శుక్రవారం 22 జనవరి 2021
Gadwal - Nov 16, 2020 , 03:02:40

రూపాయికే కిక్‌

రూపాయికే కిక్‌

  • అభిమానం చాటుకున్న డైరెక్టర్‌ శంకర్‌ ఫ్యాన్‌

అయిజ : నాయకులు, హీరోల పుట్టిన రోజులకు అభిమానులు .. అన్నదానాలు, రక్తదానాలు, దవాఖానల్లో పాలు, పండ్లు, బ్రెడ్లు పంచడం సాధారణం. తన అభిమాన వ్యక్తి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడో .. వార్తల్లో నిలవాలనుకున్నాడో .. ఈ వీరాభిమాని మాత్రం తనకు ఇష్టమైన వ్యక్తి పెళ్లి రోజున అన్నింటికీ భిన్నంగా.. మరీ వినూత్నంగా.. మద్యం పంచాడు. ఫ్రీగా కాందండోయ్‌ .. రూపాయికి ఓ క్వాటర్‌ చొప్పున పంపిణీ చేశాడు. నవంబర్‌ 16న (సోమవారం) సినిమా డైరెక్టర్‌ శంకర్‌ పెళ్లిరోజు వేడుకను పురస్కరించుకొని ఆయన వీరాభిమాని, తెలంగాణ రాష్ట్ర సమితి రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ పట్టణంలో ఆదివారం ఒక్క రూపాయికి ఒక్క క్వాటర్‌ చొప్పున మద్యం పంచాడు.

ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఒక గంటపాటు కొనసాగించారు. విషయం తెలుసుకున్న మందు బాబులు పెద్దసంఖ్యలో వైన్‌ షాపు వద్దకు చేరుకున్నారు. పంపిణీకి గంట సమయం మాత్రమే కేటాయించడం వల్ల కొంత మందికి మాత్రమే ఆ అదృష్టం లభించింది. మందుబాబులకు ముందుగానే టోకెన్లు అందజేయడంతో భౌతిక దూరం పాటించి మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. ఆఫీసర్‌ చాయిస్‌ బ్రాండ్‌ 60 క్వాటర్‌ మద్యం బాటిళ్లు (విలువ రూ.8,340) పంపిణీ చేశారు. మందుబాబులు ఖుషీ, ఖుషీగా ఫీలయ్యారు. అనంతరం 200 మందికి అన్నదానం కూడా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శంకర్‌తో పరిచయం ఉందని విష్ణు పేర్కొన్నారు. logo