ఉదయం 11 గంటలకు చిట్యాల మార్కెట్ యార్డు ప్రారంభం
ఉన్నత పాఠశాలలో ‘మన బడి’కి శ్రీకారం
కలెక్టరేట్ ప్రారంభం.., మెడికల్ కళాశాల, కర్నె తండా లిఫ్ట్‌కు శంకుస్థాపన
మధ్యాహ్నం 3:30 గంటలకు బహిరంగ సభ
లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు
వనపర్తి, మార్చి 7(నమస్తే తెలంగాణ):వనపర్తి జిల్లాలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు.ఉదయం 11 గంటలకు చిట్యాల గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకొని ‘మన ఊరు- మన బస్తీ-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మెడికల్ కళాశాల నిర్మాణం, కర్నె తండా లిఫ్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. 2:15కు కలెక్టరేట్‌ను ప్రారంభించి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. 3:30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభకు ప్రజలు భారీగా తరలివచ్చేలా టీఆర్ఎస్ నేతలు సమీకరిస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గులాబీ జెండాలు, ప్రధాన రహదారులతోపాటు వీధివీధినా దర్శనమిస్తున్నాయి. ముందుగా ప్రారంభించే చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ తాత్కాలిక హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్ద దిగి మార్కెట్‌యార్డును ప్రారంభిస్తారు. అక్కడినుంచి రోడ్‌షో ద్వారా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన ‘మన ఊరు- మన బడి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఏర్పాట్లను ప్రభుత్వ కార్యదర్శి సందీప్ సుల్తానియా పరిశీలించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షించారు. వనపర్తి గులాబీ వనంగా మారింది.
సభకు లక్షకుపైగా జనం
సభకు లక్షకుపైగా జనం వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసి అమలుపరుస్తున్నారు. ఒక్కో గ్రామానికి బాధ్యులను నియమించి ప్రజలను సమీకరించే పని అప్పజెప్పడంతో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు లక్షా 20వేల నుంచి లక్షా 50వేల మంది హాజరయ్యేలా ప్రణాళిక తయారు చేశారు. బైక్‌లు, ట్రాక్టర్లు, డీసీఎంలు, బస్సులపై సభకు తరలిరానున్నారు. సభకు వచ్చిన వారికి ఆహారం, తాగునీళ్లు ఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు తలెత్తకుండా వలంటీర్లను ఏర్పాటు చేశారు. కేసీఆర్ మీద దారిపొడవునా పూల వర్షం కురిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్..
వనపర్తి జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు చేరుకుంటారు. చిట్యాల గ్రామంలోని అగ్రికల్చర్ మార్కెట్‌యార్డును ప్రారంభిస్తారు. 15నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించుకొని రోడ్డుమార్గంలో మంత్రి నిరంజన్‌రెడ్డి విద్యనభ్యసించిన జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలకు రానున్నారు. అక్కడ మనఊరు- మనబడి, మనబస్తీ -మనబడి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 1గంట వరకు విద్యార్థులనుద్ధేశించి ప్రసంగిస్తారు. అనంతరం నాగవరంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 15నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించుకొని నాగవరం పరిధిలోని మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 2:15నిమిషాలకు కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేస్తారు. అనంతరం మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు 3:30గంటలకు చేరుకొని ప్రజలు, పార్టీ శ్రేణులనుద్ధేశించి మాట్లాడుతారు. సాయంత్రం 5:30గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు.
దారులన్నీ వనపర్తి వైపే..!
సీఎం కేసీఆర్ సభకు సన్నాహాలు పూర్తయ్యాయి. వనపర్తి జిల్లాకేంద్రంలో మంగళవారం సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలుకానున్న మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి దాదాపుగా 30వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ప్రజలు వనపర్తికి వెళ్లేలా ఏర్పాట్లు చేపట్టారు. 400బస్సులు, 200వాహనాలను సిద్ధం చేశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్, మున్సిపల్, విండో చైర్మన్లు, పార్టీ గ్రామ, మండలాధ్యక్షులు, ముఖ్యనాయకులతో సభకు ప్రజలు భారీగా వచ్చేలా సూచనలు ఇచ్చారు. ఆయా గ్రామాల ఇన్చార్జి నాయకులు ప్రజలను బస్సుల్లో ఎక్కించనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన సీఎం సభ జరుగనున్నది. మధ్యాహ్నం 3:30గంటలకు సీఎం సభ జరుగనున్నది. గంట ముందే ప్రజలు చేరుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రజలకు తాగునీరు, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎమ్మెల్యే మర్రి, డీసీసీబీ డైరెక్టర్ జక్కారఘునందన్‌రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి సభకు తరలించే ఏర్పాట్లు చేపడుతున్నారు. అలాగే పార్టీ కండువాలు, జెండాలు, ఫ్లెక్సీలు గ్రామాలకు చేరవేశారు. ఆర్టీసీ బస్సులు గ్రామాలకు ఉదయమే చేరుకునేలా ఆర్టీసీ అధికారులకు సూచించారు. మూడు రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసి వనపర్తి సభకు జన సమీకరణ కోసం చర్యలు తీసుకుంటున్నారు.
‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం; ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తిటౌన్, మార్చి 7: రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘మన ఊరు- మన బడి కార్యక్రమానికి వనపర్తి జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఫైలాన్ ప్రారంభించడానికి సోమవారం ఏర్పాట్లు పూర్తిచేశారు. పనులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్ దేవసేనతోపాటు ఆర్జేడీలు పరిశీలించారు. మంగళవారం ఉదయం 11:40గంటలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రాంగణానికి చేరుకొని మొదటగా ఫైలాన్ ప్రారంభిస్తారు. అంతకుముందు బాలభవన్, పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి 6500మంది విద్యాధికారులు హాజరయ్యేలా సభను తీర్చిదిద్దారు.
పటిష్ట బందోబస్తు; విధుల్లో 1,840మంది పోలీసు సిబ్బంది
వనపర్తి, మార్చి 7: వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం కేసీఆర్ పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ రేంజ్ ఐజీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు. వివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన అధికారులకు, సిబ్బందికి సోమవారం జిల్లాకేంద్రంలోని పద్మావతి గార్డెన్ ఫంక్షన్హాల్లో ఐజీపీ బందోబస్తుపై పలు సూచనలు చేశారు. బందోబస్తును 16సెక్టార్లుగా విభజించారు. 8మంది ఎస్పీలు, 8మంది ఏఎస్పీలు, 24మంది డీఎస్పీలు, 76మంది సీఐలు, 209మంది ఎస్సైలు, 229మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్స్, 1,186 మంది కానిస్టేబుల్స్/ మహిళా కానిస్టేబుల్స్, 100 మంది స్పెషల్ పార్టీ పోలీసులు మొత్తం 1,840మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 8గంటలకు పోలీస్ అధికారులు, సిబ్బంది డ్యూటీలో హాజరు కావాలన్నారు. అధికారులందరికీ కమ్యూనికేషన్ సెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ట్రాఫిక్ అండ్ పార్కింగ్ డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి డ్యూటీ చేయాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే వాహనాలను క్రమ పద్ధతిలో పెట్టించాలన్నారు. రోడ్లపై వాహనాలు నిలుపకుండా చూడాలన్నారు. సీఎం వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు నిలుపకుండా డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
వీఐపీలు, ప్రజాప్రతినిధులకు పార్కింగ్ ప్రదేశాలు
పార్కింగ్ 1: గద్వాల, అయిజ, అలంపూరు, పెబ్బేరు వైపునుంచి వచ్చే ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు వాహనాలు 80ఫీట్ల రోడ్డు ఎడమవైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ సభాస్థలానికి వెళ్లాలి.
పార్కింగ్ 2: నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, కార్యకర్తల వాహనాలు సూర్యచంద్ర స్కూల్ వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేయాలి.
పార్కింగ్ 3: దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, ఆత్మకూర్, కొత్తకోట రోడ్డు వైపు నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమ వాహనాలను తెలంగాణ భవన్ వెనకాల ఉన్న ఖాళీప్రదేశంలో పార్కింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా వీఐపీ, వీవీఐపీ పాసులను ఇవ్వడం జరిగిందని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి బ్లూకలర్ పాస్‌లను అందజేశారు. సమావేశంలో నల్లగొండ ఎస్పీ రెమారాజేశ్వరి, గద్వాల ఎస్పీ రంజన్ రతన్‌కుమార్, నాగర్‌కర్నూల్ ఎస్పీ మనోహర్, మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.