శుక్రవారం 04 డిసెంబర్ 2020
Gadwal - Oct 30, 2020 , 02:04:34

నవంబర్‌ రెండో వారంలో పత్తి కొనుగోళ్లు

నవంబర్‌ రెండో వారంలో పత్తి కొనుగోళ్లు

  •  కలెక్టర్‌ శృతిఓఝా

గద్వాల: పత్తిపంటను  మద్దతు ధర రూ.5,825కు ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు నవంబర్‌ రెండో వారం నుంచి జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శృతిఓఝా మార్కెటింగ్‌, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పత్తిని మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి రాకుండా ఏ రైతు ఏ మిల్లుకు ఏ రోజున పత్తిని తీసుకెళ్లాలి అనేది వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ముందుగానే టోకెన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

గతేడాది రైతులు మిల్లుల వద్దకు వచ్చిన తర్వాత  వారికి టోకెన్లు ఇవ్వడం ద్వారా చాలా ఇబ్బందులకు వచ్చాయని అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా రైతుకు వారి ఇంటి వద్దనే వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా టోకెన్లు జారీ అయ్యే విధంగా చూడాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అంతకన్నా ముందుగా నవంబర్‌ రెండో తేదీన అందరూ వ్యవసాయవిస్తరణ అధికారులకు, మండల వ్యవసాయశాఖ అధికారులకు బాలభవన్‌లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఇందులో పత్తి నాణ్యతను ఏ విధంగా లెక్కించాలి ఎంత తేమ ఉన్న పత్తిని మిల్లుకు తీసుకెళ్లాలి అనే విషయాలపై శిక్షణ ఇచ్చి అనంతరం వారు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే విధంగా చూడాలన్నారు. మిల్లులకు తీసుకువచ్చిన పత్తిని తేమ ఎక్కువగా ఉందని సీసీఐ ద్వారా కొనుగోలుకు తిరస్కరణకు గురి అయితే రైతు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా పత్తి తరలింపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కోసం కరపత్రాలు, గోడపత్రికలు, బ్యానర్లు, టాంటాం వేయించి పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తగినన్ని తేమ కొలిచే పరికరాలు అందుబాటులో  ఉండే విధంగా చూడాలన్నారు. ప్రతి మిల్లులో అగ్నిప్రమాదం జరగకుండా చూడాలని ఒక వేళ జరిగితే వెంటనే అగ్నిమాపక చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్‌ మాట్లాడుతూ

ఈ వానకాలంలో జిల్లాలో 72వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారని, 2.2లక్షల క్వింటాళ్ల పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గద్వాలోని వెంకటేశ్వర జిన్నింగ్‌మిల్లుకు అయిజ, ఇటిక్యాల, మల్దకల్‌ మండల రైతులు, బాలాజీ జిన్నింగ్‌ మిల్లుకు గద్వాల, కేటీదొడ్డి, ధరూర్‌, గట్టు, రాజోళి మండలాలు కేటాయించినట్లు తెలపారు. అలంపూర్‌, మానవపాడు, వడ్డేపల్లి, ఉండవెళ్లి, అలంపూర్‌ మండలాలకు సిద్ధివినాయక జిన్నింగ్‌ మిల్లు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ అధికారిణి పుష్పమ్మ, సీసీఐ కమర్షియల్‌ అధికారి వెంగళరెడ్డి, ఫైర్‌ అధికారి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.