుకు కారణమవుతాయి. 


గుండెపోట్ల వెనుక..

అతిగా స్పందిస్తే మళ్లీ గుండెపోటు రావొచ్చు.. అంటూ సినిమాల్లో డాక్టర్లు చెప్పడం చూస్తుంటాం. ఇది కొంతవరకు నిజమే. అధికమైన ఒత్తిడి గుండె మీద ప్రభావం చూపిస్తుంది. 9 నెలల పాటు దీర్ఘకాలిక ఒత్తిడి ఉంటే.. అంటే.. ఇంట్లో సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి, అనుబంధాలు విచ్ఛిన్నం కావడం.. ఇలా ఏదైనా ఒత్తిడి ఉంటే మూడు నాలుగు వంతులు ఎక్కువగా గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా స్ట్రెస్‌లోనే చాలావరకు గుండెపోట్లు వస్తుంటాయి. ఒకటి వెనుక ఒకటి సమస్యలు వస్తూ దీర్ఘకాలంగా ఒత్తిడి ఉంటే సడెన్‌ కార్డియాక్‌ డెత్‌ కూడా అవ్వొచ్చు. గుండెపోట్లకు సాధారణంగా పొగతాగడం, కొలెస్ట్రాల్‌ పెరగడం, ఆల్కహాల్‌, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం కారణాలైతే అన్నింటికన్నా ప్రధాన కారణం స్ట్రెస్‌. ఈ కారణాలన్నీ ఉంటే 9 వంతులు ఎక్కువ రిస్క్‌ ఉంటుంది. మూడు కారణాలైనా ఉంటే 6 వంతులు ఎక్కువ రిస్క్‌ ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది స్ట్రెస్‌. అయితే వీటన్నింటినీ అధిగమించవచ్చు. ఇకపోతే గుండెతో సంబంధం లేని ఛాతినొప్పికి కూడా మానసిక ఒత్తిడి కారణమవుతుంది. కొన్నిసార్లు బీపీ పెరగడం వెనుక కూడా స్ట్రెస్‌ ఉంటుంది. 

 నొప్పులూ అంతే..!

తలనొప్పి : కారణం లేకుండా తలనొప్పి వేధిస్తుంటే అది సైకోసొమాటిక్‌ కావొచ్చు. ఇలాంటప్పుడు ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలలో నార్మల్‌ ఉంటుంది. సాధారణంగా కంటి సమస్యలున్నా, దృష్టిలోపాలున్నా, సైనస్‌ సమస్య ఉన్నా తలనొప్పి ఉంటుంది. ఇవేవీ లేవని తేలిన తరువాత కూడా తలనొప్పి ఉంటే మానసికమైందని అర్థం. మైగ్రేన్‌ తలనొప్పి కూడా స్ట్రెస్‌ వల్లనే ఎక్కువ అవుతుంది. ఈ తలనొప్పులకు 50 నుంచి 60 శాతం వరకు యాంగ్జయిటీ, డిప్రెషన్‌లే కారణం. 

నడుంనొప్పి : నడుము నొప్పి ఆడవాళ్లలో సర్వసాధారణం. అకారణంగా నొప్పి వస్తుంటుంది. ఎంఆర్‌ఐ నార్మల్‌ ఉంటుంది. దీర్ఘకాలం వేధిస్తుంటుంది. సిగ్నిఫికెంట్‌ డిస్క్‌ ప్రాబ్లం ఏమీ ఉండదు. మందులతో కూడా కంట్రోల్‌ కాదు. ఇలాంటప్పుడు మానసిక సమస్యలే కారణమని భావించాలి. 

మల్టిపుల్‌ సొమాటిక్‌ పెయిన్స్‌ : అకారణంగా ఒళ్లునొప్పులు వేధిస్తుంటే కూడా సైకోసొమాటిక్‌ కావొచ్చు. 

క్రానిక్‌ ఆస్తమా : ఉబ్బస వ్యాధికి అలర్జీ కారణమని మనకు తెలుసు. అయితే మానసిక ఒత్తిడి కూడా ఈ సమస్యను ఉత్పన్నం చేస్తుందని అధ్యయనాలున్నాయి. 


చికిత్స

శారీరక సమస్యకు మూలం మనసులో ఉందని తెలిసినప్పుడు మొట్టమొదటగా చేసే చికిత్స ఆత్మీయత పంచడం. గతంలో ఫ్యామిలీ డాక్టర్‌ ఉన్నప్పుడు శారీరక వైద్యంతో పాటుగా, మానసికమైన కౌన్సెలింగ్‌ రూపంలో ఆత్మీయత, ఓదార్పును అందించేవాళ్లు. మానసిక సమస్య కారణమా కాదా అని, ఆ మానసిక సమస్యకు కారణాలేంటని తెలుసుకోవడం కోసం రకరకాల మానసిక పరీక్షలు చేస్తారు. వీటిద్వారా స్ట్రెస్‌ను గుర్తించి, వ్యక్తిత్వం తెలుసుకుంటారు. ఇందుకోసం పర్సనాలిటీ, ప్రోజెక్టివ్‌ టెస్టులు చేస్తారు. జాకబ్‌సన్స్‌ ప్రోగ్రెసివ్‌ రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ మానసిక చికిత్సల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా అన్ని కండరాలకు రిలాక్సేషన్‌ ఇస్తారు. రిలాక్సేషన్‌, సైకోథెరపీ, కౌన్సెలింగ్‌ 8 నుంచి 10 సెషన్లు ఇవ్వడం ద్వారా కూడా మనసులోని సమస్య, తద్వారా శారీరక సమస్యనుంచి బయటపడగలుగుతారు. అవసరాన్ని బట్టి యాంటి డిప్రెసెంట్స్‌, యాంటి యాంగ్జయిటీ మందులు ఇస్తారు. 

మన మెదడులో ట్రిలియన్‌ న్యూరాన్స్‌ ఉంటాయి. ఈ నాడీకణాల పనితీరు స్ట్రెస్‌ వల్ల ప్రభావితం అవుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వీటిలోని న్యూరో హార్మోన్‌ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. మెదడులోని ఏ కేంద్రంలో ఈ అసమతుల్యత ఏర్పడితే ఆ కేంద్రం కంట్రోల్‌ చేసే శరీర భాగం ప్రభావితం అవుతుంది. అక్కడ అనారోగ్యం కనిపిస్తుంది. ఆడ్లర్‌ అనే సైంటిస్టు 1935లో ఆర్గాన్‌ ఇన్‌ఫీరియార్టీ థియరీ కనుక్కున్నాడు. దీని ప్రకారం ఒక వ్యక్తికి ఒక అవయవం బలహీనంగా ఉంటుంది. అది స్ట్రెస్‌ వల్ల ప్రభావితం అవుతుంది. బ్రెయిన్‌లోని సిస్టమ్‌ ఎఫెక్ట్‌ అయితే అది ఆ బలహీనమైన భాగంపై ప్రభావం చూపి సైకోసొమాటిక్‌ డిజార్డర్‌కు దారితీస్తుంది. 

నివారించొచ్చు..!

సర్వ రోగాలకు శ్రీరామరక్ష జీవనశైలిలో చేసుకునే ఆరోగ్యకరమైన మార్పులే. పొట్టను అబ్యూజ్‌ చేయొద్దు. ఏది పడితే అది తినేయొద్దు. సరైన ఆహారాన్ని, సరైన మోతాదులో, సరైన సమయాల్లో తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు వయసు ప్రకారం తీసుకోవడం కూడా ముఖ్యమే. ఉదాహరణకు 20 ఏళ్ల వాళ్లు ఒక పూట తినడం, 70 ఏళ్ల వాళ్లు నాలుగు పూటలు తినడం కరెక్ట్‌ కాదు. టైం ప్రకారం తినడం, నిద్రపోవడం స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. అరగంట నుంచి 45 నిమిషాల పాటు ప్రతిరోజూ రెగ్యులర్‌ వాకింగ్‌, ఎక్సర్‌సైజ్‌ తప్పనిసరి. దుర్వ్యసనాలు వదిలేయాలి. 

మ్యూజిక్‌, ప్రేయర్‌ థెరపీలు అంటే మనసుకు ఇష్టమైన సంగీతం వినడం, దైవ ప్రార్థన వంటివి కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రాణాయామం సాధారణంగా ప్రతిరోజు రెండు సార్లు 20 నిమిషాల పాటు చేయాలి. స్ట్రెస్‌ ఉంటే మూడుసార్లు చేయాలి. శవాసనం మంచి యోగాసనం. ఇతర యోగాసనాలు కూడా చేయాలి. ఇవి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌గా ఉపయోగపడుతాయి. అన్నింటికీ మించిన ఔషధం అనుబంధాలను మెరుగుపరుచుకోవడం. కష్టసుఖాలను పంచుకునే వ్యక్తి, వినే వ్యక్తి ఒక్కరైనా ఉండాలి. ప్రేమనందిస్తూ, ప్రేమను పొందాలి. సునంద తరచుగా విరేచనాలు కావడం లేకుంటే మలబద్దకం అన్నట్టుగా బాధపడుతుండేది. గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల చుట్టూ తిరిగారు. ఆమెకు ఇరిటబుల్‌ బొవెల్‌ డిసీజ్‌, అల్సరేటివ్‌ కోలైటిస్‌ సమస్యలున్నట్టు గుర్తించారు. వాటికి చికిత్స ప్రారంభించారు. ఆ మందులు వాడుతున్నది కానీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఎన్నాళ్లు గడిచినా ఆమె సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది. చివరికి అనుభవజ్ఞుడైన ఓ డాక్టర్‌ సలహా మేరకు మానసిక వైద్య నిపుణులను కలిసింది. ఆమె సమస్యకు  మూలం కనుక్కునే ప్రయత్నంలో రకరకాల మానసిక పరీక్షలు, కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రశ్నలు వేసి అసలు విషయం తెలుసుకున్నారు. అప్పుడు తేలిన విషయం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఆమెకు శారీరకంగా ఎటువంటి అనారోగ్య పరిస్థితులూ లేవు. ఆమెకు ఉన్నది మానసిక సమస్య. మానసికమైన కుంగుబాటే ఈ శారీరక సమస్యగా పరిణమించి ఆందోళనకు గురిచేసింది. దీని వెనుక నేపథ్యం ఏంటంటే.. ఆమె కథ అచ్చం సినిమా కథే. 

రేలంగి, గిరిజ భార్యాభర్తలు. రేలంగి తల్లి సూర్యకాంతం. తన కొడుకూ, కూతురు కలిసి కాపురం చేస్తే కొడుక్కి ప్రాణగండం ఉందని ఓ కపట సన్యాసి చెప్పిన మాటలు విని వాళ్లిద్దరినీ కలవకుండా చేస్తుంది సూర్యకాంతం. గిరిజ భర్త దగ్గరికి వెళ్లినప్పుడల్లా ‘కడుపులో నొప్పి అమ్మాయ్‌!’ అని పిలుస్తుంది. లేదా ఏ మంచినీళ్లో తెచ్చివ్వమంటుంది. తన ఆరోగ్యం బాగులేదని తన దగ్గరే పడుకోమంటుంది. ఇలా ఏవేవో వంకలతో వాళ్లిద్దరినీ కలవనీయకుండా చేస్తుంది సూర్యకాంతం... ఇదంతా ఓ పాత సినిమా కథ.ఇక్కడ సునందది కూడా గిరిజ కథే. కాకపోతే సూర్యకాంతం కొడుక్కి ప్రమాదం జరుగుతుందేమోనని భయపడితే సునంద అత్తది అసూయ. ఆమెకు భర్త లేడు. తన కళ్ల ముందే కోడలు పచ్చగా కాపురం చేయడం చూడలేకపోయింది. అందుకే ఒక కొడుకు పుట్టగానే కొడుకు, కోడలు కలవకుండా చేసింది. అలా భార్యాభర్తలిద్దరూ కలిసి ఏడేళ్లు దాటింది. దాంతో ఒంటరితనంతో బాధపడుతూ క్రమంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది సునంద. ఆ దీర్ఘకాలిక కుంగుబాటే సైకోసొమాటిక్‌ సమస్యగా బయటపడింది. శారీరక సమస్యగా ఎన్ని మందులు వాడినా తగ్గని సునంద సమస్య మానసిక చికిత్సతో తగ్గిపోయింది. ఇప్పుడామెకు  ఐబిఎస్‌ మందులు, అల్సర్‌ మందులు అవసరం లేకుండా పోయాయి. 

-డాక్టర్‌ జి. ప్రసాద్‌ రావు

సీనియర్‌ సైకియాట్రిస్టు , ఆశా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo
>>>>>>