సోమవారం 06 ఏప్రిల్ 2020
Health - Jan 12, 2020 , 23:20:39

మనుషులు తినే ఆహారం శునకాలకు మంచిదేనా?

మనుషులు తినే ఆహారం శునకాలకు మంచిదేనా?

మనదేశంలో జంతుప్రేమికులు చాలామందే ఉన్నారు. వారు తినే ప్రతీ ఆహారాన్ని పెంపుడు జంతువులకు పెట్టి తృప్తి పడుతుంటారు. అలా కొన్ని పండ్లు తినడం వల్ల జంతువులు అనారోగ్యానికి గురైనట్లు తేలింది. అయితే అన్ని పండ్లు, కూరగాయలతో అలా జరుగదు. మనుషులు తినే ఆహారపదార్థాలలో ఏవేం తింటే కుక్కలకు మంచిదో తెలుసుకోండి.


పుచ్చకాయ : ఇది ఆరోగ్యకరమైన పండు. ఇందులో విటమిన్‌ ఎ, బి6, సి, పొటాషియంలాంటివి ఉన్నాయి. కేలరీలు, పోషకాలు తక్కువగా కలిగి ఉంటాయి. వేసవిలో కుక్కకు పుచ్చకాయను తినిపిస్తే వెచ్చని వాతావరణంలో కూడా చల్లబరుస్తుంది.

బ్లూబెర్రీ : వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇది మానవ ఆరోగ్యానికి అద్భుతమైన పండు. చిన్న కుక్కలకు బ్లూబెర్రీలను చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఇవ్వాలి.

ఆపిల్‌ : మనిషికి, కుక్కలకు రుచికరమైన పండు ఆపిల్‌. వీటిలో ఫైబర్‌, విటమిన్‌ ఎ, సి, ఒమెగా-3, ఒమెగా-6, యాంటీఆక్సిడెంట్‌, ప్లేవనాయిడ్‌, పాలీఫెనాల్‌ ఉన్నాయి. కానీ, కుక్క ఆపిల్‌ విత్తనాలు తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే విషపూరితంగా మారుతుంది. 

క్యారెట్‌ : కుక్కలకు క్యారెట్‌ అద్భుతమైన ఆహారం. క్యారెట్లను పచ్చిగా, వండినట్లుగా  ఎలాగైనా తినిపించవచ్చు. కానీ   కుక్క ఆహారంలో క్యారెట్‌ ఒక భాగం మాత్రమే.

బీన్స్‌ : వీటిలో చాలా పోషకాలున్నాయి. విటమిన్‌ ఎ, సి, కె, ఫోలిక్‌ ఆమ్లం, మెగ్నీషియం, క్యాల్షియం, చక్కెర, పొటాషియం లాంటివి ఉన్నాయి. కుక్కలకు బీన్స్‌ను ఉపయోగించే జంతుప్రేమికులు తక్కువగా ఉంటారు. వీటితోపాటు ఉప్పు, మసాలా జోడించవద్దు. వీటితోపాటు ఆకుకూరలు, గుమ్మడికాయ గింజలు, చికెన్‌ ముక్కలు, చికెన్‌ ఉడికించిన పులుసు, చేపలు. ఇవన్నీ మనిషి ఆహారంగా తీసుకుంటారు. వీటిని ఆహారంగా కుక్కలకు పెట్టవచ్చు. 

ఇవ్వకూడని ఆహారం : ఎండుద్రాక్ష, ద్రాక్ష ఇవ్వకూడదు. అదేవిధంగా ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అవకాడో, చక్కెర పదార్థాలు కలిగున్న ఆహారం వాటికి పెట్టకూడదు. 


logo