e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఆరోగ్యం వెళ్లగొడదోమ..!

వెళ్లగొడదోమ..!

  • సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త
  • విష జ్వరాలకు కాలం ఇదే..
  • నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం
  • పరిశుభ్రత, అప్రమత్తతే ప్రధానం
  • పల్లెప్రగతితో తగ్గనున్న వ్యాధులు
  • వనపర్తి జిల్లాలో 50 రాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు : డీఎంహెచ్‌వో చందూనాయక్‌

వర్షాకాలం వ్యాధులకు కేరాఫ్‌.. ఈ సీజన్‌ వచ్చిందంటే చాలు రోగాలను మోసుకొస్తుంది. చిన్నపాటి వర్షం పడినా చాలు.. నీటి నిల్వలో వివిధ రకాల వ్యాధులకు కారణమైన దోమలు వృద్ధి చెందుతాయి. ఇవి మనుషులకు కుట్టడంతో విషజ్వరాలు సోకుతాయి. దోమ ద్వారా దాదాపు 5 రకాల జ్వరాలు మనుషులను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయి. నిర్లక్ష్యం వహిస్తే ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. వీటిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉన్నది. అందుకే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

వనపర్తి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ :పల్లెప్రగతితో తగ్గే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో ఇప్పటికే గ్రామాలు స్వచ్ఛతగా.. సుందరంగా మారాయి. కార్యక్రమంలో భాగంగా విడుతల వారీగా రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేయడం.. చెత్త తొలగిస్తున్నారు. దీంతో పల్లెలు పరిశుభ్రంగా మారడంతో గతంతో పోల్చుకుంటే సీజనల్‌ వ్యాధులు తగ్గుతున్నాయి.

- Advertisement -

మలేరియా వ్యాధి
మలేరియా.. వర్షాకాలంలో వచ్చే జ్వరాల్లో అత్యంత ప్రమాదకరమైనది. ఇందుకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి ఆడ ఎనాఫిలిస్‌ దోమ నుంచి వ్యాపిస్తుంది. ఇవి మురుగు నీటి కాలువలు, చెరువులు, నీరు నిల్వ ఉన్న కుంటల్లో ఎక్కువగా పెరుగుతాయి. రాత్రిపూటే ఎక్కువగా కుడుతాయి. దోమ కుట్టినప్పుడు కొందరికి నొప్పి, దద్దులు కలగవచ్చు. దోమ కాటుతో శరీరంలోకి ప్రవేశించిన ప్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్తకణాలపై దాడి చేస్తుంది. ఇందులో ప్లాస్మోడియం వైవాక్స్‌, ప్లాస్మోడియం ఫాల్సిపేరం అనేవి రెండు రకాలు ప్లాస్మోడియం వైవాక్స్‌లో జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. కానీ రెండో రకం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నది. దీన్ని త్వరగా గుర్తించి చికిత్స అందించకపోతే కాలేయాన్ని, కిడ్నీలను, రక్తకణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై దాడి చేసి సెరిబ్రల్‌ మలేరియాకు దారి తీయొచ్చు. కొన్ని సార్లు రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీసి రక్త స్రావానికి కూడా కారణం అవుతుంది.

లక్షణాలు :
దోమ కుట్టిన 10-14 రోజుల్లో లక్షణాలు కన్పిస్తాయి.
రోజు విడిచి రోజు జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
చలి జ్వరంతోపాటు చెమటలు పడతాయి.
కొన్ని సార్లు వాంతులు కూడా అవుతాయి.
ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రక్త పరీక్షలు చేయించుకోవాలి.

మెదడు వాపు
ఇది పందుల నుంచి దోమ ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. పందుల్లో ఈ వైరస్‌ ఉన్న వాటికి ఏమీ కాదు. పందులను కుట్టిన దోమలు తిరిగి మనుషులను కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరం. ఎక్కువగా ఇండ్లల్లో ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం లేకపోలేదు.
లక్షణాలు :
తీవ్రమైన తలనొప్పి, మెదడు పొరలలో వాపు ఉంటుంది.
శరీరంలో వణుకు, ఏదైన ఒక భాగం చచ్చుబడిపోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది

చికున్‌ గున్యా
ఈడిన్‌ ఈజిప్ట్‌ దోమ ద్వారా చికున్‌గున్యా వస్తుంది. ఈ దోమ పగటి పూట ఎక్కువగా కుడుతుంది. గున్యా వైరస్‌ బారిన పడ్డవారిని కుట్టిన దోమ మరొకరిని కుట్టడం ద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకితే శరీరంలో ఉన్న కీళ్లు, ఎముకలు విపరీతమైన నొప్పులు ఉండి కనీసం నిలబడటానికి, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
లక్షణాలు :
తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
కొన్ని రోజులు మంచం దిగని పరిస్థితి ఏర్పడుతుంది. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టతరంగా మారుతుంది.
ఇది అంతా ప్రాణాంతక సమస్య కాదు. కానీ వయస్సు మీరినా కొద్ది దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి వృద్ధులను చాలా కాలం బాధిస్తుంది.
పిల్లల్లో, మధ్య వయసు వారిలో కీళ్ల నొప్పులు కొద్ది రోజుల్లో తగ్గిపోతాయి.

డెంగీ వ్యాధి
ఈడిన్‌ ఈజిప్ట్‌ దోమ కుట్టడం కారణంగా డెంగీ సోకుతున్నది. నల్లగా ఉండే ఈ దోమ ఒంటి మీద తెల్లని చారలు ఉంటాయి. దీని శరీరంలోకి డెంగీ వైరస్‌ ప్రవేశించిన 7 – 8 రోజుల తర్వాత దాని ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది కుట్టినప్పుడు నొప్పి ఉండదు. ఇది రాత్రి పూట కంటే పగటి పూట ఎక్కువగా కుడుతుంది. ఈ దోమ మంచినీటిలో వృద్ధి చెందుతుంది. మూతలు లేని నీళ్ల ట్యాంకులు, సిమెంట్‌, తారు రోడ్డుపై నిలిచే వర్షపు నీటిలో వాటి పడేసిన ప్లాస్టిక్‌ వస్తువుల్లో, ఇండ్లల్లో ఉండే పూల కుండీల్లో, కూలర్లు, పాత టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బోండాల్లో ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఉండేది. క్రమేపీ గ్రామాలకు, తండాలకు పాకింది.
లక్షణాలు :
దోమ కుట్టిన కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది.
కాళ్లు, ఒళ్లు కదిలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకల్లోనూ, కండరాలల్లోనూ భరించలేనినొప్పి శరీరంపై ఎర్రటి పొక్కులు (రాషెస్‌) వస్తాయి.
వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన, కడుపునొప్పి ఉంటాయి.
అధిక రక్తపోటుతోపాటు రక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని సార్లు ముఖ్య అవయవాలు వైఫల్యం చెంది మరణం సంభవించవచ్చు

ఫైలేరియా వ్యాధి
ఈ వ్యాధి ఆడ క్యూలెక్స్‌ దో మ ద్వారా ఉకరేరియా బ్రాంకాప్టీ అనే వైరస్‌ వల్ల వ్యాప్తిస్తుంది. ఇవి మురుగు నీరు, బురద ఎక్కువగా ఉన్న గుంతలు, సెప్టిక్‌ ట్యాంకుల్లో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. మంచినీటిలో కూడా పెరగొచ్చు.
లక్షణాలు :
లార్వా దశలోని ఫైలేరియా కారక వైరస్‌ మనుషుల రక్తంలోకి ప్రవేశించినప్పటికీ పైకి మామూలుగానే కనపడతారు. వివిధ దశల తరువాత ఇవి విశ్వరూపం చూపేడతాయి.
దోమలు కుట్టడం ద్వారా ఈ వైరస్‌ కారక వాహకాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.
కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ వైరస్‌ లింఫ్‌ నాళాల్లోకి వెళ్లి చనిపోతుంది. దీంతో ఆ నాళం మూసుకుపోయి అక్కడ వాపు(లింఫోడిమా) తలెత్తుతుంది.
ఇది కాళ్లకు, చేతులకు రావచ్చు. పురుషుల్లో వృషణాల్లో కూడా కనపడవచ్చు.
అరుదుగా ఇతర భాగాల్లో కూడా వస్తుంది. ఎక్కువ మందిలో కాళ్లల్లోనే కనపడి శరీర ఆకృతిని పూర్తిగా దెబ్బ తీస్తుంది.

నివారణ మార్గాలు
దోమల ద్వారా వ్యాప్తి చెందే అన్ని రకాల వ్యాధులకు నివారణ మార్గాలు ఒకే తీరుగా ఉంటాయి. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఏమాత్రం ఈ వ్యాధుల లక్షణాలు కనిపించినా తక్షణం దగ్గరలోని వైద్యులను సంప్రదించాలి.

దోమకాటు బారిన పడకుండా చూసుకోవడం అన్నింటి కన్నా ప్రధానం.
బయటకు వెళ్లేటప్పుడు కాళ్లను, చేతులను కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలి.
ఇంటి చుట్టు పక్కల దోమలు పెరగకుండా జాగ్రత్త పడాలి.
కూలర్లలో, పూల కుండీల్లో నీరు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
తాగి పడేసిన కొబ్బరి చిప్పలు, బోండాలను దూరంగా పడేయాలి.
పాత టైర్లు, కప్పులు, ఇతర పాత్రలు పరిసరాలకు దగ్గరలో ఉండకుండా చూడాలి.
ఇంటి కిటికీలకు, తలుపులకు దోమలు రాకుండా జాలి అమర్చుకోవాలి.
పడుకునేటప్పుడు దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి.
చిన్నపిల్లలు పడుకునేటప్పుడు దోమలు కుట్టకుండా పై పూత మందులు వాడుకోవాలి.

వ్యాధులపై అవగాహన
తొలకరి వర్షాలతో వనపర్తి జిల్లాలో వ్యాధులు తొంగి చూస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. విష జ్వరాల నిర్మూలన కోసం ప్రత్యేక శిక్షణ తరగతుల ద్వారా సూపర్‌వైజర్లకు, మెడికల్‌ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా గ్రామాల్లో వ్యాధులపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు మండే ఎండలు ఉండగా కాస్తంతా వాతావరణం చల్లబడి కొత్త వర్షపు నీరు చేరింది. వాతావరణంలో మార్పులతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. సరైన అవగాహన ఉంటే వర్షాకాలంలో వచ్చే ప్రమాదకరమైన చికున్‌ గున్యా, డెంగీ, మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

50 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు
వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేకంగా 50 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం అధికారులను నియమించాం. గతంలో జిల్లాలో డెంగీ జ్వరాలు రావడంతో ముందస్తుగా కార్యాచరణ ప్రారంభించాం. వర్షాలు కురుస్తుండటంతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నోడల్‌ పర్సన్‌ను ఏర్పాటు చేశాం. ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా దోమల నివారణ కార్యక్రమాలు రూపొందించాం. ఆయిల్‌ బాల్స్‌ వేశాం. వేల గంబూషియా చేపలను పెంచుతున్నాం. ఆశ కార్యకర్తలకు దోమల నివారణపై సమావేశాల్లో అవగాహన కార్యక్రమాలు రూపొందించాం. జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ఆదేశాల మేరకు విషజ్వరాల నియంత్రణలో భాగంగా గ్రామాల్లో ప్రత్యేకంగా పారిశుధ్య నిర్వహణ చర్యలపై చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.

  • చందూనాయక్‌, డీఎంహెచ్‌వో, వనపర్తి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana