e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు జాప్యం వద్దు

జాప్యం వద్దు

జాప్యం వద్దు

ధాన్యం రవాణాకు వీలైనన్ని వాహనాలను వాడుకోవాలి
క్రాప్‌ బుకింగ్‌లో నమోదు కాలేదన్న సాకుతో తిరస్కరించొద్దు
మొక్కజొన్న కొనుగోలుపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతా..
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
కొనుగోళ్లు, కరోనా నివారణపై ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమీక్ష

వనపర్తి/కొత్తకోట/నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ గద్వాల/ ఉండవెల్లి, మే 10 : ధాన్యం రవాణాలో జాప్యం తగదని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి ధాన్యం కొనుగోళ్లు, కరోనా నివారణపై వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు చేసిన తరువాత వీలైనన్ని ఎక్కువ వాహనాలను ధాన్యం రవాణాకు ఉపయోగించుకోవాలన్నారు. వర్షంలో ధాన్యం తడిసిపోకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అప్‌లోడ్‌ చేయాలని, ఒకవేళ స్థల సమస్య ఉంటే పక్క మిల్లుకు లేదా సమీప గోదాంలకు తరలించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తుంటే.. చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దన్నారు. క్రాప్‌ బుకింగ్‌లో నమోదు కాలేదన్న సాకుతో ధాన్యం కొనుగోలును తిరస్కరించొద్దని, సమస్యలుంటే శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని జిల్లాల నుంచి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తి వస్తుందని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హమాలీల సమస్య తీర్చాలని, తరుగు తీసే విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తున్నందున ఆయా జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏడాది మార్చి 31వ తేదీ లోగా పంటల కోతలు పూర్తయ్యేలా చూసుకుంటే నష్టాలు ఉండవని, సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో రైతులను ఈ దిశగా చైతన్యం చేయాలన్నారు.
వైద్య సిబ్బంది కృషి అమోఘం..
కరోనా మహమ్మారి నివారణకు వైద్య సిబ్బంది కృషి అమోఘమని, లక్షణాలుంటే వెంటనే చికిత్స మొదలుపెట్టాలని మంత్రి సూచించారు. సదుపాయాల కల్పనకు సంబంధించిన వివరాలను వచ్చే నెలలో సమర్పించాలన్నారు. ఫీవర్‌ సర్వేను కచ్చితంగా నిర్వహించాలన్నారు. సర్వే విషయంలో ప్రజలు, జ్వర పీడితుల నుంచి ఎలాంటి స్పందన ఉంది..? ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు ఆశిస్తున్నారు..? ఇంకా ఏం చేయాలని సూచిస్తున్నారు..? వంటి విషయాలను తెలుసుకోవాలన్నారు. కరోనా బాధితులు హైదరాబాద్‌ వర కు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే మెరుగైన చికిత్స అందేలా చూడాలని, నాలుగు రోజులుగా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. మరో రెండు నెలలు కలిసికట్టుగా కృషి చేసి విపత్తు నుంచి బయటపడేద్దామన్నారు. అయిన వారే దూ రం పెడుతున్న ఈ పరిస్థితుల్లో వైద్య సిబ్బంది, ఆశవర్కర్ల సేవలకు చేతులెత్తి మొక్కాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత ఎక్కువగా ఉందని.. పాతవి, చిరిగిన వాటిని ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు అంబులెన్స్‌ను సమకూర్చాలని మంత్రిని కోరారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ శర్మన్‌ మాట్లాడుతూ జిల్లాలో 217 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తరలిస్తున్నట్లు మంత్రికి తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటి సర్వేను నిర్వహించి.. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్‌ కిట్లు అందజేస్తున్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అబ్రహం, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్లు శృతి ఓఝూ, వెంకట్రావు, శర్మన్‌, జిల్లా వైధ్యాధికారులు శ్రీనివాసులు, చందునాయక్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జాప్యం వద్దు

ట్రెండింగ్‌

Advertisement