కీటోడైట్ వ‌ల్ల క‌లిగే 10 డేంజ‌ర‌స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!


Sat,April 14, 2018 03:11 PM

నేటి తరుణంలో అధిక బరువును తగ్గించుకోవడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అందుకోసం కొందరు జిమ్‌లలో చెమటోడుస్తుంటే, కొందరు యోగా, ఇతర వ్యాయామాలు చేస్తున్నారు. ఇక మరికొందరు ప్రత్యేకమైన డైట్‌లతో బరువు తగ్గించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే డైట్‌ల విషయానికి వస్తే ఇటీవలి కాలంలో జనాలను అధికంగా ఆకర్షిస్తున్న డైట్.. కీటోడైట్.. ఈ డైట్‌ను పాటిస్తే బరువు వేగంగా తగ్గడంతోపాటు డయాబెటిస్, జీర్ణ సమస్యలు, ఇతర అనారోగ్యాలను తగ్గించుకోవచ్చని సాక్షాత్తూ కొందరు డాక్టర్లు కూడా చెబుతుండడంతో చాలా మంది కీటోడైట్‌ను ఫాలో అవుతున్నారు. పిండి పదార్థాలు చాలా తక్కువగా, ప్రోటీన్లు ఒక మోస్తరుగా, కొవ్వులు ఎక్కువగా తీసుకోవడమే కీటో డైట్. అయితే నిజానికి ఈ డైట్‌ను పాటించడం వల్ల మనకు లాభాలు కలిగే మాట నిజమే అయినప్పటికీ దీంతో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. మరి కీటో డైట్ వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఎముకలు


కీటో డైట్ వల్ల శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్‌లో ఉంటుందని తెలిసిందే. అంటే మన శరీరం శక్తికి పిండి పదార్థాలపై కాకుండా కొవ్వులపై ఆధారపడుతుంది. దీంతో రక్తంలో ఎక్కువగా కీటోన్లు ఉంటాయి. వాటి ద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే శరీరం కీటోసిస్‌లో ఉండడం వల్ల మనకు కాల్షియం, ఫైబర్ సరిగ్గా అందవు. ఫలితంగా వాటిల్లో ఉండే ఫైటోకెమికల్స్ అయిన ఫైటిక్ యాసిడ్, ఆగ్జలేట్స్, టానిన్స్ మనకు అందవు. దీంతో శరీరం కాల్షియంను గ్రహించదు. ఫలితంగా ఎముకలు బలహీనంగా, గుల్లగా మారుతాయి. దీంతో చిన్నపాటి దెబ్బ తాకినా ఎముకలు విరుగుతాయి.

2. కండరాలు


శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్‌లో ఉంటే మన శరీరం దానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు, మినరల్స్‌ను గ్రహించదు. దీంతో కండరాల పనితీరు మందగిస్తుంది. కార్బొహైడ్రేట్లు తక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం, కాల్షియం, సోడియంలు శరీరానికి సరిగ్గా లభించవు. దీంతో కండరాలు సరిగ్గా పనిచేయక బిగుసుకుపోయినట్టు అవుతాయి. దీంతో కండరాలు పట్టేస్తుంటాయి. విపరీతమైన నొప్పి కలుగుతుంది.

3. అలసట


శరీరం కీటోసిస్‌లో ఉండడం వల్ల విపరీతమైన అలసట ఉంటుంది. ఎప్పుడూ బాగా అలసిపోయినట్టు ఉంటారు. గ్లూకోజ్ అందకపోవడం వల్ల శరీరం ఇతర ప్రత్యామ్నాయాలపై ఎక్కువగా ఆధార పడాల్సి వస్తుంది. ఫలితంగా అలసట, నీరసం వస్తాయి. దీంతో నిత్యం వ్యాయామం చేయలేరు. శరీరానికి ముఖ్యంగా కావల్సిన లవణాలు, ద్రవాలను కోల్పోతారు.

4. రుతుక్రమం


కీటోడైట్ వల్ల కార్బొహైడ్రేట్లు తీసుకోవడం బాగా తగ్గుతుంది కనుక అధికంగా బరువు తగ్గుతారు. దీంతో శరీరంపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది మహిళల్లో రుతుక్రమాన్ని దెబ్బ తీస్తుంది. పీరియడ్స్ సరిగ్గా రాకుండా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొందరు మహిళలకు అస్సలు పీరియడ్స్ రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది.

5. కిడ్నీ స్టోన్లు


శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్‌లో ఉండడం వల్ల రక్తం పీహెచ్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. దీంతో రక్తం ఆమ్లతత్వాన్ని (అసిడిక్) కలిగి ఉంటుంది. ఫలితంగా కిడ్నీల్లోకి ఆ రక్తం ప్రవహించినప్పుడు అందులో ఉండే అసిడిక్ గుణం వల్ల కిడ్నీల్లో ఉండే వ్యర్థ పదార్థాలు క్రిస్టల్స్‌గా మారుతాయి. అంటే కిడ్నీ స్టోన్లు తయారవుతాయన్నమాట.

6. నోటి దుర్వాసన


శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్‌లో ఉండడం వల్ల నోటి దుర్వాసన ఎక్కువవుతుంది. ఎందుకంటే శరీరం పిండి పదార్థాలను కాకుండా కొవ్వులను కరిగిస్తూ శక్తి గ్రహిస్తుంది కనుక వాటిల్లో ఉండే కెమికల్స్ నోటి దుర్వాసనకు కారణమవుతాయి.

7. మలబద్దకం, ఆకలి


నిత్యం మనం తీసుకునే చాలా వరకు పిండిపదార్థాల్లో ఫైబర్ ఉంటుంది. అయితే కీటోడైట్ చేయడం వల్ల పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గుతుంది. దీంతో ఫైబర్ మనకు సరిగ్గా అందదు. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మలబద్దకం వస్తుంది. పేగుల్లో కదలిక సరిగ్గా ఉండదు. దీనికి తోడు శరీరానికి వేగంగా శక్తి అందదు కనుక ఎప్పుడూ ఆకలిగా ఉంటారు.

8. డీహైడ్రేషన్


కీటో డైట్ చేయడం వల్ల శరీరం ఎప్పుడూ కీటోసిస్‌లో ఉంటుంది. దీంతో శరీరంలో పెద్ద ఎత్తున కీటోన్లు ఉంటాయి. వాటిని శరీరం బయటకు పంపించాలి. ఈ క్రమంలో వాటిని బయటకు పంపేందుకు నీటిని బాగా తాగాలి. అలా తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు.

9. తలనొప్పి


కీటోడైట్‌లో పిండిపదార్ధాలు తక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి గ్లూకోజ్ సరిగ్గా అందక మెదడు ప్రత్యామ్నాయ శక్తి అయిన కీటోన్లపై ఆధారపడాల్సి వస్తుంటుంది. దీంతో మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తలనొప్పి, కంగారు, ఆతురత వస్తాయి. ఏ విషయంపై కూడా ఏకాగ్రత ఉండదు.

10. ప్లేట్‌లెట్లు


శరీరం కీటోసిస్‌లో ఉంటే రక్తంలో ఉండే ప్లేట్‌లెట్లు బాగా తగ్గుతాయి. అంతేకాక అవి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతుంటాయి.

3916

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles