కొవిడ్ సోకినా, ఆ లక్షణాలు కనిపిస్తున్నా.. చాలామంది వైద్యుడు చెప్పినా, చెప్పకపోయినా అజిత్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. అసలు, వీటి ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నారు పరిశోధకులు. అందుకోసం, 263 మంది కొవిడ్ బాధితులను ఎంచుకున్నారు. వీరిలో కొంతమందికి అజిత్రోమైసిన్ ఇచ్చారు. మిగతావారితో మాత్రం, మందుల పేరుతో ఖాళీ గోళీలు మాత్రమే మింగించారు (ప్లాసిబో ఎఫెక్ట్!). మూడువారాలు గడిచేసరికి ఖాళీ గోళీలు తీసుకున్నవారిలో కొవిడ్ లక్షణాలేవీ మిగల్లేదు. కానీ, అజిత్రోమైసిన్ తీసుకున్నవారిలో కొందరు మాత్రం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. న్యుమోనియా నుంచి చర్మవ్యాధుల వరకు చాలా సమస్యలకు అజిత్రోమైసిన్ వాడుతూ ఉంటారు. కొవిడ్ వచ్చినప్పుడు దీన్ని తీసుకుంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందనీ, శరీరంలో వాపు (ఇన్ఫ్లమేషన్) రాదనీ ఓ నమ్మకం. ఇది తప్పని చెబుతున్నదీ పరిశోధన.