మంగళవారం 19 జనవరి 2021
Gadwal - Dec 03, 2020 , 02:34:31

అపోహలొద్దు..

అపోహలొద్దు..

  • ఒక్కరోజులోనే కొనుగోళ్లు పూర్తి
  • ఏఈవోల టోకెన్లు తీసుకురావాలి 
  • అందుబాటులో సీసీఐ పత్తి కేంద్రాలు
  • పత్తికి ప్రభుత్వం మద్దతు ధర రూ.5,825

నడిగడ్డ : సీసీఐ కేంద్రాలకు పత్తి అమ్ముకునేందుకు తీసుకొస్తే రెండు, మూడు రోజులు సమయం పడుతుందని రైతులు అపోహాలు పెట్టుకుంటున్నారు. గతేడాది టోకెన్ల జారీలో జాప్యం జరగడం వల్ల సమస్యలు తలెత్తాయి. కానీ ఈఏడాది సీసీఐ కేంద్రాలకు పత్తి అమ్ముకొనేందుకు వచ్చిన రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు జారీ చేసే టోకెన్లు తీసుకొచ్చి ఒక్కరోజులోనే పత్తిని అమ్ముకొని వెళ్తున్నారు. ఈ విషయం తెలియక రైతులు చాలా మంది రాయిచూర్‌కు వెళ్లి తక్కువ ధరకు అమ్ముకొని వస్తున్నారు. సీసీఐ ద్వారా రైతులకు క్వింటాకు 8శాతం తేమ శాతం ఉంటే ప్రభుత్వం మద్దతు ధర రూ.5,825లు అందజేస్తుంది. కానీ రైతులు సీసీఐ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందనే అపోహతో రాయిచూర్‌కు తీసుకెళ్లి తక్కువ ధరకు అమ్మకుంటున్నారు. ఒక్కో క్వింటానికి రూ.300ల వరకు ఖర్చు పెట్టి అక్కడికి తీసుకొని వెళితే క్వింటాకు రూ.5000లోపే ధర లభిస్తుంది. ఈఏడాది మార్కెట్‌ కమిటి చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి రోజూ వచ్చిన పత్తిని రైతులు అమ్ముకొని వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సీసీఐ, మార్కెటింగ్‌ అధికారులను అప్రమత్తత చేస్తూ రైతులు పత్తిని అమ్ముకునేందుకు వీలు కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఉండవెల్లి చౌరస్తా వద్ద వినాయక జిన్నింగ్‌ మిల్లు, గద్వాలలోని కొండపల్లి చౌరస్తా వద్ద శ్రీబాలాజీ జిన్నింగ్‌ మిల్లు, శ్రీవెంకటేశ్వర జిన్నింగ్‌ మిల్లుల వద్ద పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. 

ఒక్కరోజులోనే పత్తిని అమ్ముకున్నాను 

నేను పండించిన పత్తిని అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చి ఒక్కరోజులోనే అమ్మి ఇంటికి వెళ్లాను. గతంలో సీసీఐ కేంద్రానికి పత్తిని అమ్మేందుకు వస్తే రెండు, మూడు రోజులు పట్టేది. ఈసారి చాలా సులభంగా పత్తిని అమ్మా ను. అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు.

- కుర్వ పద్మమ్మ, పాల్వాయి, మల్దకల్‌ మండలం

దళారులను నమ్మి మోసపోవద్దు

సీసీఐ కేంద్రానికి పత్తి అమ్ముకునేందుకు రెండు, మూడు రోజులు పడుతుందని రైతుల అపోహలు పెట్టుకోవద్దు. గతంలో టోకెన్ల జారీలో జాప్యం వల్ల జరిగి ఉండోచ్చు. కానీ ఈఏడాది ఏఈవోల ద్వారా ఎప్పటికప్పుడు టోకెన్లు జారీ చేస్తున్నాం. రైతులు విధిగా టోకెన్లు తీసుకున్న తర్వాతనే సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొచ్చి ఒక్కరోజులోనే అమ్ముకునే వీలు కల్పించాం. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అధికారులను అప్రమత్తత చేస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు పత్తిని అమ్ముకోవద్దు. 

-రామేశ్వరమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌, గద్వాల