శనివారం 27 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 26, 2021 , 02:44:28

డూప్లి‘కేటుగాళ్ల’ అరెస్ట్‌

డూప్లి‘కేటుగాళ్ల’ అరెస్ట్‌

  • ఏటీఎం సెంటర్ల వద్ద రెక్కీ.. 
  • నగదు డ్రా చేసే క్రమంలో బురిడీ  
  • ఒరిజినల్‌ ఏటీఎం బదులు నకిలీవి ఇస్తున్న వైనం
  • ఇద్దరు అరెస్టు, రిమాండ్‌కు తరలింపు  
  • చాలా చోట్ల ఇదే తీరున చోరీ :  జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్త్రన్‌ కుమార్‌

గద్వాల న్యూటౌన్‌, జనవరి 25 : ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయడానికి రాని అమాయకులను ఆసరాగా చేసుకొని నగదు చోరీ చేస్తున్న నిందితులు పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం జిల్లా ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రంజన్త్రన్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన గద్వాల పట్టణానికి చెందిన మహ్మద్‌ రషీద్‌ రాజీవ్‌మార్గ్‌లోని ఓ ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అయితే, అతడికి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలియదు. దీంతో అక్కడే ఉన్న హర్యానాకు చెందిన షాకీర్‌ హుస్సేన్‌, షకీబ్‌, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రహెమాన్‌లు రషీద్‌కు సాయం చేస్తానని నమ్మబలికి ఏటీఎం కార్డు, పిన్‌ నంబర్‌ తీసుకున్నారు. నగదు డ్రా చేసేందుకు ప్ర యత్నించారు. డబ్బులు రావడం లేదని రషీద్‌కు చె ప్పి.. ఆ ముగ్గురు వారి వద్ద ఉన్న మరో ఏటీఎం కార్డును ఇచ్చారు. సదరు వ్యక్తి వెళ్లిన తర్వాత ఏటీఎంలో నుంచి రూ.20 వేల నగదు డ్రా చేసినట్లు బాధితుడి ఫోన్‌కు మెస్సేజ్‌ రావడంతో వెంటనే బ్యాంకు, పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. 

సీసీ కెమెరాల ఆధారంగా గుర్తింపు.. 

సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈనెల 18న రాజీవ్‌మార్గ్‌ ఏటీఎం సెం టర్‌ వద్దకు టీఆర్‌ నెంబర్‌తో కారు తీసుకొని వచ్చిన ముగ్గురిని బాధితుడు గుర్తించినట్లు చెప్పారు. కాగా, మళ్లీ అదే నెంబర్‌ కారుతో సోమవారం పట్టణంలో తిరుగుతుండగా షాకీర్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ రహెమాన్‌లను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి 40 ఏటీఎం కార్డులు, రూ. 39 వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. ము గ్గురు నిందితులు గతంలో మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. ఈ కేసును ఛేదించిన పట్టణ ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి, కానిస్టేబుల్‌ చందు, భాస్కర్‌కు ఎస్పీ రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి పాల్గొన్నారు. 

VIDEOS

logo