గురువారం 26 నవంబర్ 2020
Gadwal - Oct 20, 2020 , 01:38:04

వేగం తగ్గించండి

వేగం తగ్గించండి

  • ఏం కాదులే అనుకుంటే పొరపాటే
  • లేజర్‌గన్‌తో వేగానికి కళ్లెం
  • రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి
  • వాహనదారులకు ఎప్పటికప్పుడు పోలీసుల కౌన్సెలింగ్‌

హైవే బాగుంది..! ఇక్కడెవరు చూస్తారులే..! అని ఎక్స్‌లేటర్‌ పెంచుతున్నారా..! ఒకవేళ చూసినా ఇంత స్పీడ్‌లో ఎవరు పట్టుకుంటారులే అనుకుంటున్నారా..! అలాంటి భ్రమలు పెట్టుకోకండి.. మీరు మెరుపు వేగంతో కనిపించనంత దూరం వెళ్లినా స్పీడ్‌ లేజర్‌గన్‌ క్యాప్చర్‌ చేస్తుంది. మీరు వెళ్లే రోడ్డుపై ఎప్పటికప్పుడు మిమ్మల్నే గమనిస్తూ పోలీస్‌లు అలర్ట్‌గా ఉంటారు. స్పీడ్‌ తగ్గిస్తే మంచిది. లేకపోతే చలానా తప్పదు..!

- గద్వాల అర్బన్‌

చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వీటిలో అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతున్నది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్న వారిని బ్రీత్‌ అనలైజర్‌తో కొంతవరకు అదుపు చేస్తున్నారు. కానీ కార్లతో పాటు డీసీఎం, లారీలు, ఇతర పెద్ద వాహనాలు అతివేగంగా వెళ్లి ప్రమాదానికి గురైనప్పుడు ఇద్దరు, ముగ్గురు బలికావడమో లేదా అంగవైకల్యానికి గురవ్వడమో జరుగుతున్నది. వేగానికి కళ్లెం వేసేందుకు జాతీయ రహదారులపై అక్కడక్కడా వాహనాల వేగాన్ని తెలియచేసే ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా మార్పు రావడం లేదు. దీంతో వేగాన్ని నియంత్రించేందుకు లేజర్‌ స్పీడ్‌గన్స్‌ ఉపయోగిస్తున్నారు. నిత్యం ఒక పోలీసు ఉద్యోగి హైవేపై వాహనాల వేగాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు క్యాప్చర్‌ చేస్తుంటారు. గరిష్ట వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే వాహనానికి రూ.1,035 ఫైన్‌ వేస్తున్నారు. స్పీడ్‌గన్‌తో క్యాప్చర్‌ చేసిన వెంటనే సంబంధిత వాహనదారుడి మొబైల్‌కు మెస్సేజ్‌ వెళ్తుంది. స్పీడ్‌ లేజర్‌ గన్‌ ఏర్పాటు చేసిన తర్వాత హైవేపై రోడ్డు ప్రమాదాలు 60 నుంచి 70 శాతం తగ్గాయని పోలీసులు చెబుతున్నారు. పోలీస్‌ శాఖ ప్రతి రోజు రూ.70 వేల నుంచి రూ.లక్షకు పైగా ఫై న్లు విధిస్తున్నది. ఈ క్రమంలో నెలకు దాదాపుగా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఫైన్ల రూపంలో ఆదాయం సమకూరుతున్నది. 

మూడు సార్లు ఫైన్‌ పడితే..


అతివేగంగా ప్రయాణిస్తూ మూడు సార్లు ఫైన్‌ పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంట్లో మన కోసం ఎదురుచూసే కుటుంబం ఒకటుందని గుర్తుపెట్టుకోవాలి. వారికి కష్టాలు, కన్నీళ్లు మిగొల్చొద్దు. స్పీడ్‌ కంట్రోల్‌ చేయాలనే ఉద్దేశంతో లేజర్‌ గన్స్‌ పెట్టాం. వాహనదారులు క్షేమంగా గమ్యం చేరుకోవాలన్నదే మా లక్ష్యం. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి మాకు సహకరించండి.

- జె.రంజన్‌ రతన్‌కుమార్‌, ఎస్పీ, జోగుళాంబ గద్వాల