గురువారం 28 జనవరి 2021
Gadwal - Dec 01, 2020 , 05:01:48

శివకేశవుల నామస్మరణతో పులకించిన కృష్ణాతీరం

శివకేశవుల నామస్మరణతో పులకించిన కృష్ణాతీరం

గద్వాలటౌన్‌ : కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం  జిల్లా కేంద్రం గద్వాలలోని కోటలోని ఆలయంతో పాటు ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. అభిషేకాలు, అర్చనలతో శివకేశవులను భక్తులు భక్తితో కొలిచారు. అలాగే జిల్లా కేంద్రం సమీపాన ఉన్న కృష్ణానది  తీరం తెలవారుజామున 4గంటల నుంచే భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి నదిలో వదిలారు.  అలాగే నదిఒడ్డున ఉన్న స్పటికలింగేశ్వరస్వామికి, కల్యాణ వేంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉసిరిచెట్టుకు, తులసికోటకు దీపార్చనలు చేసి పునీతులయ్యారు. 

భక్తిశ్రద్ధలతో తులసి, సత్యనారాయణస్వామి పూజలు

కార్తీక పౌర్ణమిని  పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో తులసి పూజలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక దామోదర వివాహన్ని ఘనంగా నిర్వహించారు. తులసి మాతకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి తమని చల్లంగా చూడాలని వేడుకున్నారు. ప్రత్యేక హారతులు ఇచ్చి తమ ఇష్టదైవాన్ని మహిళలు ప్రార్థించారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి స్వామిని వేడుకున్నారు. 

కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నది అగ్రహారంలోని ఆలయాలన్నింటిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పూర్ణ నదీ హారతి సేవా సంఘం ఆధ్వర్యంలో  కృష్ణమ్మకు నదీ హారతి నిర్వహించారు. అంతకుముందు గంగాపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు వాయనం సమర్పించారు. అనంతరం శివపా ర్వతులను పల్లకీపై ఊరేగించారు.

ఘనంగా కార్తీక పౌర్ణమి

కేటీదొడ్డి : మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం కార్తీకపౌర్ణమి సందర్భంగా ఆలయ్లాలో భక్తులు దీపాలు వెలిగించారు. కేటీదొడ్డిలో ఉన్న శివాలయం, మండలంలోని నందిన్నె గ్రామ శివాలయం, కొండాపురంలోని ఆంజనేయస్వామి, వెంకటాపురం గ్రామంలో వెలసిన లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. 

శివనామస్మరణతో మార్మోగిన బీచుపల్లి

ఎర్రవల్లి చౌరస్తా : కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమ వారం బీచుపల్లి పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మా ర్మోగింది. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. 

ఘనంగా లక్ష దీపోత్సవం

గట్టు : స్థానిక అంబాభవాని ఆలయం ఆవరణలో ఎస్‌ఎస్‌కే సమాజ్‌ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో అంబాభవాని అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా కార్తీక పౌర్ణమి

అయిజ రూరల్‌ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని సంకాపురం, బింగిదొడ్డి, తూంకుంట, కేశవరం, సిటిపాడు తదితర గ్రామాల్లోని భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు హాజరై పూజలు నిర్వహించారు. సంకాపురం గ్రామ సమీపంలో వెలసిన గాయత్రీ ఆంజనేయస్వామి, భవాని శంకర ఆలయాల్లో ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో శ్రీవిజయరాయ భజన మండలి సభ్యులు ఆలపించిన భక్తిగీతాలకు భక్తులు పరవశించిపోయారు. తదనంతరం కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు గ్రామానికి చెందిన రైతు మల్లయ్య ఆధ్వ ర్యంలో అన్నదానం చేశారు. 
logo