ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 04, 2020 , 02:31:37

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

  •  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల : దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటూ వారికి అవసరమైన సౌకర్యాలు సమకూర్చుతుందని ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్‌లో దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నదని వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులను ఎవరూ తక్కువ చేసి మాట్లాడవద్దని , మనతో సమానంగా వారిని ఆదరిద్దామని అందరం కలిసి వారికి చేయూత నిద్దామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  అనంతరం దివ్యాంగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తిమ్మప్ప, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు చంటి పాల్గొన్నారు.

ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ పథకాన్ని ప్రవేశ పెట్టిందని దీనిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండలం సోంపురం గ్రామానికి చెందిన వీరన్నకు అత్యవసర చికిత్స నిమిత్తం మంజూరైన రూ.లక్ష ఎల్‌వోసీని ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు. అలాగే మల్దకల్‌ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన సత్యమ్మ చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన రూ.36 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. మల్దకల్‌ మండలం అమరవాయి గ్రామానికి చెందిన రైతు కురువ పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె భర్త కురువ కిష్టన్నకు ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.5లక్షల రైతుబీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.  కార్యక్రమంలో గద్వాల, మల్దకల్‌ ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్‌, రాజారెడ్డి, సర్పంచులు తిక్కన్న, వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి, నాయకులు అజయ్‌, తూం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

logo