ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలిచేయాలి

- అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్పీ కృష్ణ
- రాజోళిలో పుష్కర ఘాట్ల పరిశీలన
రాజోళి : రానున్న తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు కల్పించే సౌకర్యాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్పీ కృష్ణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తుంగభద్ర నదీ తీరంలో పుష్కర ఘాట్లను, పుష్కర స్నానాలకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. పుష్కరాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి సర్పంచ్ వెంకటేశ్వరమ్మ పలు సమస్యలను అధికారులకు వివరించారు. పార్కింగ్ ప్రదేశం కోసం చదును చేసేందుకు పెద్ద మొత్తంలో కంపచెట్లను తొలగించి, మట్టిని తరలించి ప్రదేశాన్ని చదును చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రధానంగా శాంతినగర్ నుంచి రాజోళి రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని, కనీసం ఆ గుంతలకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి పుష్కర ఘాట్‌కు వెళ్లే రోడ్డుకు కొంత మరమ్మతులు అవసరమని తెలుపగా, అన్ని వివరాలను ఆర్డీవో రాములు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ ద్వారా పనులు మొదటుపెట్టాలని సూచించారు. వాహనాల రాకపోకలకు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ కృష్ణ సూచించారు. మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, మరుగుదొడ్లు ఏర్పాట్లకు సంబంధించి పనుల్లో వేగం పెంచాలన్నారు. పుష్కర స్నానాలు చేసే దగ్గర బారీ కేడ్లు ఏర్పాటు చేయాలని, నదిలోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో కృష్ణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసులు, తాసిల్దార్ వెంకటరమణ, ఉప సర్పంచ్ గోపాల్, ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.