అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

కలెక్టర్ శృతిఓఝా
గద్వాల: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శృతిఓఝా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలోని గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపల్ కమిషనర్లతో అభివృద్ధి పురోగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీకృత మార్కెట్లు, సీసీ, బీటీరోడ్లు టాయిలెట్లు, వైకుంఠధామాలు, పట్టణప్రకృతి వనాలు, నర్సరీల ఏర్పాటు వంటి అంశాలపై మున్సిపాలిటీ వారీగా సమీక్ష నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి కౌన్సిల్ ఆమోదం, పరిపాలనా అనుమతులు తీసుకుని టెండర్లతో పనులు ప్రా రంభించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాల్సి ఉందని ఇప్పటికే ఉన్నవాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. గ్రీన్ బడ్జెట్‌పై మాట్లాడుతూ వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమానికి బయట నుంచి మొక్కలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకూడదని మున్సిపాలిటీలకు అవసరమైన నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని ఆదేశించారు. పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై మున్సిపల్ కమిషనర్లను ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో అవసరమైన పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ టాయిలెట్లపై సమీక్ష నిర్వహిస్తూ అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో సైతం అవసరమైన పబ్లిక్ టాయిలెట్లు పూర్తి చేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహర్ష, పురపాలక కమిషనర్లు నర్సింహ, వెంకటరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.