శనివారం 06 మార్చి 2021
Gadwal - Jan 31, 2021 , 00:12:19

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల,జనవరి 30: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఎఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తెలుగు, ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ఎంకాం పీజీ కోర్సులు మంజూరు కాగా శనివారం ఎమ్మెల్యే పీజీ కోర్సు సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో డిగ్రీ పూర్తి చేసుకున్న యువత పైచదువుల కోసం ఇతర ప్రాంతాలకు  వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారని,  ఇప్పుడు ఇక్కడే పీజీ కోర్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల అదనపు గదుల నిర్మాణం కోసం రూ.85లక్షలు, బాలికల కళాశాల నిర్మాణం కోసం రూ.1.50 కోట్లు  మంజూరు చేశామని త్వరలో ఆ పనులకు భూమి పూజ చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడ అన్ని వసతులు కల్పించడానికి రూ.8 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేసి అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి కళాశాలలో పీజీ కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటి పీజీ కోర్సుల బ్రోచర్‌ విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీపతినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతోనే కళాశాలకు పీజీ కోర్సులు మంజూరు అయ్యాయని తెలిపారు. 

టీఆర్‌ఎస్‌ కార్యాలయ పనులు పరిశీలన

జిల్లా కేంద్రంలో మార్కెట్‌యార్డు పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవన పనులను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. త్వరలో జిల్లా పార్టీ కార్యాలయం అన్ని హంగులతో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే  తెలిపారు.  అలాగే జిల్లా కేంద్రంలోని కోట వెనుక భాగంలో పార్కు నిర్మాణం కోసం  ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. కార్యక్రమాల్లో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ విజయ్‌కుమార్‌, జెడ్పీటీసీ రాజశేఖర్‌,వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు నాగిరెడి,్డ కృష్ణ, శ్రీను, దౌలు, శ్రీనివాసులు, నాగరాజు, మహేశ్‌ పీజీ కోర్సుల ఇన్‌చార్జి శివరామిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo