మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Sep 28, 2020 , 05:56:44

మహోగ్రరూపం

మహోగ్రరూపం

  • కృష్ణమ్మకు భారీగా వరద
  • నిండుకుండల్లా ప్రాజెక్టులు
  • జూరాల ప్రాజెక్టు 44 గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్ల ద్వారా నీటి విడుదల 
  • నారాయణపూర్‌, ఆల్మట్టి, టీబీ డ్యాంలకూ వరద

  కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని దాల్చింది. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతున్నది. దీంతో అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వరద వస్తుండటంతో ఆదివారం జూరాల 44 గేట్లు, శ్రీశైలం 10 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్‌, టీబీ డ్యాంలకూ వరద కొనసాగుతున్నది. 

- నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నది ఉప్పొంగుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో ఈ సీజన్‌లో తొలిసారిగా అధికారులు ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తి దిగువకు 4,20,243 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 4,27,800 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 4,34,147 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులకుగానూ 1043.176 అడుగులకు చేరింది. సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 8.531 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పవర్‌హౌస్‌కు 13,447 క్యూసెక్కులు విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాల్వలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కూ వరద కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 68,044 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 82,255 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ 1704.46 అడుగులకు చేరింది. సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా 126.74 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 1,27,088 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,45,032 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ 1613.39 అడుగులకు చేరింది. సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 35.64 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

తుంగభద్రకు స్థిరంగా వరద

అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతున్నది. తుంగ జలాశయం ద్వారా 7,819 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా.. ఆదివారం టీబీ డ్యాం గేట్లను అధికారులు మూసివేశారు. ఇన్‌ఫ్లో 12,668 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 12,668 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతున్నది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో 100.855 టీఎంసీలు నిల్వ ఉండగా.. 1633 అడుగుల నీటిమట్టానికిగానూ అదే స్థాయిలో నీటిమట్టం నిల్వ ఉన్నట్లు ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు..

కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద భారీగా కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో వాగులు, వంకలతోపాటు టీబీ డ్యాం నుంచి వరద వచ్చి చేరుతున్నది. దీంతో ఇన్‌ఫ్లో 83,016 క్యూసెక్కులు నమోదు కాగా.. 82,400 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువకు పారిందని ఈఈ రామయ్య తెలిపారు. ఆయకట్టుకు 618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 12.3 అడుగుల నీటిమట్టం ఉన్నదని తెలిపారు. 

సుంకేసులకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో

రాజోళి: సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం పెరిగింది. ఆదివారం ఎగువ నుంచి 96వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 14 గేట్లు తెరిచిన అధికారులు 95వేల క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలం డ్యాంకు వదిలి, వెయ్యి క్యూసెక్కులను కేసీ కెనాల్‌కు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

VIDEOS

logo