బుధవారం 21 అక్టోబర్ 2020
Gadwal - Oct 01, 2020 , 00:31:49

వరద హోరు.. కృష్ణమ్మ జోరు

వరద హోరు.. కృష్ణమ్మ జోరు

  •  ప్రియదర్శిని జూరాల 14 గేట్లు ఎత్తివేత
  • ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలకూ కొనసాగుతున్న  వరద
  •  శ్రీశైలం డ్యాం 4గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: జూరాలకు భారీ వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌లో 14గేట్లను ఎత్తి దిగువకు 98,896 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఇన్‌ఫ్లో 1,15,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,29,718 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులుండగా ప్రస్తుతం 1043.799అడుగులతో పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 8.909టీఎంసీలుగా పూర్తిస్థాయిలో నీరు చేరుకుంది. పవర్‌హౌస్‌కు 29,896 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. ఇన్‌ఫో 38,922క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 38,922 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1704.72 అడుగులకు చేరింది. సామర్థ్యం 128.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 54,503 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 54,940 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1614.63అడుగులకు చేరింది. సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 37.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

తుంగభద్రకు స్వల్పంగా వరద

అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద స్వల్పంగా కొనసాగుతున్నది. ఎగువన ఉన్న తుంగ జలాశయం ద్వారా 5,650 క్యూసెక్కులు చేరుతుంది. బుధవారం ఇన్‌ఫ్లో 14,801 క్యూసెక్కులు నమోదుకాగా, అవుట్‌ఫ్లో 14,561 క్యూసెక్కులు ఉంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి అదే స్థాయిలో నీటి మట్టం నిల్వ ఉంచుతున్నట్లు తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు .. 

కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద కొనసాగుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు వాగులు, వంకల ద్వారా ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద నీరు చేరుతోంది. బుధవారం ఆర్డీఎస్‌ ఆనకట్టకు 39,036 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా, 38,400 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 636 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 10.6 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.  

4గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

శ్రీశైలం : ఎగువ నుంచి  వరద నీటి ఉధృతి కొనసాగుతూ శ్రీశైలానికి చేరుకోవడంతో జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో బుధవారం డ్యాం నాలుగు గేట్లను పది అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 1,26,592 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 16,544 క్యూసెక్కుల (మొత్తం 1,43,136 క్యూసెక్కులు )నీరు శ్రీశైలానికి విడుదల చేయగా సాయంత్రం ఆరు గంటల వరకు 1,50,536 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తులో తెరచి 1,11,564 క్యుసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 30,694 క్యూసెక్కుల (మొత్తం 1,42,258 క్యూసెక్కులు ) వరద నీటిని దిగువన ఉన్న సాగర్‌ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఏపీ పవర్‌ హౌజ్‌ ద్వారా 29,678 క్యూసెక్కుల నీటిని వినియోగించి 14.430 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు సీఈ నర్సింహారావు తెలిపారు. 



logo