శుక్రవారం 05 మార్చి 2021
Gadwal - Dec 03, 2020 , 02:34:29

అతివలకు చేయూత

అతివలకు చేయూత

  • కుట్టు,ఎంబ్రాయిడరీ, జూట్‌ బ్యాగుల తయారీ
  • రూ. 20లక్షలతో గద్వాలలో శిక్షణకేంద్రం 
  • అండగా నిలుస్తున్న ‘సమత సేవా సంఘం’

గద్వాల: పేద మహిళలకు,యువతులకు చేయూత నిచ్చేందుకు సమత సేవా సంఘం కృషి చేస్తున్నది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఎదగడానికి ఊతమిస్తున్నది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి పర్యవేక్షణలో సమత సేవా సంఘం ముందుకుసాగుతున్నది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటు అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల హామీ మేరకు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా గద్వాల నియోజకవర్గంలో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని నల్లకుంటలో సువిశాల భవనంలో మహిళలు,యువతులకు కుట్టు,ఎంబ్రాయిడరీ, మగ్గం పని, శానిటరీ న్యాప్‌కిన్స్‌, జూటు బ్యాగుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. 

రూ.20లక్షలతో శిక్షణకేంద్రం

మహిళలకు,యువతులకు చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో సమత సేవా సంఘానికి ఓ అద్ద్దె భవనాన్ని సమకూర్చి ఆ భవనానికి ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్నారు. అక్కడే మహిళలకు శిక్షణ ఇవ్వడానికి న్యాప్‌కిన్‌ తయారు చేసే మిషన్లు, మెటీరియల్‌ సమకూర్చారు. కుట్టులో శిక్షణ ఇవ్వడానికి 30కు పైగా కుట్టుమిషన్లు సమకూర్చారు. శిక్షణ ఇప్పించడానికి ట్రైనర్లను ఏర్పాటు చేసి వారికి నెలనెలా జీతాలు అందజేస్తున్నారు. ఈ సెంటర్‌కు ఇప్పటికీ సుమారు రూ.20లక్షల దాకా ఖర్చు చేశారు.

జూట్‌బ్యాగుల తయారీ

గద్వాల నియోజకవర్గాన్ని ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చాలనే ఉద్దేశంతో జూట్‌ బ్యాగుల తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని సరిత క్రియేషన్స్‌ వారిచే పద్మావతి అనే శిక్షకురాలు పర్యవేక్షణలో మహిళలకు జనపనారతో జూట్‌ బ్యాగుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. బ్యాగుల వినియోగం అనంతరం వాటిని రీసైక్లింగ్‌ చేసి పంటలకు ఎరువులు, డెకరేషన్‌ చేసుకోవడానికి వినియోగించవచ్చు. జూట్‌ బ్యాగ్‌ల శిక్షణలో 15మంది మహిళలు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. 

150మందికి శిక్షణ

శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి వివిధ విభాగాల్లో సుమారు 150మంది మహిళలకు కుట్టు మిషన్‌, శానిటరీ న్యాప్‌కిన్స్‌లో శిక్షణ ఇప్పించారు. కుట్టుమిషన్‌లో మొదటి బ్యాచ్‌లో 60మందికి, రెండో బ్యాచ్‌లో 50మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన మహిళలు,యువతులకు శిక్షణ కేంద్రంలోనే ఉపాధి చూయించారు. పాఠశాల విద్యార్థులకు ప్రతి ఏడాది ప్రభుత్వం దుస్తువులు అందించగా వాటిని ఇక్కడ శిక్షణ పొందినవారు కుడుతున్నారు. దుస్తువులు కుట్టినందుకు వారికి ఒక జతకు రూ.50 చెల్లిస్తున్నారు. 

మా కాళ్ల మీద నిలబడ్డాం

సమత సేవా సంఘంలో కుట్టు శిక్షణతో పాటు జూట్‌బ్యాగుల తయారీ ఉచితంగా నేర్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత ఎవరి మీద ఆధార పడకుండా మా కాళ్ల మీద నిలబడడానికి అవకాశం ఏర్పడింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా కుటుంబానికి కొంత ఆర్థికంగా చేయూతనిస్తున్నాం. శిక్షణ ఇప్పిస్తున్న ఎమ్మెల్యే దంపతులకు రుణపడి ఉంటాం.

- దేవమ్మ,ధరూరు

మార్కెటింగ్‌ చేయించేలా..

సరిత క్రియేషన్స్‌ హైదరాబాద్‌ నుంచి ఇక్కడి మహిళలకు జూట్‌బ్యాగుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి వచ్చా. ఇక్కడ శిక్షణ ఇచ్చి వాటిని ఎలా మార్కెటింగ్‌ చేయాలో చూయిస్తాం. ప్రస్తుత శిక్షణలో ప్రతి రోజు ఒక మహిళ ఒకటి లేదా రెండు జూట్‌ బ్యాగులు కుడుతున్నారు. వీటిని జనపనారతో తయారు చేస్తాం.

- పద్మావతి,జూట్‌ బ్యాగుల శిక్షకురాలు 

మహిళలకు చేయూత

మహిళలకు చేయూత నివ్వడానికి ఎమ్మెల్యే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. నేను పర్యవేక్షకురాలుగా ఉన్నాను. ఇక్కడ శిక్షణ పొందే మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తాం. ట్రైనర్లకు నెలనెలా జీతాలు చెల్లిస్తున్నారు. వీటితో పాటు మహిళలు నేర్చుకోవడానికి అవసరమైన అన్ని మిషన్లు ఏర్పాటు చేయించారు. 

- రాధమ్మ, సమత సేవా సంఘం ఇన్‌చార్జి 

ఆర్థికంగా ఎదగాలనే..

గతంలో ఇక్కడ పాలించిన వారంతా మహిళలను ఓటు బ్యాంకుగానే వినియోగించుకున్నారు. ఇక్కడి మహిళలకు చేయూత నివ్వాలనే ఉద్దేశంతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయించా. ఇక్కడ శిక్షణ పొందిన వారికి ఇక్కడే కొంతమందికి ఉపాధి చూయించాం. రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నాం.

- కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గద్వాల


VIDEOS

logo