గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Sep 26, 2020 , 01:19:21

ఓ వైపు తుంగభద్ర మరోవైపు కృష్ణ

ఓ వైపు తుంగభద్ర మరోవైపు కృష్ణ

  • పరవళ్లు తొక్కుతున్న నదులు 
  •  జూరాల ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత 
  • ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలకూ వరద 

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : ఓ వైపు తుంగభద్ర, మరో వైపు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులు నీటితో తొణికిసలాడుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 80,600 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 76,807 క్యూసెక్కులు నమోదయ్యాయి. దీంతో ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు 40,094 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా 1044.521 అడుగులకు చేరింది. సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 9.537 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పవర్‌ హౌస్‌కు 34,757 క్యూసెక్కులు విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. అలాగే కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 46,005 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 46,005 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1704.72 అడుగులకు చేరింది. సామర్థ్యం 128.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 43,467 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 41,666 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రా జెక్ట్‌ పూర్తిస్థా యి నీటిమట్టం 1615 అడుగులకుగానూ 1614.76 అడుగులకు చేరింది. సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 37.46 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

టీబీ డ్యాం 12 గేట్లు ఎత్తివేత

అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. దీంతో డ్యాం 12 క్రస్ట్‌ గేట్లు ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగ జలాశయం ద్వారా 12,476 క్యూసెక్కులు విడుదల అవుతుండగా.. ఇన్‌ఫ్లో 48,390 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 38,638 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతున్నది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1633 అడుగుల నీటిమట్టానికిగానూ పూర్తి స్థాయి నీటిమట్టం నమోదైనట్లు ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు..

ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. టీబీ డ్యాం గేట్లు ఎత్తడంతో ఆనకట్టకు 41,318 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 40,700 క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తున్నాయి. ఆయకట్టుకు 618 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.7 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. 

సుంకేసులకు ఇన్‌ఫ్లో

రాజోళి : సుంకేసుల బ్యా రేజీకి 28 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో శుక్రవారం 6 గేట్లను తెరిచిన అధికారులు 25,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశామని జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేసీ కెనాల్‌కు 2500 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 

శ్రీశైలానికి వరద

శ్రీశైలం : శ్రీశైల జలాశయానికి వరద కొనసాగుతున్నది. శుక్రవారం మూడు క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరిచి దిగువనున్న సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 83,811 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 30,939 క్యూసెక్కులు కలపుకొని మొత్తం 1,14,750 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం వైపు 1,09,090 క్యూసెక్కులు విడుదల చేయగా.. ఇన్‌ఫ్లో 1,18,326 క్యూసెక్కులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 884.70 అడుగులకు చేరగా.. సామర్థ్యం 215.80 టీఎంసీలు ఉండగా.. 213.8824 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 


VIDEOS

logo