e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జోగులాంబ(గద్వాల్) బండి.. సవాల్‌కు సిద్ధమా

బండి.. సవాల్‌కు సిద్ధమా

  • రూపాయి చెల్లిస్తే కేంద్రం ఇచ్చేది ఆఠాణే..
  • మొత్తం కేంద్రమే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం
  • బీజేపీ పాలిత ప్రాంతాల్లోపథకాలు ఉన్నాయా?
  • 60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో వలసలు తప్ప ఒరిగిందేమీ లేదు
  • కొత్త బిచ్చగాడిలా రేవంత్‌రెడ్డి..
  • ఏడేండ్లలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న నడిగడ్డ
  • ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌
  • జోగుళాంబ గద్వాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గద్వాల : తెలంగాణలో ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివేనని ఎంపీ బండి సంజయ్‌ నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. తప్పని తేలితే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమా అని మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. గద్వాల జిల్లాలో మంగళవారం మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గద్వాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. మొత్తం కేంద్రం పైసలే అయితే కర్ణాటకలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు ఎందుకు లేవు.. మొత్తం నీ డబ్బులే అయితే కర్ణాటకలోనూ ఇవన్నీ ఉండాలి కదా.. మోడీ ప్రభుత్వం వచ్చాక తెలంగాకు తీరని అన్యాయమే జరిగిందన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మెడికల్‌ కాలేజీలు వస్తాయని సీఎం కేసీఆర్‌ చెప్పారని.. తప్పకుండా గద్వాలకు సైతం మెడికల్‌ కళాశాల వస్తుందన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే గద్వాల జాతీయ నాయకురాలు దీనికి సమాధానం చెప్పాలన్నారు.

గద్వాలను చూసి పోయేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదుగురు మంత్రులం వచ్చామని, రూ.104కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాంగ్రెస్‌ దివాళా తీసిన పార్టీ అని.. నిన్న మొన్న ఆ పార్టీకి కొత్త బిచ్చగాడు వచ్చాడని రేవంత్‌రెడ్డిని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీదబిక్కి ప్రజలను కేసీఆర్‌ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. వాల్మీకీ బోయలను ఎస్టీల్లో చేర్చాలని 2007లో గొంతు విప్పి గర్జించింది కేసీఆర్‌ అని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఏడేళ్లలో గద్వాల ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి అడిగిన మేరకు గట్టు ఎత్తిపోతల పథకం పనులపై సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోతామన్నారు. సాగునీటి రంగానికి ఎన్ని డబ్బులైనా పెట్టడానికి వెనకాడని వ్యక్తి కేసీఆర్‌ అని… ఆయన దృష్టికి తీసుకుపోయి త్వరలోనే గట్టు ఎత్తిపోతల పథకం, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామన్నారు.

- Advertisement -

అభివృద్ధిలో దూసుకెళ్తున్న ‘నడిగడ్డ’
జిల్లాకేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, ఆర్డీవో రాములు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బాలికల జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్‌తో కలిసి భూమిపూజ చేశారు.

డిగ్రీ కళాశాల ఆవరణలో అదనపు తరగతుల కోసం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయం కోసం భూమిపూజ చేశారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో రూ.26కోట్లతో నిర్మించే సీసీరోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, కమ్యూనిటీ హాల్స్‌, కౌన్సిల్‌ హాల్‌, ఇండోర్‌స్టేడియం నిర్మాణానికి ఐటీ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ మంత్రులతో కలిసి పనులు ప్రారంభించారు. అక్కడినుంచి వ్యవసాయ మార్కెట్‌కు చేరుకుని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మతో కలిసి రూ.15కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బస్టాండ్‌ ఆవరణలో నూతన బస్టాండ్‌ను రూ.4కోట్లతో నిర్మించనుండగా మంత్రి కేటీఆర్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. నదీఅగ్రహారం వద్ద రూ.8కోట్లతో నిర్మించిన పీజీ విద్యార్థుల బాలికల, బాలుర వసతిగృహాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అక్కడే అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రులు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, పాలమూరు యూనివర్సిటీ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌, పంచాయతీరాజ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌, గట్టు తిమ్మప్ప, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

గోన్‌పాడులో షాదీఖాన నిర్మాణానికి భూమిపూజ
గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబర్‌ 14: ప్రజల గొంతుకగా నిలిచే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. గద్వాల మండలం గోన్‌పాడు వద్ద రూ. 30లక్షల వ్యయంతో షాదీఖాన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఆభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలొచ్చారు. అంతకుముందు మంత్రికి పూలవర్షం, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.

రవాణా సౌలభ్యం సులభతరం
అయిజ, సెప్టెంబర్‌ 14: జిల్లా నలుమూలల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునే వాహనదారుల రవాణా సౌలభ్యం సులభతరం చేసేందుకే ఆర్వోబీ (ఫ్లై ఓవర్‌) నిర్మాణం చేపట్టినట్లు మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలో ఆర్వోబీని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, విద్యాశాఖ మం త్రి సబితాఇంద్రారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ రాములు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితతో కలిసి మంగళవారం పూజలు చేసి ఆర్‌వోబీని ప్రారంభించారు. వాహనదారుల కష్టాలను గుర్తించి రూ.25కోట్ల వ్యయంతో ఆర్‌వోబీని నిర్మించినట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

చెన్నకేశవ సంగాల పార్కు ప్రారంభం
గద్వాలరూరల్‌, సెప్టెంబర్‌ 14: మండలంలోని సంగాల మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్మించిన శ్రీచెన్నకేశవస్వామి సంగాల పార్కును మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పైలన్‌ను ఆవిష్కరించారు. అదేవిధంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతాన్ని ఆలపించారు. గద్వాల పట్టణవాసులకు పార్కు ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ రాములు, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana