బుధవారం 28 అక్టోబర్ 2020
Gadwal - Sep 22, 2020 , 01:17:12

జూరాల @ 23

జూరాల @ 23

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : జూరాలకు వదర భారీగా కొనసాగుతుంది. జూరాలలో ఇన్‌ఫ్లో 1,74,430 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,00,072 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌లో 23గేట్లను ఎత్తి నదిలోకి 1,74,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులుండగా ప్రస్తుతం 1043.50 అడుగులతో పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 8.730టీఎంసీలుగా పూర్తిస్థాయిలో నీరు చేరుకుంది. పవర్‌హౌస్‌కు 25,326 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు కొనసాగుతుంది. ఇన్‌ఫో 52,314క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 55,172 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1704.69 అడుగులకు చేరింది. సామర్థ్యం 128.72 టీఎంసీలు ఉండగా 128.01 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 57,799, అవుట్‌ఫ్లో 57,685 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1614.60అడుగులకు చేరింది. 

టీబీ డ్యాంకు భారీగా వరద

అయిజ: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద భారీగా చేరుతున్నది. రెండు రోజులుగా ఎగువన వర్షాలు పడుతుండటంతో వరద నీరు టీబీ డ్యాంలోకి చేరుతున్నది. ఎగువన ఉన్న తుంగ జలాశయం ద్వారా 37,801, భద్ర జలాశయం ద్వారా 50వేల క్యూసెక్కుల వరద నీరు టీబీలోకి చేరుతుంది. దీంతో సోమవారం తెల్లవారు జామున 28 క్రస్ట్‌ గేట్లు ఎత్తి తుంగభద్ర నదిలోకి లక్ష 10 వేల 445 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. సాయంత్రం ఇన్‌ఫ్లో తగ్గడంతో 28 గేట్లను ఎత్తి 86,979 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 87,801 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 86,979 క్యూసెక్కులు ఉంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు 8,290 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతోంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 97.008 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1632.00 అడుగులు ఉన్నట్లు తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు పోటెత్తిన వరద 

కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన విస్తారంగా కరుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతోపాటు టీబీ డ్యాం 30గేట్లు ఎత్తి లక్ష 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడంతో ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద నీరు భారీగా చేరుతున్నది. సోమవారం ఆర్డీఎస్‌ ఆనకట్టకు 53,270 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా, 53వేల క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 11.2 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. 

సుంకేసులకు 27వేల క్యూసెక్కులు

రాజోళి: సుంకేసుల బ్యారేజీకి సోమవారం ఇన్‌ఫ్లో ఎగువ నుంచి 27వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..7 గేట్లను తెరచిన అధికారులు 26వేల క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేసి కేసీ కెనాల్‌కు 1000 క్యూసెక్కులు విడుదల చేసిన్నట్లు జేఈ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

శ్రీశైలానికి వరద ఉధృతి

శ్రీశైలం: శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి రెండు లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో సోమవారం రాత్రి డ్యాం పది గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,15,076 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 26,341 క్యూసెక్కులు, హంద్రి నుంచి 1,125క్యూసెక్కుల ( మొత్తం 2,42,542 క్యూసెక్కులు) నీరు శ్రీశైలానికి విడుదల చేయగా 3,10,331 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా పది గేట్లను పది అడుగుల మేర ఎత్తులో తెరచి 2,78,000 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 26,739 క్యూసెక్కుల (మొత్తం 3,04,739 క్యూసెక్కులు ) వరద నీటిని దిగువన ఉన్న సాగర్‌ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఏపీ పవర్‌ హౌస్‌ ద్వారా 26,449 క్యూసెక్కుల నీటిని వినియోగించి 13.076 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు సీఈ నర్సింహారావు తెలిపారు. 


logo