శనివారం 06 మార్చి 2021
Gadwal - Dec 22, 2020 , 00:19:26

నల్లచట్టాలపై నిరసన

నల్లచట్టాలపై నిరసన

  • జోలెపట్టి..మద్దతు కూడగట్టి..
  • కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఊరూరా ఉద్యమం
  • రైతులకు మద్దతుగా పిడికెడు బియ్యం సేకరిస్తున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల
  • వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టేందుకు  కార్పొరేటు చట్టాలు

కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేటు శక్తులకు కొమ్ముకాసేలా ఉన్నాయని రైతులు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు మద్దతుగా ఎమ్మెల్యే బండ్ల వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో చేపట్టిన రైతుల దీక్షలకు మద్దతుగా జోలెపట్టి పిడికెడు బియ్యం సేకరిస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో చేపట్టిన పిడికెడు బియ్యం సేకరణ కార్యక్రమానికి రైతులు మద్దతు పలుకుతున్నారు. ఊరూరా హారతి పట్టి స్వాగతిస్తున్నారు. ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచుతున్నారు.

- నడిగడ్డ


నడిగడ్డ : వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టి కార్పొరేటు శక్తులకు కొమ్ము కాసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది. మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిడికెడు బియ్యం సేకరణ చేపట్టారు. రోజుకో మండలం నుంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలను చేపడుతుంటే కేంద్రం మాత్రం రైతుల నడ్డీ విరిచేలా చట్టాలను తీసుకొచ్చింది. నియోజకవర్గంలో ఇప్పటికే రైతుబంధు సమితులు ఐదు బృందాలుగా ఏర్పడి మల్దకల్‌, గద్వాల, ధరూర్‌, కేటిదొడ్డి, గట్టు మండలాల్లోని అన్ని గ్రామాల్లో భిక్షాటన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై రైతులు, ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచుతున్నారు.

కార్పొరేటుకు కొమ్ము కాసేలా..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేటు శక్తులకు కొమ్ముకాసేలా ఉన్నాయని రైతులు, రైతుబంధు సమన్వయ సమితీలు ఆరోపిస్తున్నాయి. చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి చెవికెక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు కార్పొరేటు శక్తులతో చేసుకొన్న ఒప్పందం ప్రకారమే పండించిన పంటను విక్రయించాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే ఒప్పందం ప్రకారం నష్టాన్ని భరించే క్రమంలో పొలాన్ని అమ్ముకొని తన పొలంలో తాను కూలీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలు రైతులకు మేలు చేయాలే కానీ.. ముంచేలా ఉండకూడదని ఆందోళన చెందుతున్నారు.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రైతుల మద్దతు..

కేంద్ర చట్టాలను ఎండగడుతూ ఎమ్మెల్యే బండ్ల చేపట్టిన భిక్షాటన కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రైతులు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడికి వచ్చి భిక్షాటనలో పాలుపంచుకుంటున్నారు. భిక్షాటనకు రానివారు ఫోన్ల ద్వారా మద్దతు తెలుపుతున్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాయలంలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ రా ములు విలేకరుల సమావేశం ఏ ర్పాటు చేసి తన సంపూర్ణ మద్ద తు తెలిపారు. ఇప్పటికైనా న ల్లచట్టాలను రద్దుచేయాలని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం పునరాలోచించాలి..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉన్నది. పాత చట్టాల్లో లోపాలుంటే సవరించాలి కానీ మొత్తం చట్టాలనే మార్చితే జీడీపీ పడిపోనున్నది. ఆర్థిక సంక్షోభంతోపాటు ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై పునరాలోచించాలి. 
- బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే

వ్యవసాయ రంగానికి దెబ్బ

కేంద్ర తీసుకొచ్చిన నూతన చట్టాలతో వ్యవసాయ రంగంపై తీరని దెబ్బ పడనున్నది. చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే దేశ వ్యాప్తంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులకు ఆదుకునేలా చట్టాలుండాలి తప్ప నష్టపోయేలా ఉండొద్దు.
- చెన్నయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు

కార్పొరేటు శక్తులకు అనుకూలంగా..

కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు కార్పొరేటు శక్తులకు అనుకూలంగా ఉ న్నాయి. చట్టాలు చేసేటప్పుడు రైతులకు అనుకూలంగా ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆరేండ్లుగా కార్పొరేటు శక్తుల కు ఊడిగం చేస్తుంది. ఆందోళన చూసైనా చట్టాలు ఉపసంహరించుకోవాలి. 
- ప్రతాప్‌గౌడ్‌, ఎంపీపీ, గద్వాల 

VIDEOS

logo