సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Jun 13, 2020 , 15:29:07

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలి

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలి

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్‌ను తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యనిపుణులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, అన్ని పోషకాలతోపాటు ప్రతిరోజూ జింక్‌ ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల మన ఇమ్యునిటీని పెంచుకోవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. జింక్‌ మన శరీరంలోని ౩౦౦ ఎంజైమ్స్‌ను క్రియాశీలకంగా ఉంచి, ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కణ విభజన, కణాభివృద్ధి, గాయాలను మానేలా చేస్తుంది. డీఎన్‌ఏ, ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. అలాగే, జింక్‌ సాధారణ శరీరాభివృద్ధికి కూడా తోడ్పడే అత్యావశ్యక పోషకం కూడా. అయితే, ప్రపంచంలో చాలామంది జింక్‌ లోపంతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంటోంది. మూడింట ఒకవంతు మంది కూడా జింక్‌ ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నది.

ప్రోటీన్‌లాగా, జింక్‌ను మన శరీరం నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉండదని, ప్రతిరోజూ ఆహారం ద్వారా జింక్‌ శరీరంలో చేరేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యూఎస్‌ఏ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రకారం 14 ఏళ్లపైబడిన పురుషులు 11 మిల్లీగ్రాంలు, అదే స్త్రీలైతే 8 మిల్లీగ్రాంల జింక్‌ తీసుకోవాలి. గర్భిణులు 11 మిల్లీగ్రాంలు, పాలిచ్చే తల్లులు 12 మిల్లీగ్రాంలు ఆహారం ద్వారా జింక్ తీసుకోవాల్సి ఉంటుంది. జంతుమాంసంలో జింక్‌ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 100 గ్రాంల మాంసంలో 4.8 మిల్లీగ్రాంల జింక్‌ ఉంటుంది. దీంతోపాటు మృదులాస్థి చేపలు, చికెన్‌, పప్పు ధాన్యాలు, జీడిపప్పు, ఓట్స్‌, పుట్టగొడుగులు, గుమ్మడి గింజలు, పాల పదార్థాలు, డార్క్‌ చాక్లెట్లను ఆహారంలో భాగంగా చేసుకుంటే జింక్‌లోపాన్ని అధిగమించవచ్చు. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచుకొని, ఆరోగ్యంగా ఉండవచ్చు. 
logo