సోమవారం 30 నవంబర్ 2020
Gadwal - Sep 20, 2020 , 02:52:27

పోటెత్తిన నదులు

పోటెత్తిన నదులు

  • తుంగభద్ర, కృష్ణానదికి  కొనసాగుతున్న వరద
  • జూరాల ప్రాజెక్టు 25 గేట్లు, శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత 
  • ఆల్మట్టి, నారాయణపూర్‌, టీబీ డ్యాంలకూ  ఇన్‌ఫ్లో 

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. దీంతో అన్ని డ్యాంలు నీటితో తొణికిసలాడుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,01,800 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,95,539 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో శనివారం ప్రాజెక్ట్‌లో 25 గేట్లను ఎత్తి నదిలోకి 1,73,373 క్యూసెక్కులు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులకుగానూ 1043.734 అడుగులకు చేరింది. సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 8.869 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పవర్‌హౌస్‌కు 21,873 క్యూసెక్కులు విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫో 29,713 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 29,713 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ 1704.72 అడుగులకు చేరింది. సామర్థ్యం 128.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 36,742 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 34,441 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ 1614.70 అడుగులకు చేరింది. సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 37.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

టీబీ డ్యాంకు స్వల్పంగా..

అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. తుంగ జలాశయం ద్వారా 6,761 క్యూసెక్కులతోపాటు నదితీర ప్రాంతాల నుంచి 15,777 క్యూసెక్కులు టీబీలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఇన్‌ఫ్లో 15,777 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 15,537 క్యూసెక్కులుగా నమోదైంది. ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీలు నిల్వ ఉండగా.. 1633 అడుగుల నీటిమట్టానికిగానూ 1633.00 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు.

ఆర్డీఎస్‌కు పెరిగిన వరద

  కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద పెరిగింది. ఇన్‌ఫ్లో 45,982 క్యూసెక్కులు ఉండగా.. 45,800 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువకు ప్రవహించాయి. ఆయకట్టుకు 182 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.9 అడుగుల మేరకు నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.  

పాల నురగలతో పరవళ్లు 

శ్రీశైలం : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నమోదవుతున్నది. పాల పొంగుతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 2,81,170 క్యూసెక్కులు విడుదల చేయగా.. శనివారం సాయంత్రం వరకు శ్రీశైలం డ్యాంకు 3,98,980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పది గేట్లను పదిహేను అడుగుల ఎత్తుకు తెరిచి 3,77,160 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 26,777 క్యూసెక్కులు కలిపి మొత్తం 4,03,937క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.50 అడుగులకు చేరింది. సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా.. 212.9198 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

సరళాసాగర్‌కు జలకళ

మదనాపురం : మండలంలోని శంకరమ్మపేట సమీపంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకున్నది. 11 ఏండ్ల తర్వాత ఆటోమెటిక్‌ సైఫన్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఐదు రోజులుగా 6 నుంచి 10 వరకు ఉడ్‌, ప్రైమింగ్‌ సైఫన్లు తెరుచుకొని రోజుకు సుమారుగా 20వేల క్యూసెక్కుల వరద విడుదలవుతున్నది. దిగువన మదనాపురం మారెడ్డిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. 

రామన్‌పాడు జలాశయానికి వరద చేరుకోవడంతో వచ్చిన వరదను వచ్చినట్లుగా అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మదనాపురం-ఆత్మకూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. సైఫన్లు తెరుచుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి ప ర్యాటకులు భారీగా తరలొస్తున్నారు.