శనివారం 05 డిసెంబర్ 2020
Gadwal - Oct 20, 2020 , 01:38:04

కాసుల 'బంతి'

కాసుల 'బంతి'

  • పండుగ సమయాల్లో మంచిధర
  • కిలో రూ.50 నుంచి రూ.100
  • పెట్టుబడి తక్కువ ఉండడంతో రైతన్న దృష్టి 

తిమ్మాజిపేట : సంప్రదాయ, వాణిజ్య పంటల సాగుతో కొన్ని సందర్భాల్లో నష్టాలు చవిచూస్తున్న రైతులు ప్రత్యామ్మాయం వైపు దృష్టి సారిస్తున్నారు. స్వల్ప కాలంలో మంచి లాభాలు ఉండే కూరగాయలు, పూల సాగుపై మొగ్గు చూపుతున్నారు. బంతిపూల సాగు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నది. బంతి పూలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉండడంతో రైతులకు కాసులు కురిపిస్తున్నది. బతుకమ్మ, దసరా, దీపావళి పండగలు నెల వ్యవధిలో ఉండడంతో రైతులు అందుకు అనుగుణంగా సాగుచేస్తున్నారు. తిమ్మాజిపేట మండలంలో బంతిసాగు పెరిగింది. మొదట ఒకటి, రెండు గ్రామాల్లో మాత్రమే సాగు చేసిన రైతన్నలు.. ప్రస్తుతం తిమ్మాజిపేట, మరికల్‌, గుమ్మకొండ, మారేపల్లి, కొడుపర్తి, గొరిట తదితర గ్రామాల్లో బంతిసాగు చేపట్టారు. కేవలం 70 రోజుల్లోనే చేతికి వస్తుండడంతోపాటు పెట్టుబడి ఎక్కువగా అవసరం లేదని రైతులు పేర్కొంటున్నారు. కేవలం విత్తనాల కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి వస్తుందని, మిగిలిన ఖర్చులు పెద్దగా ఉండవని చెబుతున్నారు.

కాకపోతే విత్తనాలు స్థానికంగా లేకపోవడంతో హైదరాబాద్‌, శంషాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని రైతులు తెలిపారు. కొద్దిపాటి నీరు ఉన్నా సాగుచేయొచ్చని, కూలీల ఖర్చు కూడా ఉండదన్నారు. ఎకరాకు 5 నుంచి 10 క్వింటాళ్ల వరకు ది గుబడి ఉంటుంది. పంటకాలంలో మూడు సార్లు పూలు తెంపొచ్చు. మార్కెట్‌లో కి లో రూ.50 నుంచి రూ.100 వర కు ధర పలుకుతుండడంతో రై తులకు రెండున్నర నెలల వ్య వధిలో మంచి లాభాలొస్తున్నాయి. అంతేకాకుండా మండలానికి దగ్గర్లో జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ వంటి పట్టణాలు ఉండటంలో మార్కెట్‌ ఇబ్బందులు కూడా లేవు. దీంతో రై తులు సులువుగా పూలను విక్రయిస్తున్నారు. 

‘బంతి..కనువిందు’


అయిజ పట్టణానికి సమీపంలోని రాయచూర్‌ రహదారిలో ఓ రైతు తోటలో ముద్ద బంతిపూలు విరగబూశాయి. పసుపు, లేత గులాబీ రంగు బంతిపూలు ఆ దారి వెంట వెళ్లేవారిని కనువిందు చేస్తున్నాయి.                     

- అయిజ