సోమవారం 08 మార్చి 2021
Gadwal - Jan 30, 2021 , 00:27:44

నిండు జీవితానికి రెండు చుక్కలు

నిండు జీవితానికి రెండు చుక్కలు

  • రేపు పల్స్‌పోలియో 
  • పోలియోపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న వైద్య శాఖ
  • రెండు రోజుల పాటు ఇంటింటికీ పంపిణీ

గద్వాలటౌన్‌, జనవరి29: కరోనా వ్యాక్సినేషన్‌ ఈ నెల 16నుంచి ప్రారంభమైన దృష్ట్యా 17న నిర్వహించాల్సిన పల్స్‌ పోలియో చుక్కల మందు పంపిణీ వాయిదా పడిన విషయం తెలిసిందే. తిరిగి ఈ ఆదివారం నిర్వహించనున్న పల్స్‌ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమంపై వైద్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని పీహెచ్‌సీల వైద్యాధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే జిల్లాలో అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో, వార్డుల్లో ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 

గద్వాల జిల్లాలో..

జోగుళాంబ గద్వాల జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు 79,000మంది చిన్నారులను గుర్తించారు. అలాగే హై రిస్కు ప్రాంతాలుగా ఇసుక బట్టీలు, సంచార జాతుల గుడారాలు ఇలా 58ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో 497మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చిన్నారులకు మందును పంపిణీ చేసేందుకుగానూ జిల్లా మొత్తం 462పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఇందుకుగానూ 1981మంది సిబ్బందిని నియమించారు. జిల్లా మొత్తం మీద 11మొబైల్‌ టీంలను ఏర్పాటు చేశారు. అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. 

సంచార జాతులపై ప్రత్యేక దృష్టి

సంచార జాతులు, ఇటుక బట్టీలపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లాలో ప్రత్యేక సర్వే ద్వారా 58ప్రాంతాలు హై రిస్కు ప్రాంతాలుగా గుర్తించింది. హై రిస్కు ప్రాంతాల్లో 0-5 సంవత్సరాలలోపు చిన్నారులు 497మంది ఉన్నట్లు గుర్తించారు. 

ఇంటింటికీ పంపిణీ

ఆదివారం నిర్ణీత కేంద్రాల్లో పోలియో చుక్కల మందు పంపిణీ చేస్తారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరుగుతూ పోలియో మందును పంపిణీ చేస్తారు. ఇందుకుగానూ 912టీంలు ప్రత్యేకంగా పనిచేయనున్నాయి.

తప్పనిసరి వేయించాలి

0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరి చుక్కల మందును వేయించాలి. సిబ్బంది బాధ్యతాయుతంగా వ్వవహరించాలి. సంచార జాతులపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సిబ్బందికి సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

- చందూనాయక్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో, జోగుళాంబ గద్వాల 


VIDEOS

logo