విద్యాలయాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి

- కలెక్టర్ శృతిఓఝా
గద్వాల, జనవరి 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల పున:ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శృతిఓఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో విద్యాశాఖ, జూనియర్, డిగ్రీ, పీజీ, కళాశాలల ప్రిన్సిపాల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వసతి గృహాల అధికారులు, జిల్లా పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని, 9, 10వ తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కళాశాలలతోపాటు వాటికి అనుబంధంగా ఉన్న వసతి గృహాలను ఈ నెల 20వ తేదీ లోపు శానిటైజ్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో రెండు ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేయాలని ప్రతి కళాశాలలో మెడికల్ అధికారుల నంబర్లు ఉండేలావైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి ఆరు ఫీట్ల భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంట్రెన్స్ పాయింట్లో థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేయాలని, అర్బన్‌లో అయితే మున్సిపల్ కమిషనర్, రూరల్ పరిధిలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి శానిటైజ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉండే పాఠశాల, కళాశాలల జాబితా జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి డీఈవో సుశీందర్‌రావు, జిల్లా వైద్యశాఖ అధికారి చందూనాయక్, డీపీవో కృష్ణ పాల్గొన్నారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో సోమవారం 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్, స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నుంచి ఫిబ్రవరి 17వరకు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీటీవో పురుషోత్తంరెడ్డి, చక్రవర్తిగౌడ్, నరసింహస్వామి, కమల్‌కాంత్, శ్రీనివాస్, కిషోర్ అనూప్‌రెడ్డి, మహేశ్‌కుమార్, సాయికార్తీక్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శృతిఓఝా ఆదేశించారు. సోమవా రం ప్రజావాణికి వాట్సాప్ ద్వారా 5 ఫిర్యాదులు, ఇతరవి 47 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందులో భూసమస్యలు, పెన్షన్,ఇంటి స్థలాలు తదితర సమస్యలపై ద రఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని బాధితులకు హామీ ఇచ్చారు.
పింఛన్ ఇప్పించాలని వినతి
గట్టు, జనవరి 18: గతేడాది జనవరి నెలలో చేపట్టిన బోగస్ పింఛన్ల ఏరివేతలో భాగంగా చేపట్టిన సర్వేలో బతికి ఉన్న తనను మరణించినట్లు నమోదు చేయడం తో వృద్ధాప్య పింఛన్ ఆగిపోయిందని మాచర్లకు చెందిన కటికె పెద్ద ఈరన్న కలెక్టర్‌కు ప్రజావాణిలో సోమవారం అందజేసిన వినతిలో వాపోయాడు. అధికారుల ని ర్లక్ష్యం కారణంగా పింఛన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నానన్నారు. ఈ విషయంలో స్పం దించి పింఛన్ అందేవిధంగా చూడాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.