శుక్రవారం 22 జనవరి 2021
Gadwal - Nov 23, 2020 , 02:10:38

కొనసాగుతున్న కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

కొనసాగుతున్న కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

  • దాసంగాలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు

దేవరకద్ర రూరల్‌ : చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామ సమీపంలోని సప్తగిరులలోని కాంచన గుహలో కొలువుదీరిన వేంకటేశ్వరుని ప్రతిరూపమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా స్నానాలు ఆచరించి స్వామి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. మెట్టుమెట్టుకు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు దాసంగాలు సిద్ధం చేసి నైవేద్యాలు సమర్పించారు. కొంత మంది పిండితో దీపాలు తయారు చేసి గండజ్యోతిని తలపై పెట్టుకుని కొండపైకి చేరుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మాండ నాయకుడి దర్శనంతో పరవశించిపోయారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య శాఖ సిబ్బంది క్యూలైన్‌లో వస్తున్న భక్తులకు శానిటైజర్‌తోపాటు మాస్కులు అందించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 


logo