సోమవారం 08 మార్చి 2021
Gadwal - Jan 05, 2021 , 03:19:00

ప్రయాణం ప్రమాదం

ప్రయాణం ప్రమాదం

  • తొమ్మిదేండ్లుగా కొనసా....గుతున్న పనులు
  • నది దాటేందుకు కడ్డీల మెట్లు ఎక్కి ఇబ్బందులు
  • తిప్పలు తప్పేదెప్పుడో..?బ్రిడ్జికి మోక్షమెప్పుడో..?

ఏదైనా పనిపడి ఊరు దాటాలంటే ముందు నది దాటాలి..నదిలో మర పడవ ప్రయాణం కూడా నిషేధించడంతో వేరే గత్యంతరం లేక.. ప్రమాదమని తెలిసినా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. తెలంగాణలోని పులికల్‌, రాయలసీమ ప్రాంతంలోని నాగల్‌దిన్నె వరకు తుంగభద్ర నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 2009లో వరదకు పూర్తిగా దెబ్బతిన్నది. 2013లో బ్రిడ్జి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించిన్పటికీ నేటికీ పూర్తి కాలేదు. నదిలో మరపడవల ప్రయాణాన్ని నిషేధించడంతో చేసేది లేక బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన ఇనుప కడ్డీల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు.

-నడిగడ్డ,జనవరి 4

నడిగడ్డ, జనవరి 4 : ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. నది దాటేందుకు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఏండ్లుగా తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ప్రజలు నది దాటేందుకు సాహసం చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నదిలో మరపడవల ప్రయాణాన్ని నిషేధించడంతో చేసేది లేక బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన ఇనుప కడ్డీల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రిడ్జిపై ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అటు బ్రిడ్జి నిర్మాణ అధికారుల గానీ, ఇటు పోలీసు అధికారులు గానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రయాణం కొనసాగించడానికి బ్రిడ్జిపైకి ఎక్కేందుకు సర్కస్‌ ఫీట్లను తలపిస్తున్నాయి. మరికొందరు చంటి పిల్లలను చంకలో పెట్టుకొని పైకి ఎక్కేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

ఇంకెన్నాళ్లీ.. ప్రమాద ప్రయాణం

తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల రాకపోకలకు అనువుగా ఉంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని పులికల్‌, అటు రాయలసీమ ప్రాంతంలోని నాగల్‌దిన్నె వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కానీ, దురదృష్టవశాత్తు 2009 అక్టోబర్‌ 2న వచ్చిన వరదలకు నాగల్‌దిన్నె బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నది. ఇతర ప్రాంతాల్లో దెబ్బతిన్న బ్రిడ్జిల నిర్మాణ పనులు పూర్తికాగా నాగల్‌దిన్నె బ్రిడ్జి నిర్మాణ పనులు తొమ్మిదేండ్లుగా కొనసా..గుతున్నాయి. నిర్మాణ పనులు చూస్తే మరో ఏడాదయినా పూర్తయ్యే అవకాశం కనిపించడంలేదు. 2012 నవంబర్‌ 31న టెండర్లు పూర్తికాగా, కాంటిక్‌ సిండికేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ పనులను దక్కించుకున్నది. 2013లో పనులు ప్రారంభించిన్పటికీ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. 2016 మార్చి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. పనులు పూర్తి కాకపోవడంతో 2018 జూలై నాటికి గడువు మరోసారి ఇచ్చింది. అయినా నేటికీ 70శాతం పనులు కూడా పూర్తి కాలేదు. 

2002లో వంతెన నిర్మాణం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ-తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ నాగల్‌దిన్నె-పులికల్‌ గ్రామాల మధ్య రూ.7కోట్ల వ్యయంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2002లో నాగల్‌దిన్నె బ్రిడ్జిని పూర్తిచేశారు. 2009 అక్టోబర్‌ 2న వచ్చిన వరదలకు బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నది. గద్వాల, మహబూబ్‌నగర్‌, ఆత్మకూర్‌ తదితర ప్రాంతాల నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం చేరుకోవడానికి కేవలం 80కిలో మీటర్లు దూరం ఉంటుంది. బ్రిడ్జి నిర్మించక ముందు కర్నూలు లేదా ఎరగెర మీదుగా మంత్రాలయం వెళ్లాలంటే కనీసం 150 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉండేది. బ్రిడ్జి నిర్మించిన తర్వాత మంత్రాలయంతోపాటు ఎమ్మిగనూరు, బళ్లారి, బెంగళూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే గద్వాల, మహబూబ్‌నగర్‌, ఆత్మకూర్‌ ప్రాంతాలకు చెందిన ప్రజలు నాగల్‌దిన్నె బ్రిడ్జిపైనే ప్రయాణం చేసేవారు. 2009 అక్టోబర్‌ 2న వచ్చిన వరదల కారణంగా బ్రిడ్జి పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి.  పులికల్‌, నాగల్‌దిన్నె గ్రామాల మధ్య కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. పులికల్‌ నుంచి నాగల్‌దిన్నెకు, నాగల్‌దిన్నె నుంచి పులికల్‌కు వెళ్లాలంటే అయిజ, కర్నూలు మీదుగా 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. తుంగభద్ర నదికి ఇరువైపులా ప్రజలకు సత్సంబంధాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు నిత్యం నదికి అటు, ఇటూ వెళ్లాల్సి వస్తుంది. అయిజ, కర్నూలు మీదుగా వెళ్లాలంటే కనీసం 6గంటల సమయం పడుతుంది. పది నిమిషాల్లో చేరుకునే గ్రామాలకు కూడా గంటల కొద్దీ ప్రయాణం కొనసాగించలేక గతంలో నదిని దాటేందుకు మరపడవలో ప్రాణాలను ఆరచేతుల్లో పెట్టుకొని వెళ్లేవారు. కానీ గతేడాది గోదావరి నదిలో పడవ మునిగి చాలామంది మృతి చెందడంతో ఇక్కడ కూడా పడవ ప్రయాణాలు నిషేధించారు. కానీ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ప్రమాద స్థితిలో ఇనుప కడ్డీల మెట్లను ఎక్కి అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఈ తతంగం చూసి కూడా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 

త్వరగా పూర్తి చేయాలి

అధికారులు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. రెండు కిలోమీటర్ల దూరానికి 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. బంధుత్వం మొత్తం తుంగభద్ర నదికి అవతలి వైపు ఉండటంతో ప్రాణం అరచేతిలో పెట్టుకొని నది దాటాల్సి వస్తుంది. బ్రిడ్జి దెబ్బతిని 11 ఏండ్లు కావొస్తున్నది. బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసి మెరుగైన రవాణా కల్పించాలి. 

- భీమన్న, పులికల్‌, అయిజ

ప్రమాదపుటంచున ప్రయాణం 

త్వరగా నది అవతలి వైపు చేరుకునేందుకు ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నాం. బ్రిడ్జి నిర్మాణ పనులు ఏండ్లుగా కొనసాగడంతో ఇబ్బందులు పడుతున్నాం. మరపడవలు నిషేధించడంతో నిర్మాణ పనులు అరకొర ఉన్నా త్వరగా చేరుకోవాలనే ఆతృతతో బ్రిడ్జిపై వెళ్తున్నాం.

- వెంకటేశ్‌, అయిజ

VIDEOS

logo