బుధవారం 02 డిసెంబర్ 2020
Gadwal - Oct 23, 2020 , 04:31:17

ఆర్డీఎస్‌ దెబ్బతింటే పరిస్థితి ఏంటి..?

ఆర్డీఎస్‌ దెబ్బతింటే పరిస్థితి ఏంటి..?

  • మొదటి ప్యాకేజీ పనులు ఏపీ సర్కార్‌ తీరు వల్లే పెండింగ్‌
  • తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌
  • ఆధునికీకరణ పనుల పూర్తికి సహకరించండి
  • ఏపీ అధికారులకు తుంగభద్ర బోర్డు చైర్మన్‌ రంగారెడ్డి సూచన
  • నౌలీ రిజర్వాయర్‌పై చర్చించాలన్న ఇంజినీర్లు టీబీ బోర్డు సమావేశం

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : అలంపూర్‌ నియోజకవర్గానికి వరప్రదాయని అయిన ఆర్డీఎస్‌ ఆనకట్ట (రాజోళిబండ డైవర్సన్‌ స్కీం) భారీ వరదలకు దెబ్బతింటే పరిస్థితి ఏంటని ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌సీ నారాయణరెడ్డిని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ప్రశ్నించారు. గురువారం చైర్మన్‌ రంగారెడ్డి, కార్యదర్శి నాగమోహన్‌ అధ్యక్షతన సిస్కో యాప్‌ ద్వారా తెలంగాణ, ఏపీ, కర్ణాటక అధికారులతో తుంగభద్ర బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్‌ నారాయణరెడ్డిపై ఘాటుగా స్పందించారు. మురళీధర్‌ మాట్లాడుతూ నిజాం కాలంలో నిర్మించిన ఆర్డీఎస్‌ ఆనకట్టను ఆధునికీకరణ చేయకపోవడంతో పెచ్చులూడి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దీంతో అలంపూర్‌ నియోజకవర్గంలోని 87,500 ఎకరాల ఆయకట్టు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

2007లోనే ఆర్డీఎస్‌ ఆనకట్ట పటిష్టతకు అప్పటి సర్కారు నిధులు విడుదల చేసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆర్డీఎస్‌ ఆధునికీకరణ పనులు పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా సహకరించి కర్ణాటక ప్రభుత్వం వద్ద నిధులు సిద్ధంగా ఉంచారని తెలిపారు. అయినా ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆర్డీఎస్‌ మొదటి ప్యాకేజీ పనులు చేపట్టకుండా ఏపీ అధికారులు అడ్డుతగలడం వల్లే కర్ణాటక అధికారులు పనులు చేయించలేకపోతున్నారని బోర్డు చైర్మన్‌ రంగారెడ్డి, కార్యదర్శి నాగమోహన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 87,500 ఎకరాలకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ.. ఆనకట్ట పటిష్టపర్చకపోవడంతో సాగునీరు పుష్కలంగా అందించలేకపోతున్నామన్నారు. ఏపీ సర్కార్‌ సహకరిస్తే కర్ణాటక అధికారులు ఆర్డీఎస్‌ మొదటి ప్యాకేజీ పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉందని వివరించారు. ఆనకట్టను పటిష్టపరిస్తే ఏపీకి నీళ్లు రావని అపోహ పడుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులకు ఇంజినీర్లు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహన లేని రైతులు నాయకుల మాటలు విని పనులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ఆర్డీఎస్‌ ఆధునికీకరణ పనులకు ఏపీ సహకరిస్తే పూర్తి చేసేందుకు కర్ణాటక చర్యలు తీసుకుంటుందని బోర్డు చైర్మన్‌ తెలిపారు. ఏపీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆధునికీకరణ పనులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఏపీ అధికారులకు సూచించారు. తుంగభద్ర జలాశయం ఎగువ భాగాన నిర్మించనున్న నౌలీ రిజర్వాయర్‌పై సుదీర్ఘంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ, ఏపీ అధికారులు బోర్డుకు తెలిపాయి. తుంగభద్ర జలాశయంలో పూడిక నిండుకున్నదని, కర్ణాటక ప్రభుత్వం కొత్తగా 40 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌తోపాటు భారీగా కాలువ నిర్మాణం చేపట్టాలని సంకల్పిస్తుండటంతో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు తమ అభిప్రాయాలను వెల్లడించాయని ఆర్డీఎస్‌ ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. పెబ్బేర్‌లోని భీమా సర్కిల్‌ కార్యాలయంలో సీఈ అంజయ్య, పీజేపీ ఎస్‌ఈ రఘునాథరావు, ఆర్డీఎస్‌ ఆంజనేయులు, టెక్నికల్‌ అధికారి భాస్కర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.