మంగళవారం 27 అక్టోబర్ 2020
Gadwal - Oct 01, 2020 , 00:49:11

ఆగ్రో దుకాణంపై దాడులు

ఆగ్రో దుకాణంపై దాడులు

  • 10 రకాల బయోఉత్పత్తులు స్వాధీనం  చేసుకున్న‌రంగారెడ్డి జిల్లా నందిగామ పోలీసులు 
  • పట్టుబడిన గద్వాల వాసి

గద్వాల: సస్యరక్షణ చర్యలు చేపడుతూ రైతులు పంటలను కాపాడుకుంటుంటే రైతుల అమాయకత్వానికి ఆసరాగా చేసుకుని కొంతమంది ఫెస్టిసైడ్‌ దుకాణదారులు రైతులకు అనధికార బయోఉత్పత్తులను విక్రయించి రైతులు రోడ్డున పడటానికి కారణమవుతున్నారు. నాలుగేండ్ల కిందట గద్వాల పట్టణంలో రసాయనాలు కలిపి బయో ఉత్పత్తులు తయారు చేస్తున్న ఇంటిపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు ఇప్పటికీ ఏమైందో తెలియదు. దీంతో ఇష్టారాజ్యంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. గతేడాది జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల, మందుల దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి అనుమతి లేని బయో ఉత్పత్తులు గుర్తించి కేసులు నమోదు చేసి వదిలేశారు. అధికారులు కేసులతో సరిపెడుతుండడంతో బయోఉత్పత్తుల్లో రసాయనాలు కలిపి రైతులకు వ్యాపారులు విక్రయిస్తూనే ఉన్నారు. 

పట్టుబడిన గద్వాల వాసి

ధరూర్‌ మండలం మార్లబీడుకు చెందిన ఓ వ్యక్తికి జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌ చౌరస్తాలో ఓ ఆగ్రో ఏజన్సీ ఉంది. ఆ వ్యక్తి రంగారెడ్డి జిల్లా నందిగామ పరిధిలో అయ్యప్పస్వామి ఆలయ సమీపాన లక్ష్మీనర్సింహ క్రాప్స్‌ పేరుతో అనధికార బయో వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు నందిగామ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ బయోఉత్పత్తుల్లో రసాయనాలు కలుపుతున్న విషయాన్ని అక్కడి పోలీసులతోపాటు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి గోదాంపై దాడి చేశారు. గోదాం పర్యవేక్షకుడు జయవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయవర్ధన్‌ ఇచ్చిన సమాచారం మేరకు తనకు గద్వాలలో ఓ ఆగ్రో ఏజన్సీ ఉందని చెప్పడంతో మంగళవారం నందిగామ పోలీసులు, గద్వాల పట్టణ పోలీసులు, వ్యవసాయశాఖ అధికారి సహకారంతో ఆగ్రో దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో సుమారు 10రకాల బయోఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి జిల్లా కేంద్రంలో అనధికార బయోఉత్పత్తుల వ్యవహారం బయటకు పొక్కడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

బయో అంటే..

బయోమందులు అంటే ఎలాంటి రసాయనాలు లేకుం డా ఉత్పత్తులు తయారు చేయాల్సి ఉంటుంది. వీటిని ఫెస్టిసైడ్‌ దుకాణాల్లో విక్రయించాలంటే తప్పనిసరిగా కోర్టు, వ్యవసాయశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ, ఇక్కడి వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంవల్ల కొంతమంది వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా, పాత కోర్టు అనుమతులు చూపిస్తూ మరికొందరూ జిల్లాలో బయోమందులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. 

పట్టించుకోని అధికారులు

వాస్తవంగా పంటల సీజన్‌ మొదలైనప్పటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు దుకాణాలను తనిఖీ చేసి శాంపిల్స్‌ సేకరించాలి. అయితే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం మొక్కుబడిగా శాంపిల్స్‌ సేకరించడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వ్యవసాయశాఖ అధికారులు రెండు లేదా మూడు దుకాణాలు తనిఖీ చేసి శాంపిల్స్‌ సేకరించాల్సి ఉన్నా అలా చేయడం లేదనే అరోపణలు ఉన్నాయి. విజిలెన్స్‌, ఇతర అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రమే ఈ వ్యవహారాలు బయటకొస్తున్నాయి. స్థానిక అధికారులు చేస్తే మాత్రం బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికైనా వ్యవసాయశాఖ అధికారులు అనధికార బయోఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు కోరుతున్నారు.

బయో ఉత్పత్తులు తమ పరిధిలోకి రావు

 రంగారెడ్డి జిల్లా నందిగామ పోలీసులు అక్కడ బయో మందుల్లో రసాయనాలు కలుపుతుండగా గోదాంపై దాడి చేసి వాటిని అక్కడ సీజ్‌ చేశారు. అక్కడ ఉత్పత్తి చేసే వ్యక్తికి గద్వాలలో ఆగ్రో దుకాణం ఉండడంతో అక్కడి పోలీసులు గద్వాల పోలీసులు, తమ సహకారంతో దుకాణం లో తనిఖీ నిర్వహించారు. గద్వాలలోని దుకాణంలో బయో మందులు సీజ్‌ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన బయోమందులు ల్యాబ్‌లో పరీక్షిస్తారు.

-  సుచరిత, ఏవో, గద్వాల


logo