శనివారం 16 జనవరి 2021
Gadwal - Oct 27, 2020 , 01:42:23

ఘనంగా దసరా సంబురాలు

ఘనంగా దసరా సంబురాలు

పల్లకీపై ఊరేగిన లక్ష్మీనృసింహస్వామి

నదీహారతి సమర్పణ

గద్వాలటౌన్‌ : దసరా వేడుకలు జిల్లా కేంద్రంలో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని దుర్గాదేవిగా, ధనలక్ష్మి దేవిగా, సరస్వతీదేవిగా, అన్నపూర్ణేశ్వరిగా, మహిషాసురమర్ధినిగా,  బాలత్రిపురా సుందరిదేవి, అర్థనారీశ్వరిగా ఇలా వివిధ రూపాల అలంకరణల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో కొలిచారు. విజయదశమి పురస్కరించుకొని కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంతోపాటు అన్ని ప్రధానాలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తేరుమైదానం వద్ద గల గుంటి చెన్నకేశవస్వామి ఆలయంలో ఉన్న శమీ వృక్షానికి ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. 

పల్లకీపై ఊరేగిన లక్ష్మీ నృసింహుడు

దశమిని పురస్కరించుకుని అహోబిల లక్ష్మీనృసింహస్వామి పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద అగ్రహారంలోని ఆలయం నుంచి గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వరకు స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఊరేగించారు. అంబాభవాని అమ్మవారిని, కాళికాదేవి అమ్మవారిని ప్రత్యేక రథాలపై ఊరేగించారు.

కృష్ణమ్మకు హారతి సమర్పణ

విజయదశమిని పురస్కరించుకుని పూర్ణకృష్ణవేణి హారతి సేవా సంఘం ఆధ్వర్యంలో నదీ అగ్రహారంలోని నదితీరాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో భాగంగా కృష్ణమ్మ వాయనం సమర్పించి మహాహారతిని సమర్పించారు. అలాగే వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నదితీరాన కన్యపూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కాళ్లను కడిగి సత్కరించారు. 

మల్దకల్‌ మండలంలో..

మల్దకల్‌ : దసరా పండుగను ఆదివారం మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో  ప్రజలు  ఎంతో వైభవంగా  జరుపుకొన్నారు. మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలోని జమ్మిచెట్టుకు ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్వామి వారి ఉత్సహ విగ్రహాలను ఊరేగింపుగా పల్లకీ సేవలో సమీపంలోని దేవర గట్టుకు ఊరేగించారు. అనంతరం గ్రామ చావిడి దగ్గర ఆయుధ సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో  ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, అర్చకులు మధుసూదన్‌ చారి, రమేశ్‌ చారి, బాబురావు, నరేందర్‌, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.మండలంలోని పాల్వాయి గ్రామంలో సర్పంచ్‌ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ చావిడిలో  గల బొడ్రాయి వద్ద ఆయుదాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

పెద్ద చింతరేవులలో శమీ వృక్ష పూజలు..

ధరూర్‌ : దసరా పండుగను పురస్కరించుకుని మండలంలోని పెద్ద చింతరేవుల ఆంజనేయస్వామి గుడిలో శమీవృక్ష పూ జలు నిర్వహించారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగించి శమీవృక్షము వద్ద పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గిరిరావు, కార్యనిర్వహణాధికారి రామన్‌గౌడ్‌, ఆలయ అర్చకులు వామనాచార్యులు, మద్వాచార్యులు పాల్గొన్నారు.

ఊరూరా..దసరా సంబురాలు 

కేటీదొడ్డి : మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం, సోమవారం రెండు రోజులు ఊరూరా దసరా సంబురాలు ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు.  దుర్గమ్మ, జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆడపడచులు, చిన్నారులు, పెద్దలు చెమ్ముచెట్టు ఆకును తెచ్చి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. మండలంలోని వెంకటాపురంలో వెలిసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వార్లను ఉరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు జయమ్మ, మహాదేవి, మాధవి, ఆంజనేయులు, నాయకులు వెంకటేశ్‌గౌడ్‌, ఉరుకుందు, మహానందిరెడ్డి, గోవిందు, హన్మంతు పాల్గొన్నారు. 

ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు

అయిజ : దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 17వ తేదీ నుంచి పట్టణంలోని కాళికాదేవీ, అంబా భవాని, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో అమ్మవారు రోజుకో అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం కాళికాదేవీ నిజరూప దర్శనమివ్వగా, కన్యకాపరమేశ్వరి రాజ రాజేశ్వరిదేవీ, అంబా భవానీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం కాళికాదేవి పల్లకీలో పట్టణంలోని పుర వీధుల గుండా ఊరేగారు. 

జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

 అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో దసరా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం తెల్లవారు జామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయాల సమీపంలోని జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి జమ్మిఆకును తీసుకొచ్చి కుటుంబసభ్యులు, మిత్రులకుఅందించి ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. 

వైభవంగా కట్టకింద తిమ్మప్పస్వామి రథోత్సవం

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి కట్టకింద తిమ్మప్పస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉత్సవ మూర్తులు శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామికి చక్రస్నానంతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 

భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు 

వడ్డేపల్లి : మున్సిపాలిటీ కేంద్రంలో సీతారాముల ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి తొమ్మిది రోజులుగా పూజలు నిర్వహించి సోమవారం నిమజ్జనం నిర్వహించారు. ట్రాక్టర్‌పై ఊరేగింపు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో సమీపాన ఉన్న తుంగభద్రానదిలో నిమజ్జనం చేశారు. 

ఘనంగా విజయదశమి వేడుకలు

ఎర్రవల్లి చౌరస్తా : ఎర్రవల్లి చౌరస్తాలో విజయదశమి సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో బొల్లుగట్టు ఆంజనేయస్వామి శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర ఎర్రవల్లి ఆంజనేయస్వామి గుడి నుంచి పదోపటాలం గుట్టపైగల బిల్లుగట్టు ఆంజనేయస్వామి గుడి వరకు అంగరంగా వైభవంగా సాగింది. కార్యక్రమంలో హనుమాన్‌ యూత్‌ సభ్యులతో పాటు సర్పంచ్‌ రవి, కృష్ణ, పెద్ద లక్ష్మన్న, రవి, నరసింహ, రాజు, జమ్మన్న, సురేశ్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.

నిజరూప దర్శనంలో జమ్ములమ్మ అమ్మవారు..

గద్వాల రూరల్‌: మండలంలోని వివిధ గ్రామాల్లో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వగా ఆదివారం తన నిజరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రతి రోజు పంచామృత అభిషేకం, పుష్పలంకరణ, మహావేదంతోపాటు మంగళహారతి పల్లకీసేవను నిర్వహించారు. ఆదివారం విజయదశమి కావడంతో శమీపూజ నిర్వహించిన అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు సతీష్‌కుమార్‌ గాయత్రీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించి జమ్ములమ్మ రిజర్వాయర్‌ నీటిలోకి అమ్మవారిని విహరింపజేశారు. కార్యక్రమంలో ఈవో వీరేశం, మురళీధర్‌రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాశ్‌, సురేశ్‌, మద్దిలేటి, నాగరాజు, రాముడు, లక్ష్మన్న, రంగన్న, రవి  పాల్గొన్నారు.

ఇటిక్యాల మండలంలో..

ఇటిక్యాల : విజయదశమి పండుగ వేడుకలను మండలంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో గోపల్‌దిన్నె, పెద్దదిన్నె గ్రామాల్లో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి పల్లకీసేవ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మానవపాడు మండలంలో..

మానవపాడు : మండలంలోని ఆయా గ్రామాల్లో విజయదశమి సందర్భంగా ప్రజలు కొత్తబట్టలు ధరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఉండవెల్లి : మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. శమీవృక్షం దగ్గర ప్రత్యేక పూజలు చేసి జమ్మిఆకుతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని శేరుపల్లి గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని మహిళలు ఆదివారం రాత్రి బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. 

అయిజ మండలంలో..

అయిజ రూరల్‌  : విజయదశమిని పురస్కరించుకొని మండలంలోని సంకాపురం గ్రామంలో ఆదివారం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు బతుకమ్మను తయారుచేసి గ్రామంలో ఊరేగించి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుజాత,కేపీ వైష్ణవి మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

రాజోళి మండలంలో..

రాజోళి : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో దసరా పండుగను పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మిచెట్టును దర్శించి, పూజలు చేసి జమ్మిఆకుతో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.