బుధవారం 03 మార్చి 2021
Gadwal - Jan 30, 2021 , 00:27:55

ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తాం

ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తాం

  • టూరిజం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు

అలంపూర్‌, జనవరి 29: జోగుళాంబ క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి యాత్రికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని టూరిజం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు అన్నారు. శుక్రవారం ఆయన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర క్షేత్రంలో పర్యటించారు. ప్రసాద్‌ స్కీం పేరుతో రాష్ర్టానికి మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులకు స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. బోటింగ్‌ సౌకర్యం, పుష్కరఘాట్‌పై హైమాస్ట్‌ లైట్లు, సీసీ కెమెరాలు  ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పనులకు సంబంధించి త్వరలో టెండర్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా యోగా నారసింహాలయం, సూర్యనారాయణ ఆలయం, నది ప్రహరీ పరిసరాలను పరిశీలించారు. అంతకుముందు టూరిజం హోటల్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం, ఆలయ పాలక మండలి చైర్మన్‌ రవిప్రకాశ్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ మనోహర్‌ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు వారికి ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ రావు, కమిటీ చైర్మన్‌ రవిప్రకాశ్‌గౌడ్‌ అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వారిని శేష వస్ర్తాలతో సత్కరించారు. వారి వెంట ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శంకర్‌రెడ్డి, ఆర్డీవో రాములు, అలంపూర్‌ హరిత టూరిజం హోటల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, వెంకటేశ్‌, ఆలయ ధర్మకర్తలు వెంకట్రామయ్యశెట్టి తదితరులు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారి వెంట సింగవరం సర్పంచ్‌ అనిత, సాయిబాబ, తదితరులు ఉన్నారు.

VIDEOS

logo