చాక్లెట్… ఒకేసారి సంతోషం, బాధ కలిగించే వింత పదం. దాన్ని తినడం చాలామందికి ఇష్టమే. చాక్లెట్ తినడం వల్ల ఉత్పత్తి అయ్యే హార్మోన్లవల్ల సంతృప్తి లభిస్తుంది. ఆ సంతృప్తి కోసమే మళ్లీమళ్లీ చాక్లెట్ తినాలనిపిస్తుంది. సాంకేతికంగా చూస్తే ఇదో వ్యసనమే! మరోవైపు చాక్లెట్ తింటే బరువు పెరుగుతారని, లివర్ లాంటి అవయవాల మీద దుష్ప్రభావం ఉంటుందనీ వింటున్నాం. అయితే ఈమధ్య జరిగిన ఓ పరిశోధన ‘చాక్లెట్ ఎలా తిన్నామన్నది కాదు భయ్యా! ఎప్పుడు తిన్నామన్నదే ముఖ్యం’ అని పంచ్ విసురుతున్నది. రుతుక్రమం ఆగిపోయిన (మెనోపాజ్) కొందరు మహిళల మీద జరిగిన ఈ పరిశోధనలో… ఉదయం లేచిన తర్వాత ఓ గంటలోపు కనుక చాక్లెట్ తింటే, దానివల్ల చెడు జరగదని తేల్చారు. ఊబకాయం రావడం లేదు సరికదా, ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోవడాన్ని గమనించారు. అలాగని చాక్లెట్ తినమనీ ఈ పరిశోధన సిఫారసు చేయడం లేదు. మనం తినే ఆహారం, వేర్వేరు సమయాల్లో విభిన్నమైన ప్రభావాల్ని చూపుతుందని తెలుపడమే ఈ అధ్యయనం ఉద్దేశమని చెబుతున్నారు.