బుధవారం 21 అక్టోబర్ 2020
Gadwal - Oct 01, 2020 , 00:49:13

అంగన్‌వాడీల సేవలు అభినందనీయం

అంగన్‌వాడీల సేవలు అభినందనీయం

  • కలెక్టర్‌ శృతిఓఝా

గద్వాల : దేశానికి ఆరోగ్యవంతులైనా యువతను అందించడానికి అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు చేస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్‌ శృతిఓఝా వారి సేవలను కొనియాడారు. బుధవారం కలెక్టరేట్‌ చాంబర్‌లో 2018-19లో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో విశేషంగా కృషి చేసిన 15మందిని కలెక్టర్‌ ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఇందులో ముగ్గురు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, ఐసీడీఎస్‌ మహిళా సూపర్‌వైజర్లు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు మాతా శిశువులు ఆరోగ్యంగా ఉండడం వల్ల శిశుమరణాలు పూర్తిగా తగ్గించవచ్చన్నారు. ఇందుకు అంగన్‌వాడీ, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు గర్భిణుల ఆరోగ్యంపై నిరంతరం సూచనలు ఇస్తూ పౌష్టికాహారం అందించేందుకు కృషి చేయాలన్నారు.

పిల్లలు పుట్టాక వారి పెరుగుదలపై  ప్రతి నెలా పర్యవేక్షణ చేసి రక్తహీనత, అనారోగ్యంతో బాధపడే పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న బాలామృతం, గుడ్డు, పాలు వంటి సరైన పౌష్టికాహారం అందిస్తూ అవసరమైతే వైద్య చికిత్సలు చేయించాలని అన్నారు. జిల్లాలో ఏ ఒక్కరూ రక్తహీనతతో బాధపడకుండా చూడాల్సిన బాధ్యత అంగన్‌వాడీ, ఆశవర్కర్లపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి ముసాయిదాబేగం, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికళ, ఉత్తమ సేవలు అందించిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, సీడీపీవోలు  తదితరులు పాల్గొన్నారు.


logo